Mother's Day 2023: Special Song On Mother - Sakshi
Sakshi News home page

Mothers Day Special Songs: మదర్స్‌ డే స్పెషల్‌...కమ్మనైన అమ్మపాటలు

Published Sun, May 14 2023 8:41 AM

Mothers Day 2023: Special Song On Mother - Sakshi

అమ్మ...ఆ పదం పలకడానికి పెదాలు కమ్మగా కదులుతాయి. అలా పిలవడానికి మనసు నిలువెల్లా పులకరించి గొంతులో ఏకమవుతుంది. అమ్మ గర్భంనుంచి బయటకొచ్చిన బిడ్డ కూడా ఈ ప్రపంచంకంటే ముందు అమ్మనే చూస్తుంది. అమ్మనే పిలుస్తుంది. అమ్మా అనే ఏడుస్తుంది. అమ్మ చుట్టూనే ప్రపంచం.. అమ్మ ఉంది కాబట్టే ప్రపంచం. ప్రపంచ మాతృదినోత్సవం సందర్భంగా.. వెండితెరపై అమ్మను కీర్తిస్తూ అలరించిన గీతాలపై ఓ లుక్కేద్దాం.

అమ్మంటే ప్రేమకి పర్యాయపదం. అమ్మ మనసు అనురాగ నిలయం. అమ్మ కమ్మని కథలు చెబుతూ..  నమ్మలేని లోకాల్ని కళ్లముందు చూపెడుతుంది. అంతే కాదు.. అమ్మ ధైర్యాన్ని నూరిపోస్తుంది.  కొడుకుని వీరుడిగా తీర్చిదిద్దుతుంది. ఐనా కొడుకెప్పుడా ఆ మమతల తల్లి మదిలో చిన్నిపిల్లవాడే. 

జన్మనిచ్చేదే అమ్మ అయినపుడు... ఆ అమ్మకు జన్మనిచ్చింది కూడా అమ్మే అయినపుడు అమ్మను మించిన దైవమేముంటుంది.. ఆ మాట మనుషులే కాదు.. ఆ మనిషిని సృష్టించిన దేవుడు కూడా ఒప్పుకున్నాడు. అందుకే అవతారపురుషుడైనా ఒక అమ్మకు కొడుకే అన్నారు.

అమ్మ గురించి వింటుంటే.. అమ్మను చూస్తుంటే.. అమ్మ ఒడి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంటే.. ప్రతిదీ మనసు ఫలకంపై అక్షరాలు దిద్దినంత గట్టిగా తాకుతుంది. అమ్మ ప్రేమకన్నా విలువైన సంపద ఈ సృష్టిలో లేనేలేదు. అమ్మ ఆప్యాయత ముందు ఏదీ నిలవదు. వందమంది దేవుళ్లు ఎదురుగా వచ్చి నిలబడినా.. ఆమ్మ అందించే ప్రేమ ముందు తక్కువే అవుతారు. 

కంటికి వెలుగునిచ్చే అమ్మ కదిలే దేవతే కదా. అమ్మా అని తొలిపలుకు పలికే అదృష్టం పెదాలకు దక్కిన అదృష్టమే కదా! సృష్టిలో ఒక మనిషికే కాదు.. ఏ జీవికైనా అమ్మ ప్రేమ ఒక్కటే. అమ్మలోని కమ్మదనం.. అమ్మప్రేమలోని మధురం ఒక్కటే. జన్మనిచ్చే తల్లే ఎవరికైనా తొలిదైవం... ఏ జీవికైనా అమ్మే ఒక వరం.

బిడ్డ అలిగితే తల్లి బుజ్జగిస్తుంది. బ్రతిమిలాడో, బామాడో అన్నం తినిపిస్తుంది.  అప్పుడే తన కడుపు నిండినట్టు భావిస్తుంది. ఐతే.. కొన్ని సందర్భాల్లో అమ్మ కూడా అలకబూనుతుంది. అప్పుడు కొడుకు పడే వేదన హృదయాన్ని తాకుతుంది. అమ్మ మీద ప్రేమని చెప్పకనే చెబుతుంది.  

అమ్మ అనే రెండక్షరాల పదం కంటే గొప్పది ఎవరు మాత్రం రాస్తారు. అసలు అంతకంతే గొప్పమాట.. అమ్మగురించి పాడటంకంటే గొప్ప పాట ఏముంటాయి? రెక్కలొచ్చిన పక్షుల్లా పిల్లలు ఎగిరిపోతున్నా... తనును నడిరోడ్డుమీద వదిలేసినా.. ఏ తల్లీ బిడ్డను శపించదు.. ఆకలికడుపుతో అలమటిస్తూనే నవ్వుతూ బిడ్డ క్షేమంగా ఉండాలని దీవిస్తుంది. అమ్మా అని ప్రేమగా పిలిస్తే చాలనుకుంటుంది. 

