స్మిత సరికొత్త సంగీత ప్రయాణం! | Singer Smitha Tattvamasi Spiritual musical journey 100 weeks | Sakshi
Sakshi News home page

స్మిత సరికొత్త సంగీత ప్రయాణం!

May 14 2026 11:23 PM | Updated on May 14 2026 11:33 PM

Singer Smitha Tattvamasi Spiritual musical journey 100 weeks

పాప్ పాట నుంచి పక్కకొచ్చి ‘తత్త్వమసి’ ప్రయోగం

వారానికో తత్త్వం... 100 శనివారాలు... 100 తత్త్వాలు...

నవతరానికి నచ్చేలా గాయని స్మిత తత్త్వగీతాల పర్యటన

నిత్యం ఏదో ఒక కొత్త ప్రయోగంతో జనంలోకి వచ్చి... సరికొత్తగా వార్తల్లో నిలిచే ప్రముఖ గాయని స్మిత. తాజాగా ఆమె మళ్ళీ అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. కాకపోతే, ఇప్పటి వరకు ర్యాప్, పాప్ లాంటి పాటలతో అలరించిన ఆమె ఈసారి అందుకు పూర్తి భిన్నమైన దోవ తొక్కుతున్నారు. మానవ జీవిత పరమార్థాన్ని వివరిస్తూ, మనసును మేలుకొలిపి, చిత్తాన్ని చైతన్యం చేసే తత్వాలను ఆలపిస్తూ, జనం ముందుకు రానున్నారు. తరతరాలుగా మనకు సంస్కృతీ వారసత్వంగా వస్తున్న తెలుగు, సంస్కృత సాహిత్యాల్లోని సుప్రసిద్ధమైన తాత్త్విక కృతులను ఎంచుకొని, వాటిని తనవైన కొత్త బాణీలలో, క్రొంగొత్త ఆర్కెస్ట్రయిజేషన్‌తో ‘తత్త్వమసి... (ఉపశీర్షిక - నాద టు నిర్వాణ)’ పేరిట నవ తరానికి అందించనున్నారు.

మన చిన్నప్పుడు ఒక దశలో పెద్దవాళ్ళు పిల్లలందరికీ సుమతీ శతకం, వేమన శతకం చెప్పేవారు. మన సినిమాల్లో, రేడియోలో రకరకాల తత్త్వాలు వినిపించేవి. సినీ దర్శకుడు దేవా కట్టా అన్నట్టు, “దురదృష్టవశాత్తూ, మనం, మన సినిమాలు ఆ ఘన సంస్కృతీ వారసత్వాన్ని వదిలేసుకున్నాం. కనీసం బయటైనా అలాంటివి వినడానికీ, స్మిత చేస్తున్న ఓ మంచి ప్రయత్నమే ఇది”. మన భాష, సాహిత్యం, సంస్కృతుల ఖజానా నుంచి ఓ వంద ఆణిముత్యాలను ఏర్చికూర్చి, ఒక్కొక్కటిగా ‘తత్త్వమసి’లో స్మిత అందించనున్నారు. అలా “తరువాతి తరాలకు మన తాత్త్విక చింతనా వారసత్వాన్ని అందించనున్నారు”.

శివరాత్రితో స్మిత అనుబంధం... ప్రకృతి ఆదేశం...

‘ఓజీ... క్వీన్ ఆఫ్ పాప్’ అంటూ పాప్ పాటలతో గాయని స్మిత వివిధ ప్రాంతాలకు పర్యటించాలని ప్రయత్నాలు సాగుతున్న సమయంలో ఉన్నట్టుండి ఎదురైన ఈ ట్విస్టు ఏమిటని ఎవరికైనా అనిపిస్తుంది. అదే అడిగితే, స్మిత సైతం ఇదంతా చిత్రంగా జరిగిందని ఒప్పుకుంటున్నారు. “మ్యూజిక్ వీడియోలు చాలా ఏళ్ళ క్రితమే చేసేశాను. పేరు తెచ్చిన ఆ పాప్ పాటలను జనం ఎదుట వేదిక మీద పాడుతూ, ప్రదర్శన ఇవ్వాలంటే చాలా సన్నద్ధత కావాలి. అందుకే, ‘ఓజీ... క్వీన్ ఆఫ్ పాప్’ టూర్‌కి డేట్లు అడిగినప్పుడు... ‘దాన్ని పక్కాగా డిజైన్ చేసి, శారీరకంగా, మానసికంగా సన్నద్ధమయ్యేందుకు కొద్దిగా సమయం కావాల’ని అడిగాను. ఇంతలో ఈ తత్త్వాలను పాడాలనే ఆలోచన వచ్చింది” అని ఆమె వివరించారు.

రెండు, మూడు నెలల క్రితం శివరాత్రి సందర్భంగా స్మిత వల్లూరుపల్లి, మరో సినీ నేపథ్య గాయని తిరుమల శ్రీనిధి కలసి ‘ఏమి సేతురా లింగా...’ అనే ప్రసిద్ధమైన శివతత్త్వాన్ని కొత్త రీతిలో ఆలపించారు. ఆ గీత రూపకల్పన ఒక రకంగా ఈ భారీ తత్త్వాల ప్రాజెక్ట్‌కు అనుకోని రీతిలో నాంది అయింది. “నిజం చెప్పాలంటే, మహాశివరాత్రికీ, నా జీవితానికీ ఏదో తెలియని బంధం ఉంది. కీలకమైనవెన్నో జరుగుతుంటాయి. ప్రతి ఏటా శివరాత్రి వచ్చిందంటే, ఏదో అతీత శక్తి అంతకు ముందు వరకు అసలు ప్లాన్ చేయనిది ఏదో నేను చేసేలా ముందుకు నెడుతుంది. అలా చేసిన ప్రతిదీ ఓ అద్భుతంగా ఆవిష్కృతమవుతూ ఉంటుంది. ఆత్మ చైతన్యం వైపు నడిపిస్తూ ఉంటుంది. ఈ ఏడాది కూడా అలాంటిదే జరిగింది. ‘ఏమి సేతురా లింగా...’ తత్త్వం పాడగానే, మరిన్ని పాడాలంటూ ప్రకృతి రకరకాల మనుషులు, మార్గాల ద్వారా చెప్పినట్టయింది. అంతే... అలా ఈ 2026లో ఈ ఆధ్యాత్మిక గాన ప్రయాణంలో అడుగులు వేస్తున్నాను” అని స్మిత వివరించారు.

ఇంతకీ, ప్రకృతి ఆదేశం ఎవరెవరి నుంచి, ఎలా వచ్చిందంటారా? “శివరాత్రికి చేసిన ‘ఏమి సేతురా లింగా...’ తత్త్వం ఫైనల్ అవుట్ పుట్ మా అమ్మ (జోగులాంబ), మిత్రుడు దేవా కట్టా వింటున్నారు. ఆ సమయంలో... ‘నువ్వు ఒకటి కాదు... ఇలాంటి తత్త్వాలు 100 రికార్డు చేయాలి’ అని దేవా కట్టా అన్నారు. అలాగే, ఆ తర్వాత... సిద్ధవైద్యం ‘చక్రసిద్ధ’తో అనారోగ్యాలను దూరం చేసే సింధుజ అమ్మ సైతం ‘ఈ తత్త్వాలు నువ్వు పాడాలి’ అని నాతో అన్నారు. అలా ఆ మాటలన్నీ నాకు ప్రకృతి ఆదేశంగా అనిపించాయి. అలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది. నా దృష్టిలో ఇది చేస్తున్నది నేను కాదు. ఈ పని చేయడానికి ప్రకృతి నన్ను ఓ సాధనంగా ఎంచుకుంది. అంతే!” అని స్మిత జరిగిన కథ చెప్పుకొచ్చారు. అలా పాప్ పాటల ‘ఓజీ... క్వీన్ ఆఫ్ పాప్’ పర్యటన కాస్తా అనూహ్యంగా ఇప్పుడు ‘తత్త్వమసి’ అయింది.

అటు ఆధునిక పాప్... ఇటు ఆధ్యాత్మిక చింతన...

