
‘‘నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం. ఇంజనీరింగ్ చదివే రోజుల్లో కొంతమంది తెలుగు ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. వారిని అడిగి తెలుగు పదాలు, వాక్యాలు ఓ లిస్ట్‌గా రాసుకుని, నేర్చుకోవడం మొదలుపెట్టాను. అప్పట్నుంచే తెలుగు మాట్లాడటం అలవాటైంది. సినిమా సెట్స్‌లో తెలుగువాళ్లను తెలుగులోనే మాట్లాడమని చెప్పి, నేను కూడా వారితో తెలుగులోనే మాట్లాడతాను. అయితే తెలుగులో నేను ఇంకాస్త బెటర్ కావాలి.
అందుకే ‘తెలుసు కదా’ చిత్రానికి డబ్బింగ్ చెప్పలేకపోయాను. ఇకపై నా ప్రతి సినిమాకు నేనే డబ్బింగ్ చెబుతాను’’ అని హీరోయిన్ శ్రీనిధి శెట్టి అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం ‘తెలుసు కదా’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీనిధి శెట్టి చెప్పిన సంగతులు.
⇒ ‘తెలుసు కదా’ మంచి ఫీల్ గుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా. ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు అనగానే అందరూ ఇది ట్రయాంగిల్ లవ్‌స్టోరీ మూవీ అనుకుంటారు. కానీ ఇందులో మేం ఓ కొత్త అంశాన్ని చూపించాం. ఆ అంశం ఏమిటి? అనేది థియేటర్స్‌లో చూసినప్పుడు ఆడియన్స్ సర్‌ప్రైజ్ అవుతారు. వరుణ్ (సిద్ధు పాత్ర పేరు), రాగ (శ్రీనిధి), అంజలి (రాశీ ఖన్నా) క్యారెక్టర్స్‌కు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. మా పాత్రల్లో కొంచెం గ్రే షేడ్స్ ఉన్నాయి. దర్శకురాలు నీరజ విజన్ ప్రేక్షకులకు నచ్చుతుంది.
⇒ తెలుగులో నా తొలి సినిమాగా ‘హిట్ 3’ విడుదలైంది. కానీ తెలుగులో నేను సైన్ చేసిన తొలి సినిమా ‘తెలుసు కదా’. ‘కేజీఎఫ్, కోబ్రా, హిట్ 3’ వంటి వరుస యాక్షన్ సినిమాలు చేసిన తర్వాత చేసిన రొమాంటిక్ మూవీ ‘తెలుసు కదా’ నాకు కొత్తగా అనిపించింది. ఇందులో నేను పోషించిన రాగ పాత్రకు, రియల్ లైఫ్‌లో నాకు పెద్దగా పోలికలు లేవు.
⇒ ఓ నటిగా అన్ని రకాల జానర్ సినిమాలు చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా కమిట్ అయ్యాను.