 

మనిషైనా.. మాకైనా.. అమ్మకు.. అమ్మ మనసుకు ఆ భేదాలేమీ ఉండవు. ఆమె బిడ్డను ప్రేమిస్తుంది.. పాలిస్తుంది.. లాలిస్తుంది. ప్రాణంకంటే మిన్నగా కాపాడుకుంటుంది. జాబిల్లిని పిలిచినా... బూచోడని భయపెట్టినా ఊరుకోని బిడ్డ... అమ్మ చేతి స్పర్శ తగిలితే ముసిముసి నవ్వులు నవ్వుతుంది. ఎందుకంటే అమ్మ పిల్లల ప్రాణాలను తన అరచేతుల్లో పెట్టుకుని బతుకుతుంది. 

మన జీవితంలో అమ్మ లేని చోటుండదు.. అమ్మను స్మరించుకోని క్షణాలుండవు. మనకు తెలిసినా.. తెలియకపోయినా.. తమకు మాటలు నేర్పిన అమ్మను పిలవడానికి, తలవడానికి పెదాలెప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. బాధకలిగితే అమ్మా.. అలసిపోయేంతగా నవ్వితే అమ్మ.. దెబ్బ తాకితే అమ్మ.. కన్నీళ్లొస్తే అమ్మ.. కడుపు మాడితే అమ్మ.. కడుపు నిండినా అమ్మే.. అమ్మ తలపురాని చోటుండదు. ఎందుకంటే తల్లి ప్రాణం ఎప్పుడూ పిల్లలతోనే ఉంటుంది.


అమ్మ బంధం కంటే వరమేముంటుంది... ఇలలో అంతకంటే సంతోషాల ఆనందం ఏముంటుంది. అందుకే అమ్మగురించి రాయని వాళ్లులేరు. అమ్మ జోలపాట గుర్తొచ్చి పాడనివాళ్లూ లేరు. అసలు ఈ ప్రపంచంలో ఒక గొప్ప పుస్తకం తీసుకుంటే ఆ పుస్తకం పేరు కూడా అమ్మే. అది అమ్మకు మాత్రమే సొంతమయ్యే ఘనత. 

బిడ్డకు ఎలాంటి హాని జరిగినా తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. దగ్గరుండి మనసు గాయాల్ని మాన్పుతుంది. మరి అమ్మకే తీరని కష్ణమొస్తే.. పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది.. ?కనిపెంచిన అమ్మకు ఏమైనా జరిగితే.. తట్టుకునే ధైర్యం ఎవరికీ ఉండదు. అలాంటి కష్టకాలంలో ఆమ్మ జ్ఞాపకాలతో హృదయం నిండిపోతుంది. వయసంతా వెనక్కి మళ్లి అమ్మ ఒడిలోకే పారిపోతుంది. 

నిజమే కదా... ఉరుము ఉరిమినా.. మెరుపు మెరిసినా.. బిడ్డను గుండెలకు హత్తుకుని.. ఆకశంలో విరిసే హరివిల్లును బిడ్డ బోసినవ్వుల్లోనే చూసుకునే అమ్మ మెరిసే మేఘం.. కురిసే వాన. అమ్మ గురించి పాడినా.. అమ్మగురించి రాసినా.. అమ్మగురించి మాట్లాడినా... అమ్మ గురించి చదివినా జన్మ గుర్తొస్తుంది. జన్మజన్మలకు అమ్మకు మొక్కుతూనే ఉండాలనిపిస్తుంది.

కడుపున పుట్టకపోయినా... ఒక పసిబిడ్డ అమ్మకు కన్నబిడ్డలాగే కనిపిస్తుంది. ఒక అనాదను తీసుకొచ్చి పెంచుకున్నా..నిజమైన తల్లిమనసుకు ఎప్పుడూ పరాయి అనే భావమే ఉండదు. ఉంటే అమ్మ అనిపించుకోదు. ఇప్పుడు ఎంతో మంది తల్లులు అనాథపిల్లల్ని కడుపులో పెట్టుకుని కాపాడుతున్నారు. రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. అలా ప్రేమించగలిగే శక్తి అమ్మకు మాత్రమే ఉంది.



అమ్మకు సాటి పోటీ ఏమీ లేదు. ఏమన్నా ఉంటే అది మళ్లే అమ్మే అవుతుంది.. అక్కడకూడా అమ్మే ఉంటుంది. బిడ్డ కంటికి రెప్ప అమ్మ. ప్రేమైక శక్తి అమ్మ. ప్రపంచమంతా అమ్మను ఈరోజు విష్‌ చేయొచ్చు.. కానీ ఆ ప్రపంచాన్ని అమ్మ ఎప్పుడూ విష్‌ చేస్తూనే ఉంటుంది. అమ్మను ప్రతిరోజూ ప్రతిక్షణం ప్రేమిద్దాం. ప్రేమగా పలకరిద్దాం. 

Advertisement
Advertisement