ఆధునిక పాప్ గీతాలు, ఆధ్యాత్మిక తాత్త్విక చింతన... ఈ రెండు భిన్న ధ్రువాలను స్మిత ఎలా సంబాళించుకుంటారు? “నిజమే. ‘ఓజీ... క్వీన్ ఆఫ్ పాప్‌’కీ, ‘తత్త్వమసి’కీ సంబంధమే లేదు. అది ఆలోచన నుంచి వస్త్రధారణ దాకా అంతా మెరుపులు, తళుకులతో సాగితే, ఇందులో ప్రశాంతత, ఆధ్యాత్మికత, చేనేత వస్త్రాలు చోటుచేసుకుంటాయి. తత్త్వాలు పాడినంత మాత్రాన నాలోని ఆ పాప్ పార్శ్వం చచ్చిపోలేదు, చచ్చిపోదు. గాయనిగా ఈ రెండు భిన్న కోణాలనూ చూపడం నాకిష్టం. ఈ రెండు విభిన్న ప్రపంచాల మధ్య నా సింగింగ్ జర్నీ సాగుతూనే ఉంటుంది” అని స్థిరచిత్తంతో చెప్పారు స్మిత.

బలమైన సంకల్పం... భగవదేచ్ఛ...

‘తత్త్వమసి’ లాంటి ప్రాజెక్టులు చేయడం అంత సులభమేమీ కాదు. కచ్చితంగా “ఉద్వేగం నిండిన ఓ పిచ్చి ప్రేమ లాంటిది ఏదో ఉండాలి. నాలో అది ఉంది. నన్ను ఎవరన్నా సవాలు చేశారంటే చాలు... దాన్ని నేను ఆషామాషీగా తీసుకోను. బలంగా బదులిస్తా. చిన్నప్పటి నుంచి నన్ను చూసినవారికి నాలోని ఆ లక్షణం, ఆ వ్యక్తిత్వం బాగా తెలుసు. అలాంటి ఛాలెంజ్ ఎదురైనప్పుడల్లా నాలోని ఏదో శక్తి బయటకు వచ్చి, ఆ సవాలును స్వీకరించి, దృఢంగా జవాబిస్తుంది. ప్రతిసారీ అదే జరుగుతుంటుంది. ఈసారీ అదే జరిగింది. అందుకే, ఇప్పుడు ఎవరు ఏది మాట్లాడినా, ఏ ప్రస్తావన తెచ్చినా ఆవు కథలాగా నా మాట, పాట, ప్రస్తావన తత్త్వంలోకే వెళుతోంది. దీన్నిబట్టి ఇది ఎంతటి బలమైన సంకల్పమో, ఎంతగా భగవదేచ్ఛో అర్థం చేసుకోవచ్చు” అని స్మిత చెప్పుకొచ్చారు.

స్మిత తల్లి జోగులాంబ సైతం, “మా అమ్మాయి ఎప్పుడూ ఏదో ఒక క్లిష్టమైన ప్రాజెక్ట్ చేపడుతుంది. ఎందుకింత కష్టం అనుకొనే లోగా, దానిలో పూర్తిగా లీనమై పని చేసేస్తుంది. నిజం చెప్పాలంటే, ఇది ఆమె చేస్తున్నది కాదు... ఏదో ఒక దైవిక శక్తి జోక్యంతో సాగుతున్న ప్రయాణం” అని అభిప్రాయపడ్డారు. “దేవుడు ఏదో ఒక నిర్ణీతమైన ప్రణాళికతోనే ప్రతి జీవినీ పంపిస్తాడు. బహుశా స్మితను ఈ వైవిధ్యభరిత ప్రయాణం కోసమే పంపి ఉంటాడు” అని దర్శకుడు నాగ్ అశ్విన్ వ్యాఖ్యానించారు.

ప్రతి శనివారం ఓ తత్త్వం! వంద వారాల బృహత్ ప్రయత్నం!

ఇప్పటికే 8 తత్త్వాల గానం, చిత్రీకరణ చేసిన స్మిత మే 16వ తేదీ శనివారం నుంచి వారానికో గీతంతో 100 వారాల పాటు ప్రజల్ని పలకరించనున్నారు. ఆదిశంకరుల ‘భజగోవిందం’ నుంచి అన్నమయ్య సంకీర్తన ‘బ్రహ్మమొక్కటే...’ దాకా అనేకం ఆ వరుసలో రానున్నాయి. ‘తెలిసితే మోక్షము తెలియకున్న బంధము...’, ‘ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు...’ (అన్నమయ్య అధ్యాత్మ సంకీర్తనలు), ‘ఎక్కడ మానుష జన్మంబెత్తిన ఫలమేమున్నది…’ (తాళ్ళపాక పెద తిరుమలాచార్య రచన), ‘మానస సంచరరే...’ (సదాశివ బ్రహ్మేంద్రుల కీర్తన)... ఇలా అనేకం ఆ వరుసలో రానున్నాయి.

