‘‘ఏదైనా మంచి కాన్సెప్ట్, పర్పస్ ఉన్న కథ దొరికితే దాన్ని ప్రేక్షకుల ముందుకు సరైన విధంగా చేర్చాలనే ప్రయత్నంలో భాగంగా దర్శకుడిగా ఉన్న నేను ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో నిర్మాతగా మారాను. ప్రోడ్యూసర్ అయ్యాక ప్రోడక్షన్ లోని ఇబ్బందుల గురించి నాకు మరింత బాగా తెలిసింది. నిర్మాతలపై నాకున్న గౌరవం ఇంకా పెరిగింది.
‘బేబి, 7జీ బృందావన కాలనీ, సైరత్, ప్రేమిస్తే..’ వంటి చిత్రాల తరహాలో ‘రాజు వెడ్స్ రాంబాయి’ కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది.. వారిని ఆలోజింపజేసే చిత్రం ఇది’’ అని తెలిపారు దర్శక–నిర్మాత వేణు ఊడుగుల. అఖిల్, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. సాయిలు కంపాటి దర్శకత్వంలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రోడక్షన్స్ పై డా. నాగేశ్వర రావు పూజారి సమర్పణలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ నెల 21న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా వేణు ఊడుగుల మాట్లాడుతూ–‘‘ఖమ్మం–వరంగల్ జిల్లాల మధ్య జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ స్క్రిప్ట్‌ను రెడీ చేశాడు సాయిలు. ఈ చిత్రానికి నిర్మాతగా నేను న్యాయం చేయగలని భావించి, ప్రోడ్యూసర్‌గా మారాను. నా దర్శకత్వంలో యూవీ సంస్థలో ఓ మూవీ రానుంది’’ అని చెప్పారు. ‘‘వాస్తవ ఘటనలు జరిగిన ప్రాంతంలోనే ఈ సినిమా చిత్రీకరించాం’’ అన్నారు రాహుల్ మోపిదేవి.


