
తాను బతికుండగానే కొడుకు/కూతురు చనిపోవాలని ఏ తల్లీ, తండ్రీ కోరుకోడు. కానీ దురదృష్టం కొద్దీ తనకు అలా కోరుకోక తప్పలేదంటున్నాడు సీనియర్ నటుడు ప్రసాద్ బాబు (Prasad Babu). ఈయన వెండితెరపై హీరో, విలన్, కమెడియన్, సహాయ నటుడు.. ఇలా అన్నిరకాల పాత్రలు పోషించాడు. దర్శకుడిగానూ సినిమాలు తీశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కొడుకును కోల్పోవడం గురించి మాట్లాడాడు.
సాహసబాలలు కథకు ప్రేరణ..
ప్రసాద్‌బాబు మాట్లాడుతూ.. నేను సాహస బాలలు సినిమా తీయడానికి నా కుమారుడే కారణం. నా పెద్ద కొడుకు మానసిక వికలాంగుడు. వాడిని మాలాగే ఒక కళాకారుడిని చేయాలని ఆశ ఉండేది. తనకు మాటలు రావు, ఏమీ రావు. ఒకసారేమైందంటే.. స్కూల్‌లో ఇతర విద్యార్థులతో పాటు నా కొడుకుని ఓ ప్రోగ్రామ్ కోసం ఢిల్లీ తీసుకెళ్లారు. తనకు మాటలు రాకపోయినా సరే ఢిల్లీ తీసుకెళ్తున్నారు.. మరి తండ్రిగా ఇక్కడ నేనేం చేస్తున్నాను? అన్న ప్రశ్న మొదలైంది. అప్పటికప్పుడు ఒక కథ అనుకున్నాను. అదే సాహసబాలలు. ఈ చిత్రంలో మురళీ మోహన్, నాగబాబు, సోమయాజులు.. ఇలా చాలామంది యాక్ట్ చేశారు.
30 ఏళ్లకే..
కసితో ఈ సినిమా చేసి బంగారు నంది గెల్చుకున్నాను. కానీ నా కొడుకు నాకు దూరంగా వెళ్లిపోయాడు. వేసవికాలంలో క్రికెట్ ఆడించాను. మే నెలలో క్రికెట్ ఆడుతుండగా వడదెబ్బ తగిలింది, దాంతోపాటు గుండెపోటు వచ్చింది. గ్రౌండ్‌లోనే చనిపోయాడు. అప్పుడు వాడి వయసు 30 ఏళ్లు. నేను బతికుండగానే వీడు చనిపోవాలని మనసులో కోరుకున్న కోరిక ఆరోజు నెరవేరింది. ఎందుకంటే నేను చనిపోయాక వాడిని ఎవరైనా చూస్తారో, లేదోనని భయం ఉండేది. అందుకే.. తన పేరుమీద స్థలం రాసిపెట్టాను.
దేవుడికి కృతజ్ఞతలు
కానీ, వాడే ముందుగా చనిపోయాడు. నేనుండగానే వాడు పోయినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాను. నేను మేనరికం పెళ్లి చేసుకున్నాను. దానివల్లే నా కొడుకు మానసికంగా ఎదగలేదు. తనకు మానసిక వైకల్యం ఉందని ఫీల్ కాకూడదని ప్రతి సినిమాకు తీసుకెళ్లేవాడిని. ఒకసారి బ్రహ్మంగారి మఠానికి వెళ్లినప్పుడు సిద్ధయ్య సమాధిని పట్టుకుని బోరున ఏడ్చాడు. ఏ జన్మలో ఏ సంబంధం ఉందో, అందుకే ఇలా కన్నీళ్లు పెట్టుకున్నాడనుకున్నాం.. అని ప్రసాద్ బాబు చెప్పుకొచ్చాడు.
ప్రసాద్ కెరీర్..
ప్రసాద్ బాబు అసలు పేరు కరణం లీల వెంకట శ్రీహరి నాగ వరప్రసాద్. పునాదిరాళ్లు చిత్రంతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. రుద్రవీణ, ఆపద్భాందవుడు, అంతులేని కథ, బొబ్బిలిపులి, మేజర్ చంద్రకాంత్, మురారి.. ఇలా అనేక సినిమాలు చేశాడు. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 1500 సినిమాలు చేశాడు. బుల్లితెరపై పలు సీరియల్స్ కూడా చేశాడు.
చదవండి: రోడ్డుపై చిత్తు కాగితాలతో నటి.. తనలో తనే మాట్లాడుకుంటూ..