చాలామంది హిట్టు కొట్టగానే సంతోషంతో ఎగిరి గంతేస్తుంటారు, ఫ్లాప్ రాగానే ఒక్కసారిగా డీలా పడిపోతారు. అయితే ఈ జయాపజయాలను ప్రభాస్ అస్సలు లెక్క చేయడంటోంది హీరోయిన్ నిధి అగర్వాల్. ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ "ది రాజాసాబ్". ఇందులో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు.
చతికిలపడ్డ రాజాసాబ్
మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో అన్నింటికంటే ముందుగా దిగింది. భారీ అంచనాలతో జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజాసాబ్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా చతికిలపడింది. నెగెటివ్ టాక్ వల్ల మంచి కలెక్షన్స్ రాబట్టలేపోయింది. అయితే ప్రభాస్ వీటినేవీ పట్టించుకోడంటోంది నిధి అగర్వాల్.
తలదూర్చడు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ప్రభాస్ ఎటువంటి రాజకీయాల్లో తలదూర్చడు. తన పనేదో తను చేసుకుపోతాడు. ఫేక్‌గా ఉండలేడు. చాలా మంచి వ్యక్తి. ఆయనంత హుందాగా నేను ఉండగలనా? అని అప్పుడప్పుడు నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను. కానీ, ఆయనతో కలిసి పని చేశాక మరో విషయం అర్థమైంది. తనది చిన్నపిల్లాడి మనస్తత్వం. ఎంతో నిష్కల్మషంగా ఉంటాడు. ప్రేమగా మాట్లాడతాడు.
ప్రభాస్‌ను కలిస్తే..
ఎవరైనా సరే.. ఆయన్ను కలిసినప్పుడు తను ఓ స్టార్ హీరో అన్న విషయమే మర్చిపోతారు. ఐదేళ్ల పిల్లాడిని కలిసినట్లే ఉంటుంది. అంత సింపుల్‌గా ఉంటాడు. దేనికీ లెక్కలేసుకోడు, కమర్షియల్‌గా ఉండటం రాదు. పైగా తనకు ఎటువంటి పీఆర్ టీమ్ లేదు. తనతో పనిచేశాక ఆయనపై గౌరవం మరింత పెరిగింది. నా జీవితంలో నేను కలిసిన అత్యంత మంచి వ్యక్తి ప్రభాసే.. సినిమా కోసం తనవంతు కృషి చేస్తాడు. దాని రిజల్ట్ గురించి అసలు పట్టించుకోడు అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది.
చదవండి: 40 ఏళ్ల హీరోతో రొమాన్స్.. ట్రోలింగ్ పట్టించుకోనంటున్న బ్యూటీ


