
‘కొత్త తరం సినిమా పరిశ్రమలోకి రావాలి. కొత్త ఆలోచనలతో , కొత్త కథలతో ఎన్నో సినిమాలు రావాలి. ఇండస్ట్రీలోకి వచ్చే కొత్తవాళ్లకి నాలాంటి సీనియర్ నటుల సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది’ అని అన్నారు సీనియర్ నటుడు చిట్టి అలియాస్ చందన లక్ష్మీ నరసింహారావు(Chandana Lakshmi Narasimha Rao). సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి 40 ఏళ్ళు పూర్తయినా సందర్భంగా తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమ మద్రాస్ నుండి హైదరాబాద్ కి వచ్చినప్పటి నుంచి నేను ఇండస్ట్రీలోనే ఉన్నాను. ఆనాటి డైరెక్టర్స్ నుండి ఈ రోజు దర్శకుల వరకు అందరి తో నేను పని చేసాను.అందరూ నన్ను చిట్టి , చిట్టి అనడం తో నా స్రీన్ నేమ్ చిట్టి గా మారింది.

పరిశ్రమలో ఉన్న హీరోలు అందరి తో కలిసి వెండితెర ని పంచుకోవడం నా అదృష్టం. ఇప్పటి వరకు 5 సినిమాల్లో హీరో గా చేసాను,170 సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించాను,కొన్ని వెబ్ సిరీస్ లో అలా తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో నటించిన నేను నేటికి 40 ఏళ్ల సినీ ప్రస్థానం లో ఎన్నో అవార్డులు, ప్రశంసలు పొందడం చాలా సంతోషంగా ఉంది.
పచ్చని సంసారం, రౌడీ అన్నయ్య, మాస్టర్,గౌతమ్ SSC, ఠాగూర్, రణం, ఇష్కు, పోకిరి, క్రాక్ ,లెజెండ్, అఖండ, సరిలేరు నీకెవ్వరూ, వీరసింహ రెడ్డి , భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం ఇలా నేను నటించిన చాలా సినిమాలు భారీ విజయం సాధించాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి -అనిల్ రావిపూడి సినిమా లో మంచి పాత్ర చేస్తున్నాను. చాలా కాలం తర్వాత మళ్లీ చిరంజీవి సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. దీంతో పాటు ప్రస్తుతం పలు సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తున్నాను’ అన్నారు.