అలాగే, అనుభూతి ప్రధానమైన ఈ తత్త్వాలను ప్రేక్షకుల ముందు స్మిత బృందం గానం చేస్తూ, దేశదేశాల్లో అనుభూతి ప్రధానమైన ప్రదర్శనలు ఇవ్వాలని ప్రణాళికా రచన చేస్తున్నారు. ‘ఇండియన్ రాగాస్’ సంస్థ, అలాగే గతంలో ఇళయరాజా – ఏ.ఆర్. రెహమాన్ – కీరవాణి లాంటి పలువురు సుప్రసిద్ధ సంగీత దర్శకుల లైవ్ షోలను నిర్వహించిన ‘దక్షిణ్ స్టోరీస్’ సంస్థ ఈ బృహత్తర ప్రయత్నంలో స్మితకు తోడుగా నిలిచి, ముందడుగు వేస్తున్నాయి. కొన్ని తరాలుగా సంప్రదాయ వస్త్రశ్రేణితో ముడిపడిన కంకటాల సంస్థ ఈ తత్త్వమసిలో తొలి సీజన్ అయిన ప్రథమ పాదాన్ని సమర్పిస్తోంది.

“ఆదిశంకరుల ‘నిర్వాణ షట్కం’, అన్నమాచార్యుల కీర్తనలు, వేమన సాహిత్యం లాంటివన్నీ భవబంధనాలను తెంచుకొని విముక్తమై, ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను చేరిన మహోన్నతుల అద్భుత రచనలు. శతాబ్దాలుగా తెలుగు వారి జీవితంలో భాగమైపోయిన కాలాతీతమైన రచనలు. వాటి లోతైన అర్థం అవగాహన చేసుకొని, అందరికీ తెలిసేలా పాడడం నాకు ఆత్మతృప్తినిస్తోంది” అని స్మిత చెప్పారు. ఈ ప్రాచీన తత్త్వాలకు వాద్యగోష్ఠి, బాణీలలో వాయులీన విద్వాంసులు సాయి, అలాగే సుజన్, సహా ప్రతిభావంతులైన సంగీత కళాకారులు పలువురు పాలుపంచుకుంటూ ఉండడం విశేషం. అలాగే, స్మిత తదితర సినీ, కళా ప్రముఖులెందరో ఉంటున్న భారీ కమ్యూనిటీ గృహ సముదాయంలోనే నివసిస్తున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి ఈ తత్త్వాలకు వీడియో చిత్రీకరణలో కీలక భూమిక వహించడం మరో విశేషం.

అమ్మ, అమ్మమ్మల ప్రభావంతో...

“మనం బయట వెతుకుతున్న సత్యం... ఇప్పటికే మనలోనే ఉందని గుర్తుచేసే శాశ్వత సందేశం ఈ తత్త్వమసి” అంటూ ఈ ప్రాజెక్టు విశేషాలను గాయని స్మిత ఇటీవల వెల్లడించారు. అత్యంత సన్నిహితులైన కొందరు సినీ ప్రముఖులతో పాటు ఆప్తులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యుల మధ్య ఆ ప్రారంభ పరిచయోత్సవం ఆత్మీయంగా జరిగింది. గాయకుడు హేమచంద్ర సంధానకర్తగా వ్యవహరించిన ఆ ఉత్సవంలో ప్రాజెక్ట్ పరిచయాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్, స్మిత బృందం రూపొందించిన తత్త్వాల ఆడియో గ్లింప్స్‌ను ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సత్యవాణి ఆవిష్కరించి, అభినందించారు. కొన్ని తత్త్వాల దృశ్యఖండికలను వెండితెరపై ప్రత్యేకంగా ప్రదర్శించారు.

