యంగ్‌ హీరోకు అక్కగా నటించనున్న నయనతార | Sakshi
Sakshi News home page

యంగ్‌ హీరోకు అక్కగా నటించనున్న నయనతార

Published Mon, Dec 4 2023 7:41 AM

Nayanthara As Sister Pradeep Ranganathan Movie - Sakshi

కోలీవుడ్‌లో దర్శకుడిగా తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్న ప్రదీప్‌ రంగనాథన్‌ ఆ తర్వాత కథానాయకుడిగా తొలి చిత్రంతోనే సంచలన విజయాన్ని సాధించడం విశేషం. ఆయన జయం రవి, కాజల్‌ అగర్వాల్‌ జంటగా నటించిన 'కోమాలి' చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆ చిత్ర విజయంతో పెరిగిన ఆత్మవిశ్వాసంతో వెంటనే కథానాయకుడు గానూ పరిచయమయ్యారు. అలా ఈయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం లవ్‌ టుడే. ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది.

దీంతో ప్రదీప్‌ రంగనాథన్‌కు వరుసగా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. అందులో ఒకటి నటుడు కమలహాసన్‌ నిర్మించ తలపెట్టిన చిత్రం. అయితే బడ్జెట్‌ అధికం కావడంతో ఆ చిత్రం ఆగిపోయింది. ఇక ప్రదీప్‌ రంగనాథన్‌ రూ.20 కోట్లు పారితోషికాన్ని డిమాండ్‌ చేయడంతో మరికొందరు నిర్మాతలు వెనక్కి తగ్గారు. ఇలాంటి సమయంలో లియో చిత్ర నిర్మాత ప్రదీప్‌ రంగనాథన్‌తో చిత్రం చేయడానికి ముందుకు వచ్చారు. దీనికి నయనతార భర్త విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించనున్నారు.

నటుడు అజిత్‌ చిత్రానికి దర్శకత్వం వహించాల్సిన విఘ్నేష్‌ ఆ చిత్రం నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. కాగా ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా ఈయన దర్శకత్వం వహించనున్న చిత్ర షూటింగ్‌ ఈ నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రానికి 'ఎల్‌ఐసీ' అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు తాజా సమాచారం. కాగా ఇందులో దర్శకుడు మిష్కిన్‌, ఎస్‌ జే సూర్య, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్నట్లు తెలిసింది.

కాగా ఇందులో కథానాయకిగా ఓ ప్రముఖ బాలీవుడ్‌ నటి నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. లేకపోతే ఈ చిత్రంలో లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటుడు ప్రదీప్‌ రంగనాథన్‌కు అక్కగా ప్రధాన పాత్రను పోషించబోతున్నట్లు తెలిసింది. దీనికి అనిరుధ్‌ సంగీతాన్ని అందించినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement