
ఇటీవలి కాలంలో భారతీయ సినిమా హీరోల పాత్రలు తరచుగా చర్చనీయాంశం అవుతున్నాయి. అదేదో వివాదాస్పదన పాత్రలు పోషించినందుకో, లేక నటనా పరమైన అంశాల గురించో కాదు... తమ పక్కన నటించే కధానాయికలను ఎంచుకుంటున్న వైనం పైనే చర్చ జరుగుతోంది. దాదాపుగా తమ కూతురు వయసున్న ఒక్కోసారి అంతకు మించి మనవరాలి వయసున్న అమ్మాయిలతో కూడా మన హీరోలు తెరమీద రోమాన్స్ చేస్తుండడం పలువురు ప్రేక్షకుల్ని అసహనానికి గురి చేస్తోంది. పైగా ఇది సోషల్ మీడియా యుగం కావడంతో ఆ అసహనం శరవేగంగా విస్తరిస్తూ హద్దులు దాటేస్తోంది. దాంతో మన హీరోలు తరచుగా సంజాయిషీలు చెప్పుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఈ నేపధ్యంలో దక్షిణాది హీరో మాధవన్(R Madhavan) కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. ఆయన తాజా సినిమా ఆప్ జైసా కోయి లో మాధవన్, ఫాతిమాల మధ్య వయో బేధం.. దాదాపు 23ఏళ్లు. దాంతో ఇటీవలి కాలంలో తరచుగా చర్చనీయాంశంగా మారుతున్న వయో బేధం అంశం మరోసారి సోషల్ తెరమీదకు వచ్చింది.
ఈ నేపధ్యంలో మాధవన్ ఇటీవల ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ, ‘మీరు నిజంగా మీ మిగిలిన జీవితం కలిసి గడపాలనుకునేందుకు సరైన సహచరుడిని కనుగొనడం అనేది అరుదైన విషయం. కాబట్టి ఇద్దరి మధ్య వయస్సు వ్యత్యాసం జీవితాన్ని పంచుకునే అవకాశాన్ని పరిమితం చేయకూడదు‘ అని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
‘నేను చాలా మంది అమ్మాయిలను కలిశాను, వార తాము కూడా తమ వయస్సు గల అబ్బాయిలతో కలిసి ఉండలేం అని చెబుతారు. అదే వయసు పెరిగిన పురుషులలో అయితే కొంత పరిణతి ఉంటుంది, బహుశా వారు ప్రపంచాన్ని ఎక్కువగా చూసినందున కావచ్చు.. అది అమ్మాయిలను ఆకట్టుకునే అంశం అవుతుంది. కొన్నిసార్లు అది శాశ్వత సంబంధానికి పునాదిగా కూడా మారవచ్చు.‘ అంటూ విశ్లేషించారాయన.
దాదాపు మూడు దశాబ్దాల కెరీర్‌లో, సఖి వంటి చిత్రాల ద్వారా యువతకి దగ్గరైన మాధవన్.. రెహ్నా హై తెరే దిల్ మే, తను వెడ్స్ మను, అలై పాయుతే వంటి కొన్ని చిరస్మరణీయ రొమాంటిక్ చిత్రాలలో భాగమయ్యాడు. అయితే ఈ మధ్య కాలంలో అనేక రకాల చిత్రాలు ఆఖరికి సైతాన్ లాంటి క్రూరమైన పాత్రల్లోనూ ఆయన చేశాడు. అయితే తాజాగా విడుదలైన ఆప్ జైసా కోయి, అతను రొమాంటిక్ పాత్రలకి తిరిగి వచ్చేశాడా అన్న అభిప్రాయాన్ని కలిగించింది. ఈ చిత్రం మాధవన్ పాత్ర ఫాతిమా సనా షేక్ పోషించిన హీరోయిన్ పాత్ర మధ్య 12 సంవత్సరాల వయస్సు అంతరంతో ప్రేమకథను ఆవిష్కరించింది.
ప్రస్తుతం 55 ఏళ్ళ వయసులో ఉన్న మాధవన్ ఇది తన చివరి రొమాంటిక్ పాత్రలలో ఒకటి కావచ్చని సూచన ప్రాయంగా అంగీకరించాడు. ‘తెరపై ప్రేమకథలు ఇంతకు మించిన అశ్లీలంగా కనిపించడం జరగడానికి ముందు ఇది బహుశా నాకు చివరి అవకాశం‘ అని ఆయన చెప్పాడు. ఈ సందర్భంగా ఆప్ జైసా కోయి లోని తన సహనటి ఫాతిమాను ఆయన ప్రశంసలతో ముంచెత్తాడు. ‘ఆమె చిన్న హీరోలతో పాటు పెద్ద హీరోల పక్కన కూడా సులభంగా సరిపోతుంది‘ అంటూ కొనియాడాడు. ఏది ఏమైనా ఇక రొమాంటిక్ పాత్రలకు దూరం అంటున్న మాధవన్ నిర్ణయం అనేక మంది అభినందిస్తున్నారు.. మరి వయసుకు తగ్గ పాత్రలు చేస్తామని మిగిలిన హీరోలు కూడా ఇకనైనా స్పష్టం చేయగలరా?