మనోజ్‌-మౌనికల కొత్త వ్యాపారం.. నాలుగున్నరేళ్లుగా సీక్రెట్‌గా.. | Manchu Manoj And His Wife Bhuma Mounika Reddy At Namasthe World Cartoon Store Launch - Sakshi
Sakshi News home page

Manchu Manoj- Mounika: కొత్త వ్యాపారం మొదలుపెట్టిన మనోజ్‌- మౌనిక.. దేశం నలుమూలలా తిరిగి..

Published Tue, Dec 26 2023 12:43 PM

Manchu Manoj, Bhuma Mounika Enters into New Business - Sakshi

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌ ఈ మధ్యే ఓ శుభవార్త చెప్పాడు. తన భార్య భూమా మౌనిక గర్భం దాల్చిందని, త్వరలో తాను తండ్రిని కాబోతున్నానని తెలిపాడు. తాజాగా క్రిస్‌మస్‌ సందర్భంగా మరో శుభవార్త చెప్పిందీ జంట. చిన్నారుల కోసం నమస్తే వరల్డ్‌ అనే బొమ్మల షాపును ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఇరువురూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమాక్స్‌లో నమస్తే వరల్డ్‌ పేరిట బొమ్మల షాపును ప్రారంభించారు. ఇక్కడున్న బొమ్మలన్నీ చైనా నుంచి దిగుమతి చేసినవి కాదని ఇండియాలోనే తయారైనవని చెప్పాడు.

భార్య కృషి వల్లే సాధ్యమైంది
మనోజ్‌ మాట్లాడుతూ.. 'మన దేశంలో ఎన్నో గొప్ప కథలు ఉన్నాయి. పురాణ కథలను ఆధారంగా చేసుకుని అందులోని గొప్ప పాత్రల చుట్టూ కథలు రాశాం. రాసే క్రమంలో మొదటి లాక్‌డౌన్‌ వచ్చింది. అప్పుడేం చేయాలో తెలియక బొమ్మలు గీయడం మొదలుపెట్టాను. అది ఇలా ఉపయోగపడింది. మౌనిక కృషి వల్లే బొమ్మలు తయారు చేశాం. దేశం నలుమూలలా తిరిగి ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో ముడిసరుకు తీసుకువచ్చి బొమ్మలు తయారు చేశాం. ఇది పూర్తిగా మేడిన్‌ ఇండియా!

కార్టూన్స్‌గా తీసుకొస్తాం
సలార్‌, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌, రోబో.. రేపు రాబోయే హనుమాన్‌, ఈగల్‌.. ఇలా ఈ సినిమాల్లోని ప్రతి ఒక్కరూ సూపర్‌ హీరోలే! ఈ క్యారెక్టర్లను వీడియో గేమ్స్‌గా, మంచి కార్టూన్స్‌గా, బొమ్మలుగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నాం. ఇంటినే ఆఫీసుగా మార్చుకుని నాలుగున్నరేళ్లుగా సీక్రెట్‌గా కష్టపడుతున్నాం. మీ పిల్లలు వేసే బొమ్మలను నమస్తే.వరల్డ్‌లో అప్‌లోడ్‌ చేస్తే ఆ పెయింటింగ్‌ బొమ్మగా చేసి మీకు పంపిస్తాం. అలాగే బెస్ట్‌ బొమ్మలు సెలక్ట్‌ చేసి దాని మీద కార్టూన్స్‌, సూపర్‌ హీరో సినిమాలు చేస్తామని మాటిస్తున్నాం' అని చెప్పుకొచ్చాడు మనోజ్‌.

ఇద్దరికీ రెండో పెళ్లే
కాగా మోహన్‌బాబు వారసుడిగా వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టిన మనోజ్‌ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంతకాలంగా మాత్రం సినిమాలకు దూరంగా ఉన్నాడు. 2015లో ప్రణతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా 2019లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఈ ఏడాది మార్చిలో భూమా మౌనికని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు కూడా ఇది రెండే పెళ్లే. మనోజ్‌ను పెళ్లి చేసుకునే సమయానికే మౌనికకు ధైరవ్‌ అనే బాబు ఉన్నాడు.

చదవండి: స్టార్‌ హీరో హీరోయిన్లకు చెక్‌.. భారీ పారితోషికాలు ఉండవ్‌!

Advertisement
 
Advertisement