Ramayan Serial Actor: రామాయణ్‌ ఫేం అరవింద్‌ త్రివేది మృతి

Ramayan Raavan Actor Arvind Trivedi Died At 82 - Sakshi

ప్రముఖ నటుడు, ‘రామయణ్‌’ ఫేం అరవింద్‌ త్రివేది(82) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న త్రివేది మంగళవారం రాత్రి ముంబైలోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందినట్లు ఆయన బంధువులు వెల్లడించారు. ఆయన మరణ వార్త తెలిసి బాలీవుడ్‌ టీవీ, సినీ నటీనటుల సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. కాగా అరవింద్‌ త్రివేది ప్రముఖ దర్శకుడు రామానంద్‌ సాగర్‌ తెరకెక్కించిన ‘రామాయణ్‌’ సీరియల్‌లో రావణుడి పాత్ర పోషించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు.

చదవండి: తండ్రిని చూసి గుక్కపెట్టి ఏడ్చిన ఆర్యన్‌ ఖాన్‌

1980లో వచ్చిన ఈ సీరియల్‌ ఎంత పాపులర్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అపురూప దృశ్య కావ్యానికి ఉన్న క్రేజ్‌ను బట్టి ఇటీవల ఫస్ట్‌ లాక్‌డౌన్‌లో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు దూరదర్శన్‌ ‘రామాయణ్‌’ను పున:ప్రసారం చేసింది.  2020 ఏప్రిల్‌ 16న తిరిగి ప్రసారమైన రామయణ్‌ను ప్రపంచవ్యాప్తంగా 7.7 కోట్ల మంది వీక్షించడంతో సరికొత్త రికార్డు సృష్టించింది. రామానంద సాగర్‌ రచించి, దర్శకత్వం వహించిన ‘రామాయణ్‌’ విడుదలైన 33 ఏళ్ల తర్వాత కూడా ఈ సీరియల్‌కు అంతటి స్థాయిలో ఆదరణ లభించడం విశేషం. 

చదవండి: ఆర్యన్‌ ఖాన్‌పై ఆరోపణలు నిరాధారం: అర్బాజ్‌ తండ్రి

అయితే గతంలో అరవింద్‌ కరోనా మృతి చెందినట్లు వార్తలు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై రామాయణ్‌లో లక్ష్మణుడి పాత్ర పోషించిన సునీల్‌ లహ్రీ స్పందించారు. అరవింద్‌ ఆరోగ్యంగానే ఉన్నారని, ఇలాంటి పుకార్లను వ్యాప్తి చేయవద్దని సూచించారు. ఇప్పుడు అరవింద్‌ మృతి వార్తను కూడా ఆయన వెల్లడించారు. కాగా ఈ సీరియల్‌లో రావణుడిగా అరవింద్‌ త్రివేదీ నటించగా అరుణ్ గోవిల్.. రాముడిగా, సునీల్‌ లాహిర్‌.. లక్ష్మణ్‌గా, దీపిక చిఖిలియా.. సీతగా నటించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top