ఆస్కార్‌ రేసు నుంచి 2018 చిత్రం అవుట్‌  | Sakshi
Sakshi News home page

ఆస్కార్‌ రేసు నుంచి 2018 చిత్రం అవుట్‌ 

Published Sat, Dec 23 2023 1:07 AM

Malayalam movie 2018 out of Oscar race - Sakshi

భారతీయ సినీ ప్రేమికులకు నిరాశ ఎదురైంది. 96వ ఆస్కార్‌ అవార్డ్స్‌లో ఇంటర్‌నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీకి భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా వెళ్లిన మలయాళ సినిమా ‘2018: ఎవ్రీ వన్‌ ఈజ్‌ ఏ హీరో’ ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌ జాబితాలో చోటు దక్కించుకోలేక పోయింది. 96వ ఆస్కార్‌ అవార్డుల వేడుక మార్చి 10న లాస్‌ ఏంజెల్స్‌లో జరగనున్న సంగతి తెలిసిందే.

ఈ వేడుకకు సంబంధించిన కార్యక్రమాలను వేగవంతం చేశారు అకాడమీ నిర్వాహకులు. ఇందులో భాగంగా.. డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్, డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్, ఇంటర్‌నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్, మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్, ఒరిజినల్‌ స్కోర్‌ మ్యూజిక్, ఒరిజినల్‌ సాంగ్‌ మ్యూజిక్, యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్, లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్, సౌండ్, విజువల్‌ ఎఫెక్ట్స్‌.. ఇలా మొత్తం పది విభాగాల్లో ఆస్కార్‌కు నామినేషన్‌ బరిలో ఉన్న షార్ట్‌ లిస్ట్‌ను ప్రకటించారు మేకర్స్‌. హాలీవుడ్‌ చిత్రాలు ‘బార్బీ, ఓపెన్‌ హైమర్‌’ల హవా ఈ షార్ట్‌లిస్ట్‌ జాబితాలో కనిపించింది.

ఇక ఇంటర్‌నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో నామినేషన్‌ కోసం 88 దేశాల చిత్రాలు పోటీ పడగా, 15 చిత్రాలు షార్ట్‌లిస్ట్‌ అయ్యాయి. ఈ లిస్ట్‌లో మలయాళ ‘2018’ సినిమాకు చోటు దక్కలేదు. కాగా ఇండో–కెనెడియన్‌ ఫిల్మ్‌మేకర్‌ నిషా పహుజా దర్శకత్వం వహించిన ‘టు కిల్‌ ఏ టైగర్‌’ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో షార్ట్‌లిస్ట్‌ అయింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ‘టు కిల్‌ ఏ టైగర్‌’ అవార్డ్స్‌లతో సత్తా చాటింది. జార్ఖండ్‌లో గ్యాంగ్‌ రేప్‌కు గురైన తన కుమార్తెకు న్యాయం జరగాలని ఓ తండ్రి చేసే పోరాటం నేపథ్యంలో ‘టు కిల్‌ ఏ టైగర్‌’ డాక్యుమెంటరీ కథనం ఉంటుంది. అస్కార్‌ నామినేషన్‌ కోసం పదిహేను డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్స్‌తో ‘టు కిల్‌ ఏ టైగర్‌’ పోటీ పడాల్సి ఉంది.

ఇక అన్ని విభాగాల్లోని ఆస్కార్‌ నామినేషన్స్‌ జనవరి 23న వెల్లడి కానున్నాయి. ఇందుకోసం జనవరి 11 నుంచి జనవరి 16 వరకు ఓటింగ్‌ జరుగుతుంది. ప్రస్తుతానికి ప్రకటించిన ఆస్కార్‌లోని పది విభాగాల షార్ట్‌ లిస్ట్‌ జాబితాలో ఒక్క ఇండియన్‌ చిత్రానికి కూడా చోటు లభించలేదు. ఇక ‘2018’ విషయానికొస్తే కేరళలో 2018లో సంభవించిన వరదల ఆధారంగా ఈ సినిమాను జూడ్‌ ఆంటోనీ జోసెఫ్‌ డైరెక్ట్‌ చేశారు. టొవినో థామస్, కుంచాకో బోబన్, అపర్ణా బాలమురళి, అసిఫ్‌ అలీ, వినీత్, తన్వి రామ్, అజు వర్గీస్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ ఏడాది మార్చిలో విడుదలై బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. దాదాపు రూ. 150 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను ఈ చిత్రం వసూలు చేసింది.

ఆస్కార్‌ బరిలో నిలిచి నామినేషన్‌ దక్కించుకోలేకపోయిన నాలుగో మలయాళ చిత్రంగా ‘2018: ఏవ్రీ వన్‌ ఏ హీరో’ చిత్రం నిలిచింది. గతంలో 70వ ఆస్కార్‌ అవార్డ్స్‌కు ‘గురు (1997)’, 83వ ఆస్కార్‌ అవార్డ్స్‌కు ‘అదామింటే మకాన్‌ అబు (2011)’, 93వ ఆస్కార్‌ అవార్డ్స్‌ కోసం ‘జల్లికట్టు (2019)’, 96వ ఆస్కార్‌ అవార్డ్స్‌లో ‘2018: ఏవ్రీ వన్‌ ఈజ్‌ ఏ హీరో’ చిత్రాలను ఆస్కార్‌ ఇంటర్‌నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగపు నామినేషన్‌ కోసం ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అకాడమీకి పంపింది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement