ఎస్‌... అవన్నీ వదంతులే!

samantha comments on social media account id - Sakshi

‘ది ఫ్యామిలీ మేన్‌ 2’ వెబ్‌ సిరీస్‌లో ఉగ్రవాది రాజీ పాత్రను అద్భుతంగా చేసినందుకు బోలెడన్ని ప్రశంసలు దక్కించుకున్నారు సమంత. అలాగే ఎల్‌టీటీఈ (తమిళ ఈలం)కి సహకరించే తమిళ ఉగ్రవాదిగా కనిపించడం పట్ల తమిళ ప్రజల నుంచి విమర్శలు కూడా ఎదురయ్యాయి. తాజాగా ‘ది ఫ్యామిలీ మేన్‌ సీజన్‌ 2’ తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో తనకు ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం లేదని సమంత పేర్కొన్నారు.

ఇంకా ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ – ‘‘ఎవరి సొంత అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఆ విషయాన్ని నేను ఆమోదిస్తాను. అయితే ఆ అభిప్రాయాన్నే వారు బలంగా నమ్ముతుంటే, వారి మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమించమని కోరుతున్నాను. నేను ఎవర్నీ బాధపెట్టాలనుకోలేదు. ఉద్దేశపూర్వకంగా ఏదీ చేయలేదు. అయితే ఈ సిరీస్‌ రిలీజ్‌ అయ్యాక (హిందీలో రిలీజైంది) కొంతవరకూ విమర్శలు సద్దుమణిగాయి. ఊహించినంత చెడుగా లేదని చూసినవాళ్లల్లో కొందరు గ్రహించారు.

చూడని ప్రేక్షకులు, ఒకవేళ చూసినా అదే అభిప్రాయానికి కట్టుబడి ఉన్నట్లయితే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటున్నాను’’ అన్నారు. ఇంకా రాజీ పాత్ర గురించి చెబుతూ – ‘‘తను విలన్‌ కాదు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన అమ్మాయి. ఆమె పడిన ఇబ్బందులు విన్నవాళ్లెవరూ తను విలన్‌ అనుకోరు’’ అన్నారు సమంత. ఈ మధ్య సమంత తన సోషల్‌ మీడియా అకౌంట్స్‌ ఐడీలో ‘అక్కినేని’ అని తీసేసి ‘ఎస్‌’ అని మాత్రమే పెట్టుకోవడంతో పలు ఊహాగానాలు నెలకొన్నాయి. ఈ విషయం గురించి ప్రస్తావించినప్పుడు – ‘‘ఊహలన్నీ వదంతులే. అయినా నేను వదంతులకు ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పుడూ అంతే’’ అన్నారు. ‘‘ఓ నెల రోజులు బ్రేక్‌ తీసుకోవాలనుకుంటున్నాను. కొత్త ప్రాజెక్ట్స్‌ సైన్‌ చేయలేదు. బ్రేక్‌ అయ్యాక కథలు వింటాను’’ అన్నారు సమంత.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top