SPB: ఎస్పీ బాలు జయంతి: వంద మంది సింగర్స్‌తో స్వర నీరాజనం

SP Balasubrahmanyam Birth Anniversary: 12 Hours Non Stop Musical Tribute To Legend SPB - Sakshi

తెలుగు వారికి పాటంటే బాలు, మాటంటే బాలు అనుకునేంత చనువు ఏర్పడటానికి కారణం దాదాపు 50 ఏళ్ల ఆయన సినిమా పాటల ప్రయాణం. జూన్‌ 4వ తేది బాలుగారి జయంతి (పుట్టినరోజు). ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని సినీ మ్యూజిషియన్స్‌ యూనియన్‌ రవీంద్రభారతిలో ‘‘బాలుకి ప్రేమతో’’ అంటూ దాదాపు 100 మంది సినిమా మ్యూజిషియన్స్‌తో పాటల కచేరిని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సినీ మ్యూజిషియన్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు ఆర్‌.పి పట్నాయక్‌ మాట్లాడుతూ– ‘‘బాలు గారంటే మా అందరికీ ప్రాణం. మా అందరికీ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి. ఆయన పుట్టినరోజు సందర్భంగా జూన్‌ 4 ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకు 12 గంటలపాటు సంగీత విభావరిని చేస్తూ బాలు బర్త్‌డేని కన్నులపండుగగా సెలబ్రేట్‌ చేస్తున్నాం’’ అన్నారు.

సినీ మ్యూజిషియన్స్‌యూనియన్‌ ప్రెసిడెంట్‌ విజయలక్ష్మీ మాట్లాడుతూ.. ‘‘ 30ఏళ్ల చరిత్ర ఉన్న మా  సినిమా మ్యూజిక్‌ యూనియన్‌లో 1500మంది సభ్యులకు పైగా సభ్యులు ఉన్నారు. కొత్తగా సింగర్స్‌ అవుదామనుకునేవారికి, మ్యూజిషియన్స్‌కి మా యూనియన్‌ తొలిమెట్టు. మా వద్ద సభ్యులై ఉంటే వారు సినిమా, టీవీ, ఓటిటి ఇలా ఎక్కడ పనిచేసినా వారికి మా సంస్థతరపునుండి పూర్తి సహాయ,సహకారాలను అందచేస్తాము అని చెప్తున్నాము. బాలుగారు మా కులదైవం. ఆయన దగ్గరుండి 2019లో మా యూనియన్‌ సభ్యులకోసం ఫండ్‌రైజింగ్‌ కార్యక్రమం నిర్వహించారు.  అద్భుతమైన ఆ ప్రోగ్రామ్‌ని కన్నులపండుగలా జరిపి మా అందరికీ మార్గదర్శకులుగా ఉండి మా వెన్నంటి నిలిచారు బాలుగారు. దురదృష్టవశాత్తు ఆయనను కోల్పోయాం. అప్పుడు ఆయనకు సరిగ్గా ట్రిబ్యూట్‌ కూడా ఇవ్వలేదే అన్న వెలితి మాలో ఉంది. జూన్‌ 4 ఆయన జయంతిని పురస్కరించుకుని యూనియన్‌ ప్రతినిధులుగా నేను, వైస్‌ ప్రెసిడెంట్‌ జైపాల్‌రాజు, సెక్రటరీ రామాచారి, జాయింట్‌ సెక్రటరీ మాధవి రావూరి, ట్రెజరర్‌ రమణ శీలంలు మా యూనియన్‌లోని 1500మంది సభ్యులకు ప్రతినిధులుగా ‘‘బాలుకి ప్రేమతో’’ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి పాటతో పాటు, బాలు గారి అభిమానులతోపాటు ఆయన మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే’’ అన్నారు.

సి.యం.యు ట్రెజరర్‌ రమణ శీలం మాట్లాడుతూ–‘‘ తెలుగుపాటకు నిలువెత్తు సంతకం మా బాలు గారు. వారు లేరు అని మేము ఎప్పుడు అనుకోలేదు. ఆయన మాతోపాటే ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారని అనుకుంటున్నాం’’ అన్నారు. వైస్‌ ప్రెసిడెంట్‌ జైపాల్‌రాజు మాట్లాడుతూ– ‘‘బాలుగారి టీమ్‌లో మ్యూజిషియన్‌గా దాదాపు 25ఏళ్లపాటు పనిచేశాను. ఆయనతో ఎంతో అనుబంధం ఉంది’’ అన్నారు. ఇండియన్‌ ఐడల్‌ సింగర్‌ శ్రీరామచంద్ర మాట్లాడుతూ–‘‘ బాలుగారంటే మా జనరేషన్‌ సింగర్స్‌ అందరకీ ఇన్స్‌పిరేషన్‌. ఆయనతో పాటు పాడే అవకాశం నాకు అనేకసార్లు వచ్చింది’’ అని గుర్తు చేసుకున్నారు. సింగర్‌ కౌసల్య మాట్లాడుతూ–‘‘మీరందరూ పాల్గొని ‘‘బాలుకి ప్రేమతో’’ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top