
ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ‘పెద్ద పెద్ద హీరోలు, మహానుభావులంతా ఉన్నారు. మీకంటూ ఉన్న ప్రత్యేకత ఏంటి?’ అని ఎన్టీ రామారావు గారు నన్ను అడిగారు. ఆ ప్రశ్నతో నా మైండ్ మొత్తం బ్లాక్ అయింది. ఓ వారం రోజులు పాటు ఆలోచిస్తూనే ఉండిపోయా. అప్పుడే చార్లీ చాప్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. ఆ సినిమాలు చూశాక నాకు ఐడియా వచ్చింది. అందరికీ ఓ సపరేట్ మార్క్ ఉండేది. రొమాంటిక్ హీరో, యాక్షన్ హీరో అని ఉన్నప్పుడు.. కామెడీ హీరో అని ఎందుకు ఉండకూడదు అనుకున్నాను. ఇక కామెడీ ప్రాధాన్యం ఉన్న చిత్రాల్ని చేయాలని, కామెడీ హీరోగా నిలదొక్కుకోవాలని ప్రయత్నించాను. ‘లేడీస్ టైలర్’ తరువాత ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు’ అని అన్నారు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అర్చన, రూపేశ్, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రలను పోషించారు. మే 30న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా రాజేంద్రప్రసాద్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
→ కళ అనేది సముద్రం. మనం సముద్రం మొత్తాన్ని తాగగలమా? ఈదగలమా?.. కళ కూడా అంతే. ఎప్పటికీ ఆకలి, దాహం తీరదు. ఎప్పటికీ నటుడిగా ఇంకెన్నో పాత్రలు పోషించాలి. ‘షష్టిపూర్తి’ చిత్రంలో మూడు రకాల వేరియేషన్స్ ఉంటాయి. ‘లేడీస్ టైలర్’ మూవీ మాడ్యులేషన్, గెటప్ కావాలని దర్శకుడు పట్టుబట్టుకుని కూర్చున్నారు. కానీ నా యాటిట్యూడ్ వల్ల ఆ పాత్రను ఈజీగా పోషించాను. ఇందులో మూడు ఏజ్ గ్యాప్‌లను చూపించాం. ఇది నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది.
→ మనం ఏ పాత్రలు పోషించినా.. ఆ పాత్రలే జనాలకు గుర్తుండాలనేది నా సూత్రం. ఇది నా ఐదో జనరేషన్. ఇప్పటికీ నా కోసం ‘షష్టిపూర్తి’ లాంటి పాత్రలు రాస్తున్నారంటే అది నా అదృష్టం. పిల్లలు తల్లిదండ్రుల పెళ్లిని చూడలేరు. కానీ 60వ పెళ్లిని మాత్రం చూడగలరు. అందుకే ‘షష్టిపూర్తి’కి అంత ప్రాధాన్యం. ఇలాంటి చిత్రాల్ని, పాత్రల్ని అస్సలు మిస్ అవ్వకూడదు.
→ ఇళయరాజా గారు మాతో పోటీ పడి మరీ సంగీతాన్ని అందించారు. కీరవాణి గారు మా కోసం పాట రాశారు. కీరవాణి పాట రాస్తున్నారా? అని రాజా గారు కూడా షాక్ అయ్యారు. మా ‘షష్టిపూర్తి’ కోసం రాజా గారు అద్భుతమైన పాటల్ని అందించారు. చైతన్య ప్రసాద్ గారు మంచి సాహిత్యాన్ని ఇచ్చారు.
→ నా జీవితంలో ఎప్పుడూ కూడా జేబు నిండిందా? లేదా? అన్నది చూడలేదు. చేస్తున్న జాబు (పని) సంతృప్తిని ఇచ్చిందా? లేదా? అన్నది చూశాను. ఏడాదికి పన్నెండు చిత్రాలు చేశాను.. ఎంతో డబ్బులు సంపాదించాను. ఆ డబ్బులు అన్నీ కూడా పోయాయి. కానీ నేను ఎప్పుడూ డబ్బుల గురించి ఆలోచించలేదు. నేను చేస్తున్న పని, వేస్తున్న పాత్రలే సంతృప్తినిస్తుంటాయి. ఆ దేవుడి దయ వల్ల నాకు ఇప్పటికీ పని దొరుకుతోంది. గత 48 ఏళ్లుగా పని దొరుకుతూనే ఉంది. ఇప్పుడు నా చేతిలో 11 ప్రాజెక్టులున్నాయి. ఇంకో నాలుగు చిత్రాలు చర్చల్లో ఉన్నాయి.
→ ‘షష్టిపూర్తి’ చిత్రంలో అన్ని రకాల అంశాలుంటాయి. నవ్విస్తాను, ఏడ్పిస్తాను. ఈ మూవీని చూసిన తరువాత ప్రతీ ఒక్కరూ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి వారిని ప్రేమగా పలకరిస్తారు.
→ ప్రస్తుతం కామెడీ తగ్గింది. దానికి ప్రధాన కారణం రచయిత. మా టైంలో అద్భుతమైన కామెడీని రాసేవారు. అప్పట్లో హెల్దీ కామెడీతోనే అందరినీ నవ్వించాను. ఇప్పుడు అలాంటి కామెడీ టైమింగ్, కామెడీ రైటింగ్ కానీ కనిపించడం లేదు. ‘రాబిన్ హుడ్’లో వెన్నెల కిశోర్‌తో నా ట్రాక్‌ను అందరూ ఎంజాయ్ చేశారు. మంచి కామెడీ ఇప్పుడు మిస్ అవుతోందని నేను కూడా ఎక్కువగా బాధపడుతుంటాను. ‘అహనా పెళ్లంట’ బ్లాక్ బస్టర్ తరువాత నాకు ఎక్కువ భయం వేసింది. మళ్లీ అలాంటి సినిమా వస్తుందా? అని అనుకున్నాను. ప్రస్తుతం ఉన్న కామెడీ ఇంకా బెటర్ అవ్వాలని కోరుకుంటున్నాను.