పండగకి వచ్చిన ప్రతిసారీ హిట్‌ సాధించా..

Maha Samudram Movie Pre Release Event - Sakshi

 – శర్వానంద్‌

‘‘మహాసముద్రం’ శర్వా సినిమా అని సిద్ధూ అన్నాడు. కానీ  నేను ఒప్పుకోను. ఈ సినిమాకు కథే హీరో. ఓ సందర్భంలో రావు రమేష్‌గారు దర్శకుడు అజయ్‌ భూపతి దగ్గర ఓ కథ ఉందని, కానీ హీరోలు కుదరడం లేదనీ అన్నారు. మంచి హిట్‌ ఇచ్చిన దర్శకుడికి హీరోలు కుదరకపోవడం ఏంటి? అనుకున్నాను. ఆ తర్వాత నేను కథ విని ఫస్ట్‌ సిట్టింగ్‌లోనే ఓకే చెప్పాను. అనిల్‌ సుంకర్‌గారు కూడా కథ వినగానే ఓకే చెప్పారు’’ అని శర్వానంద్‌ అన్నారు.

శర్వానంద్, సిద్ధార్థ్‌ హీరోలుగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘మహాసముద్రం’. ఈ చిత్రంలో అదితిరావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లు. ఈ నెల 14న రిలీజ్‌ కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో అతిథిగా పాల్గొన్న హీరో కార్తికేయ సినిమా సెకండ్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా శర్వానంద్‌ మాట్లాడుతూ – ‘‘తొమ్మిది మంది జీవితాల్లో జరిగే కథ ఇది. మహా (అదితి) క్యారెక్టర్‌ చుట్టూ తిరిగే కథ. మహాలాంటి క్యారెక్టర్‌ చేయడం కష్టం. అదితీ అద్భుతంగా చేశారు. అనూ ఇమ్మాన్యుయేల్‌ కూడా బాగా చేశారు. ‘అంతఃపురం’లో జగపతిబాబుగారి యాక్టింగ్‌ చూసి, ఫ్యాన్‌ అయిపోయాను. ఆయనతో యాక్ట్‌ చేయాలన్న నా కల ఈ చిత్రంతో నిజమైంది. నేను పండక్కి వచ్చిన ప్రతిసారీ అందరం పండగ చేసుకున్నాం. ఒక సంక్రాంతికి ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’తో, ఇంకో సంక్రాంతికి ‘శతమానంభవతి’తో, ఒక దసరాకు ‘మహానుభావుడు’తో హిట్‌ సాధించా. ఈ దసరాకు ‘మహాసముద్రం’తో వస్తున్నాం. హిట్‌ కొడుతున్నాను’’ అన్నారు.

సిద్ధార్థ్‌ మాట్లాడుతూ – ‘‘ఏ స్టార్‌ (నక్షత్రం)కీ సొంత వెలుగు ఉండదు. ఏ స్టార్‌ అయినా సూర్యుడి వెలుగు తీసుకోవాలి. నా సూర్యులు తెలుగు ప్రేక్షకులు. అందరూ ఇది మల్టీస్టారర్‌ ఫిల్మ్‌ అంటున్నారు. కానీ నా దృష్టిలో ఇప్పుడు కాదు.. ఎప్పటికీ ‘మహాసముద్రం’ శర్వానంద్‌ సినిమానే. ‘ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత అజయ్‌ భూపతి స్పీడ్‌ ఏమాత్రం తగ్గలేదు. మన అభిమాన స్టార్‌ స్క్రీన్‌పై వచ్చారని చప్పట్లు కొట్టకుండా.. వారు ఎలాంటి పెర్ఫార్మెన్స్‌ చేశారో చూసి చప్పట్లు కొట్టే సినిమా ఇది’’ అన్నారు.

అజయ్‌ భూపతి మాట్లాడుతూ– ‘‘ఇది భావోద్వేగాల ప్రేమకథ. డిఫరెంట్‌ క్యారెక్టరైజేషన్‌తో కూడిన కొందరి జీవితాలు ఎవరి వల్ల ఏ విధంగా ప్రభావితం అయ్యాయి అనే అంశం కూడా ఉంటుంది. ఈ సినిమాలో స్టోరీయే హీరో. భావోద్వేగాలు నిండిన కళ్లతో ప్రేక్షకులు థియేటర్‌ నుంచి బయటకు వస్తారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ అప్పుడు కూడా ఇలానే మాట్లాడితే ఓవర్‌గా మాట్లాడుతున్నాడన్నారు. అప్పుడు ఆడియన్స్‌ను థియేటర్స్‌కు తీసుకుని రావాలని ప్రయత్నించాం. కానీ ఇప్పుడు ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ అనుకున్నా ఫర్వాలేదు. ‘మహాసముద్రం’ బ్లాక్‌బస్టర్‌ అవుతుంది’’ అన్నారు.

నిర్మాత అనిల్‌ సుంకర మాట్లాడుతూ – ‘‘అజయ్‌ చెప్పిన కథ నాకు కొత్తగా అనిపించింది. శర్వా, సిద్ధార్థ్, అను, అదితీ ఈ సినిమాకు నాలుగు పిల్లర్లు. ‘మహాభారతం’లో యుద్ధానికి శకుని కారణం అయితే.. ఈ సినిమాలో అలాంటి శకుని గూని బాజ్జీ పాత్ర చేశారు రావు రమేష్‌గారు. సినిమాలు తీసేది థియేటర్స్‌లో విడుదల చేయడానికే. కుదరకపోతే తప్ప... కుదిరినప్పుడు సినిమాను తప్పకుండా థియేటర్స్‌లోనే రిలీజ్‌ చేయాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో స్మిత క్యారెక్టర్‌ ఇచ్చిన అజయ్‌ భూపతిగారికి, నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు అనూ ఇమ్మాన్యుయేల్‌. ‘‘మహా క్యారెక్టర్‌ ఇచ్చిన అజయ్‌ భూపతికి, సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్న అనిల్‌ సుంకరగారికి ధన్యవాదాలు’’ అన్నారు అదితీరావు హైదరీ. ‘‘నేనేంటో నిరూపించుకోవడానికి ‘మహాసముద్రం’ లాంటి సినిమా ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చేతన్‌ భరద్వాజ్‌.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top