వెంకటేశ్ గౌడ్, రామకృష్ణ గౌడ్
చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన యానిమేషన్ సినిమా ‘సర్దార్ సర్వాయి పాపన్న’. వీజీ మూవీ మేకర్స్ సమర్పణలో దీపక్ న్యాతి నిర్మాణ పర్యవేక్షణలో వెంకటేశ్ గౌడ్ లింగంపల్లి ఈ సినిమాను రూపొందించారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వచ్చే వారం విడుదల కానుంది. ఈ సినిమా పోస్టర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శక–నిర్మాత వెంకటేశ్ గౌడ్ మాట్లాడుతూ– ‘‘మాకున్న ఆర్థిక వనరుల దృష్ట్యా ఇది భారీ బడ్జెట్ సినిమా అనే చెప్పాలి.
సర్దార్ పాపన్న 376వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మా ‘సర్దార్ సర్వాయి పాపన్న’ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నాం. ఈ చిత్రాన్ని ఈ నెల 7నే రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కానీ చిన్న సినిమాలకు థియేటర్స్ ఇబ్బందులు ఉన్నాయి. దీంతో ఈ నెల 14 లేదా 21న రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అని చెప్పారు. ‘‘నేను ఈ సినిమా చూశాను. సర్దార్ పాపన్న గొప్పతనాన్ని ఎక్కడా తగ్గించుకుండా తెరకెక్కించాడు వెంకటేశ్ గౌడ్.
అన్ని కులాల వారిని ఏకం చేసి అన్యాయాలపై తిరుగుబాటు చేసిన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న. ట్యాంక్ బండ్ మీద కూడా పాపన్న విగ్రహం పెట్టేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాకు ప్రేక్షకులు మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు ప్రతాని రామకృష్ణ గౌడ్. ‘‘విదేశీయులు కీర్తించిన ఘన చరిత్ర సర్దార్ సర్వాయి పాపన్నది. ఎన్నో ఇబ్బందులు తట్టుకుని ఈ సినిమాను ఏఐ, యానిమేషన్ మూవీగా రూపొందించారు వెంకటేశ్’’ అని తెలిపారు దీపక్ న్యాతి.