తత్త్వాలను పాడుతున్నప్పుడు వాటి వీడియో చిత్రీకరణతో పాటు ఆ పాటల భావార్థాలను పక్కనే ఇంగ్లీషు లిపిలో వేయడం విశేషం. తెలుగు తెలియనివారికి కూడా ఆ తత్త్వాల అంతరార్థం తెలిసేందుకు ఈ ఆలోచన ఉపకరిస్తుంది. “స్మిత ఆలోచన, ఆచరణ ఏదైనా మితంగా ఉండదు. అపరిమితంగా ఉంటుంది. బహుముఖ ప్రజ్ఞ గల అమ్మమ్మ తేళ్ళ లక్ష్మీకాంతమ్మ, అమ్మ జోగులాంబల ప్రభావం స్మితపై ఎంతో ఉంది. ‘నాదాధీనం జగత్సర్వం’ అన్నారు పెద్దలు. ఆ నాదాన్ని పట్టుకొని, ఈ తరానికి ఆమె అందిస్తున్న అద్భుతమైన ఆధ్యాతిక ఔషధ గుళిక ఈ ‘తత్త్వమసి’ ” అని సత్యవాణి అనర్గళంగా ఉపన్యసిస్తూ, గాయనిని ఆశీర్వదించారు.  

“స్మిత ఓ లేడీ అపరిచితుడు!”: హీరో నాని

ప్రముఖ హీరో నాని ఈ తత్త్వాల ఆలోచనను అమితంగా మెచ్చుకున్నారు. “నాకు రక్తసంబంధీకులైన అక్కాబావ ఒకరైతే, దేవుడిచ్చిన అక్కాబావలు స్మిత దంపతులు. నా దృష్టిలో చాలామంది కన్నా భిన్నమైన, అరుదైన వ్యక్తి స్మిత. ఏ మాత్రం అలసిపోకుండా, ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. బాస్కో సీజర్ కొరియోగ్రఫీలో పాప్ గీతాలు పాడుతూ, డ్యాన్సులు చేసే అదే వ్యక్తి... ఎంతో భక్తి, వేదాంతాలతో అంతే అద్భుతంగా ఇలా తత్త్వాలూ పాడుతుంది. (చమత్కార ధోరణిలో...) నిజం చెప్పాలంటే, శంకర్ దర్శకత్వంలో విక్రమ్ నటించిన ‘అపరిచితుడు’ చిత్రంలో లాగా ఆమె ఓ లేడీ అపరిచితుడు. మా కమ్యూనిటీలోని స్మిత వాళ్ళ ‘బి-10’ ఫ్లాట్ తలుపు తడితే... (నవ్వుతూ...) ఆమె ఎప్పుడు శుద్ధ సంప్రదాయ రామాచారి ఫక్కీలో తలుపు తీస్తుందో, ఎప్పుడు ఆధునిక కాలపు రెమో ధోరణిలో వ్యవహరిస్తుందో తెలియదు. అందుకే, ఆమె ఓ సెపరేట్ పీస్” అని నాని తన మనోభిప్రాయాలు పంచుకున్నారు.

నిజానికి, పాటలు, ఇలాంటి తత్త్వాలంటే చెవి కోసుకునే హీరో నానితో కూడా ఈ తత్త్వాలలో గొంతు కలిపేలా చేయాలని స్మిత భావించారట. కానీ, హీరో నాని మాత్రం “నాకు పాటలు వినడం చాలా ఇష్టం. అలాగని నన్ను పాడమంటే ఎలా” అంటూ సున్నితంగానే ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారు. లేదంటే, హీరో నాని గొంతు కూడా ఈ వినూత్న ప్రాజెక్ట్‌లో వినిపించేంది.  

వైజాగ్ సహా వివిధ ప్రాంతాల్లో త్వరలో లైవ్ షోస్!

    “విజయవాడ రోజుల నుంచి గత 40 ఏళ్ళుగా స్మిత నాకు బాగా తెలుసు. అయిదేళ్ళ వయసుకే తాను ఏమవుతానో చెప్పేది. నటి, ప్లేబ్యాక్ సింగర్, పాప్ సింగర్... ఇలా ఏ వయసుకు ఆ వయసులో ఎప్పటికప్పుడు తాను అవదలుచుకున్నదల్లా చెప్పేది. చెప్పిందల్లా చేసి, చూపించింది. దటీజ్ స్మిత” అని నిర్మాత స్వప్నాదత్ తన చిరకాల అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. స్వప్నాదత్ సహా సినీ ప్రముఖులు నాని, ఐశ్వర్యా రాజేశ్, అల్లరి నరేశ్, సుబ్బరాజు, దర్శకులు నాగ్ అశ్విన్, దేవా కట్టా, స్మిత భర్త శశాంక్ కంచర్ల, తల్లి జోగులాంబ, తదితరులు కలసి ‘తత్త్వమసి’ ప్రాజెక్ట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. “ఎవరి మాటా వినని సీతయ్య లాగా... ఎవరి మాటా వినదు స్మితక్క. నచ్చినది చేసుకుంటూ ముందు వెళుతుంది” అంటూ ‘అల్లరి’ నరేశ్ చమత్కరించారు. “ఈ తత్త్వాల ప్రయోగం తర్వాత యోగి వేమన లాగా యోగిని స్మిత అంటారేమో” అని సుబ్బరాజు ఛలోక్తి విసిరారు. “ఈ తత్త్వాల వీడియో నాకు కళ్ళు తెరిపించే అనుభవం. పాటల గానంతో పాటు ఆ పాటల చిత్రీకరణ వేళ ఆధ్యాత్మికతను ప్రతిఫలిస్తూ స్మిత చేసుకున్న వస్త్రధారణ, అలంకరణ కూడా కళ్ళకు ఇంపుగా ఉన్నాయి” అని హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ జనం నవ్వుల మధ్య, స్మితకు ప్రత్యేక ప్రశంసలు కురిపించారు.

