
టైటిల్: సోలో బాయ్
నటీనటులు: గౌతమ్ కృష్ణ, శ్వేతా అవస్థి, రమ్య పసుపులేటి, పోసాని కృష్ణ మురళి, అనితా చౌదరి, షఫీ, ఆర్కే మామ, భద్రమ్, ఆనంద్ చక్రపాణి, సూర్య, ల్యాబ్ శరత్, అరుణ్ కుమార్, రజినీ వర్మ తదితరులు
నిర్మాణ సంస్థ : సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్
నిర్మాత : సెవెన్ హిల్స్ సతీష్ కుమార్
దర్శకత్వం : పి. నవీన్ కుమార్
సంగీతం: జుడా సాండీ
సినిమాటోగ్రఫీ:త్రిలోక్ సిద్ధు
విడుదల తేది: జులై 4, 2025
బిగ్‌బాస్ షోతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు గౌతమ్ కృష్ణ. అంతకు ముందు హీరోగా ఒకటి రెండు సినిమాల్లో నటించినా..అంతగా గుర్తింపు రాలేదు కానీ, బిగ్‌బాస్‌లోకి వచ్చిన తర్వాత ఫేమస్ అయ్యాడు. ఈ యంగ్ హీరో నటించిన తాజా చిత్రం ‘సోలో బాయ్’. రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ..ఎట్టకేలకు నేడు(జులై 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
సోలో బాయ్ కథేంటంటే..?
కృష్ణమూర్తి (గౌతమ్ కృష్ణ) మిడిల్ క్లాస్ యువకుడు. తల్లిదండ్రులు (పోసాని కృష్ణ మురళి, అనితా చౌదరి) అతన్ని ఉన్నంతలో అల్లారు ముద్దుగా పెంచుతాడు. ఇంజనీరింగ్ కాలేజీలో ప్రియ(రమ్య పసుపులేటి)తో ప్రేమలో పడతాడు. ఉద్యోగం వచ్చాక..పెళ్లి చేసుకుందామని ప్రియని అడగ్గా.. ‘నా డ్రైవర్‌కి కూడా నీ కంటే ఎక్కువ జీతం వస్తుంది’ అని అవమానించి బ్రేకప్ చెబుతుంది. ఆ బాధతో కృష్ణమూర్తి తాగుడుకు బానిసైపోతాడు. తండ్రి ప్రోత్సాహంతో మళ్లీ మాములు మనిషిగా మారి ఉద్యోగంలో చేరిన కృష్ణమూర్తి జీవితంలోకి శ్రుతి(శ్వేత అవస్తి) అనే అమ్మాయి వస్తుంది. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. జీవితం సాఫీగా సాగుతుందన్న సమయంలో తండ్రి మరణిస్తాడు. అదే సమయంలో ఆర్థిక పరిస్థితుల కారణంగా భార్య శ్రుతి విడాకులు ఇస్తుంది. ఒకవైపు తండ్రి మరణం, మరోవైపు భార్య విడాకులు.. వీటన్నింటిని తట్టుకొని కృష్ణ మూర్తి మిలియనీర్‌గా ఎలా ఎదిగాడు? అనేదే సోలోబాయ్ కథ.
విశ్లేషణ
ఓ మధ్యతరగతి యువకుడి సక్సెస్ స్టోరీ ఇది. చేతిలో రూపాయి కూడా లేని ఓ యువకుడు తన కష్టంతో, తెలివి తేటలతో చివరకు ఎలా కోటీశ్వరుడు అయ్యాడనేదే సోలోబాయ్ కథ. ఇలాంటి కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. అయితే వాటి ఛాయలు ఇందులో కనిపించకుండా చేయడంతో దర్శకుడు కొంతమేర సక్సెస్ అయ్యాడు. రొటీన్ కథే అయినా.. కథనం కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి కనెక్ట్ అయ్యే విధంగా ఈ కథను తీర్చిదిద్దారు. మధ్యతరగతి కుటుంబంలో ఉండే బాధలు, అవమానాలు తెరపై కళ్లకు కట్టినట్లు చూపించారు. కాలేజీ సీన్లు యువతను ఆకట్టుకుంటాయి.
ఫస్టాఫ్‌లో కథ కృష్ణమూర్తి కాలేజీ లైఫ్.. పెళ్లి..విడాకులు చుట్టు తిరుగుతుంది. సెకండాఫ్‌లో కృష్ణమూర్తి ఎలా కోటీశ్వరుడు అయ్యాడనేని చూపించారు. మధ్యలో దళారి వ్యవస్థ రైతులను ఎలా మోసం చేస్తుందనే పాయింట్ కూడా ఉంటుంది. అయితే దాన్ని అలా టచ్ చేసి మళ్లీ రొటీన్ కథలోకి వెళ్లిపోయారు.
ఈ సినిమాలో కృష్ణమూర్తి పాత్రలో గౌతమ్ కృష్ణ సంపూర్ణ నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకుంటూ ఎమోషన్స్ నుండి ప్రతి సీన్లను ప్రేక్షకులను మెప్పించారు. ప్రియా క్యారెక్టర్ లో రమ్య పసుపులేటి సినిమాలో కనిపించే స్క్రీన్ టైమ్ తక్కువ అయినప్పటికీ మంచి మంచి ఇంపాక్ట్ ఉండే పాత్రగా నిలిచారు. అలాగే శ్వేత అవస్తి మంచి పర్ఫామెన్స్ తో తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. పోసాని మురళి, అనిత చౌదరి హీరోకు తల్లిదండ్రులుగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాతావరణం లో చాలా బాగా నటించారు. అలాగే భద్రం, షఫీ, చక్రపాణి తదితరులు తమ పాత్రల పరిధిలో నటిస్తూ చిత్రానికి బోనస్గా నిలిచారు. సినిమాలోని పాటలు సిచువేషన్ కి తగ్గట్లు బీజీయంతో సినిమాను మరో మెట్టు పైకి వెళ్లే విధంగా సంగీత దర్శకుడు సహాయపడ్డాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.