క్రిస్‌మస్‌ రోజు నేను చనిపోయాననుకుంది

Neena Gupta Thought Masaba Died On Christmas - Sakshi

ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌, నటి మసాబా చేసిన పనికి ఆమె తల్లి, సీనియర్‌ నటి నీనా గుప్తాకు ఒక్క క్షణం గుండాగినంత పనైందట. ఇంతకీ ఆమె ఏం చేసిందనుకుంటున్నారు.. మరేం లేదు. పండగ పూట త్వరగా నిద్ర లేవాల్సింది పోయి బారెడు పొద్దెక్కినా ఆదమరిచి నిద్రపోయారట. దీంతో మసాబా చనిపోయిందా? ఏంటని ఆమె తల్లికి చెమటలు పట్టాయట. ఈ విషయాన్ని మసాబా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ ద్వారా వెల్లడించారు. "శుభోదయం నీనాజీ. నాకసలు ఆలస్యంగా నిద్ర లేచే అలవాటే లేదు. కానీ క్రిస్‌మస్‌ రోజు ఆలస్యంగా తొమ్మిదిన్నర వరకు నిద్ర లేవలేదు. దీంతో భయపడిపోయిన అమ్మ నేను బతికున్నానా? లేదా? అని నా దగ్గరకు వచ్చి చెక్‌ చేసింది" అని చెప్పుకొచ్చారు. ఈ మేరకు నీనా తన ఫోన్‌ను పట్టుకున్న ఫొటోను షేర్‌ చేశారు. అమ్మ కంగారును పోగొట్టేందుకు మసాబా త్వరగా రెడీ అయి పండగ వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను సైతం అభిమానులతో పంచుకున్నారు. అయితే సత్యదీప్‌ మిశ్రాను మిస్‌ అవుతున్నానని బాధ పడ్డారు. కాగా వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్స్‌, నీనా గుప్తాల కూతురైన మసాబా నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌ 'మసాబా మసాబా'తో నటనా రంగంలోకి అడుగు పెట్టారు. ఇందులో తల్లి నీనాతో కలిసి నటించారు. (చదవండి: ఈసారి ఫుల్‌ మీల్స్‌)

మసాబా వ్యక్తిగత విషయానికి వస్తే.. 2015లో ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ మధు మంతెనను ఆమె పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వివాహ బంధం ఎక్కువకాలం నిలవలేదు. ఈ నేపథ్యంలో తామిద్దరం విడిపోతున్నామంటూ మధు, మసాబా 2018లో ప్రకటన విడుదల చేశారు. బాంద్రా ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆమె నటుడు సత్యదీప్‌ మిశ్రాతో డేటింగ్‌ చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. సత్యదీప్‌, మసాబా ఆ మధ్య ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఫొటోలు ఈ వదంతులకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఇక సత్యదీప్‌ సైతం తన భార్య, ప్రముఖ హీరోయిన్‌ అదితీ రావ్‌ హైదరీ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. 2009లో ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట 2013లో తమ బంధానికి స్వస్తి పలికారు. (చదవండి: విడాకులు: మళ్లీ ప్రేమలో పడిన నటుడు!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top