
‘‘ఇవాళ నా పుట్టినరోజు... ఎవరొచ్చినా లోపలికి పంపించు’’ అంటూ వచ్చేవాళ్లు చెప్పే శుభాకాంక్షల కోసం ఎగ్జయిటింగ్‌గా ఎదురు చూశారు దర్శకుడు శ్రీరామ్ వేణు. అయితే వచ్చిన లయ, స్వసిక విజయన్, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ ‘సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ప్రమోషన్స్ ఎప్పుడు మొదలుపెడతారు? చెబుతారా చెప్పరా?’ అంటూ కాస్తంత కోపంగా అడగడంతో, శ్రీరామ్ వేణు ఖంగు తిన్నారు. పైగా బేబీ శ్రీరామ్ దీత్య అయితే ‘నేను థర్డ్ క్లాస్‌లో ఉన్నప్పుడు మూవీ స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నా, మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు?’ అని అడగడంతో, బర్త్‌డే విషెస్ చెబుతారని ఆశిస్తే, ఇలా షాక్ ఇచ్చేరేంటి అనుకుంటూ సర్ది చెప్పి, పంపించేస్తారు.
చివరికి నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్ నవ్వుకుంటూ... శ్రీరామ్ వేణుతో, రిలీజ్‌ది ఏముందీ? కేక్ కట్ చేద్దువుగాని అంటూ, జూలై 4న థియేటర్లలో ‘తమ్ముడు’ అని రాసి ఉన్న కేక్‌ని కట్ చేయించారు. నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘తమ్ముడు’. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు చేశారు. ఆదివారం (మే 4) శ్రీరామ్ వేణు బర్త్ డే సందర్భంగా పైన పేర్కొన్న విషయాలతో తయారు చేసిన ఓ ఫన్నీ వీడియో ద్వారా సినిమాని జూలై 4న రిలీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.