    స్మితతో పుష్కరకాలం క్రితం పరిచయమై, ఇప్పుడు ఆ పరిచయమే ఓ ప్రపంచంగా మారిపోయిందంటున్న దర్శకుడు దేవా కట్టా మాటల్లో చెప్పాలంటే, “స్మిత ఓ ర్యాడికల్. ఎప్పుడూ ఒకే పని చేస్తూ కూర్చుండిపోకుండా, నూతనత్వం వైపు ప్రయాణించే వ్యక్తి. స్థిరపడిపోయిన భావాలపై తిరుగుబాటు చేసే రెబెలియన్. ఒకసారి నిర్ణయం తీసుకుంటే, ఎంత కష్టమైనా సరే అనుకున్నది చేసే తీరే రకం”. వరుసగా వంద వారాల్లో 100 తత్త్వాల ఆడియో, వీడియో విడుదల, వివిధ ప్రాంతాల్లో షోల నిర్వహణ లాంటి సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ప్రయత్నానికి బహుశా అలాంటి వ్యక్తిత్వం, కృత నిశ్చయమే కావాలి. ఈ విషయంలో ‘తత్త్వమసి’ (అది నువ్వే) అంటున్న శ్రేయోభిలాషులతో పాటు తానూ అదే బలంగా నమ్ముతున్న స్మితకు ఆల్ ది బెస్ట్!

పాతికేళ్ళ పైచిలుకు క్రితమే తెలుగు పాప్ పాటల రంగంలో ‘హాయ్ రబ్బా’ అంటూ తొలి ఆల్బమ్‌తోనే సంచలనం రేపిన చరిత ఆమెది. ఇప్పుడీ ‘తత్త్వమసి’ పేరిట హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాలతో పాటు, విదేశాల్లోనూ స్మిత చేయదలుచుకున్న ఈ అనుభూతి ప్రధాన తత్త్వాల ప్రత్యక్ష కచ్చేరీలు సైతం మరో ట్రెండ్ సృష్టిస్తాయేమో చూడాలి. “ఇది కేవలం ఆడియో ఆల్బమ్ కాదు... అలాగని వీడియోనే కాదు... సంప్రదాయ సంగీత కచ్చేరీ కాదు... ప్రవచనాల బోధ కాదు... ప్రజల మనసుకు దగ్గరై, వారిని అనుభూతికి లోను చేసే ప్రత్యక్ష ప్రదర్శన” అంటున్నారు స్మిత. ఆమెకు అన్ని విషయాల్లో అండగా నిలిచే ఆమె భర్త ఓ సామాన్య శ్రోతగా అన్నట్టు, “పరుగులు తీస్తున్న ఈ ఆధునిక, రణగొణధ్వనుల ప్రపంచంలో జీవితం లోతుల్ని మనకు తెలియజెప్పడం ఓ గొప్ప ప్రయత్నం. కచ్చితంగా అత్యుత్తమమైన మంచి ప్రయత్నం.” జీవిత పరమార్థం ఏమిటో, ఆ పరమ లక్ష్యాన్ని ఎలా చేరాలో గుర్తుచేసే గీతాలుగా ‘తత్త్వమసి’ ఆధునికులకు అవసరమైన ప్రయోగమే!

-    రెంటాల జయదేవ

Advertisement
 
Advertisement
Advertisement