Villain Prabhakar Reddy Daughter Sailaja Reddy Revealed Intresting Facts About Her Father - Sakshi
Sakshi News home page

నాన్నకి అమ్మవారంటే భక్తి ఎక్కువ...

Jul 25 2021 10:33 AM | Updated on Jul 26 2021 5:59 PM

M. Prabhakar Reddy Daughter Shailaja Reddy Revealed Interesting Facts about Her Father - Sakshi

మోహన్‌బాబుని నాకు ట్యూషన్‌ మాస్టర్‌గా పెట్టారు. ఆయన కొంతకాలం నాన్న దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశారు.

విలక్షణ గాత్రం.. విలక్షణ నటన.. విలక్షణ కథలు.. విలక్షణ పాత్రలు..
పౌరాణికాలు, జానపదాలు, సాంఘికాలు, చారిత్రకాలు..
కౌబాయ్, జేమ్స్‌బాండ్, అభ్యుదయాలు, విప్లవాలు... 
అన్ని పాత్రలు మెప్పించారు.. నలుగురు ఆడపిల్లల తండ్రి..
భార్యతో కథా చర్చలు, పిల్లలతో ప్రివ్యూలు..
ఇవన్నీ కలిపితే డా. ఎం. ప్రభాకర్‌ రెడ్డి..
తండ్రి గురించి రెండో కుమార్తె శైలజారెడ్డి పంచుకున్న 
ఆత్మీయ అనుబంధాల అనుభూతులు..

మా తాతగారు మందాడి లక్ష్మారెడ్డి, నాయనమ్మ కౌసల్యాదేవి దంపతులకు నాన్న రెండో సంతానం. తాతగారు సూర్యాపేట దగ్గర తుంగతుర్తి చుట్టుపక్కల 40 గ్రామాలకు దొర. తాతగారికి ఐదుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు. నాన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మెడిసిన్‌ పూర్తి చేశారు. నాన్నకు మేం నలుగురు ఆడపిల్లలం. గంగ, శైలజ, లక్ష్మి, విశాలాక్షి. మా గ్రామ దేవత గంగమ్మ పేరు పెద్దక్కయ్యకు పెట్టారు. అమ్మవారి మీద భక్తితో మాకు అమ్మవారి పేర్లు పెట్టారు. మేం నలుగురం మద్రాస్‌ హోలీ ఏంజెల్స్‌ స్కూల్‌లో చదువుకున్నాం. పేరెంట్‌ టీచర్‌ మీటింగ్స్‌కి వచ్చేవారు. మా చెల్లి విశాలాక్షి నాన్నలాగే మెడిసిన్‌ చదివింది. స్కూల్‌ తరఫున మేం విహార యాత్రలకు వెళ్తుంటే, మాతో పాటు మా స్నేహితులకు కూడా వీఐపీ అకామడేషన్‌ ఏర్పాటు చేసేవారు. జమ్ముకాశ్మీర్‌ గుల్మార్గ్‌ ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఎప్పటికప్పుడు మా గురించి మాకు ఇబ్బంది కలుగకుండా సమాచారం తెలుసుకునేవారు.

మేమందరం ఆయన కళ్ల ముందే ఉండాలనే ఉద్దేశంతో మా అందరికీ హైదరాబాద్‌ సంబంధాలే చేశారు. నాకు చిన్నప్పటి నుంచి చెప్పులంటే ఇష్టం. నాన్న బొంబాయి నుంచి వస్తూ, రెండు సూట్‌కేసులు తీసి నాకు ఇచ్చారు. అందులో 23 జతల షూస్‌. బంగారం, వెండి చెప్పులు కూడా ఉన్నాయి.. ‘నీ వివాహం నీకు ప్రత్యేకంగా మిగిలిపోవాలి’ అన్నారు. నా పెళ్లయ్యాక ఎప్పుడైనా నేను వంట చేసి క్యారేజీ పంపిస్తే, ‘శైలు వంట చేసి పంపించిందంటే నమ్మలేకపోతున్నాను’ అనేవారు. 



మంచి మాటలు చెప్పేవారు..
ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచమనేవారు. ఎవరితోనైనా ఆలోచించి మాట్లాడాలి, నోరు జారిన తరవాత బాధపడినా ప్రయోజనం ఉండదనేవారు. డబ్బు అందరికీ పనికి వస్తేనే దానికి విలువ అనేవారు. అనుకున్నది సాధించాలనే పట్టుదలే ఆయనను ఎదిగేలా చేసింది. అహంకారం లేకుండా దేనినైనా సాధించగలమని నిరూపించారు నాన్న. అమ్మతో సినిమా కథలు, సీన్స్‌ చర్చించేవారు. అమ్మ బెంగాలీ కథలు చదివి, సినిమాలు చూసి, అందులో క్యారెక్టర్స్‌ ఎంత డిఫరెంట్‌గా ఉన్నాయో నాన్నకు వివరించేది. వారి సంభాషణల నుంచి కొత్త కథలు వచ్చేవి.

నాన్న తనకు కావలసిన విధంగా పాటలు, సంగీతం దగ్గరుండి చేయించుకునేవారు. కార్తీకదీపం సినిమాలో కొన్ని సీన్స్‌ మాకు నచ్చలేదని చెబితే, ఆ సీన్‌ సినిమాకి అవసరం అని వివరించారు. నాన్న సినిమాలకు అమ్మ కాస్ట్యూమ్స్‌ చేసేది. పండంటి కాపురంలో జమున, కార్తీకదీపంలో శ్రీదేవి... ఇలా ప్రతి సినిమాకీ హీరోయిన్ల దుస్తులు అమ్మ డిజైన్‌ చేసేది. నాన్న తీసిన ‘గాంధీపుట్టిన దేశం’ లో స్త్రీ విద్య, ‘గృహప్రవేశం’లో తన చుట్టూ ఉన్నవాళ్లు సంతోషంగా ఉండటం కోసం ఒక ఇంటి కోడలు పడే కష్టాలు వివరించారు.  ‘పండంటి కాపురం’ తన వ్యక్తిగత జీవితం నుంచి వచ్చిందన్నారు. తన జీవితంలో ఎదురుపడిన వారిని పాత్రలుగా మలచుకునేవారు. ఔట్‌డోర్‌ షూటింగ్‌కి వెళ్లినప్పుడు ప్రతిరోజూ ఫోన్‌ చేసేవారు. రాజస్థాన్‌లో ఎడారి ప్రాంతానికి షూటింగ్‌కి వెళ్లినప్పుడు, 50 కి.మీ. ప్రయాణించి సిటీకి వచ్చి, ఫోన్‌ చేసి, మేం ఎలా ఉన్నామో తెలుసుకున్నారు. ఒకసారి షూటింగ్‌లో హార్స్‌ రైడింగ్‌ చేస్తున్నప్పుడు చెస్ట్‌కి దెబ్బలు తగిలి ఆసుపత్రిలో చేరటం వల్ల రెండు రోజులు ఫోన్‌ చేయలేకపోయినందుకు చాలా బాధ పడ్డారు. 

మోహన్‌ బాబు నా ట్యూషన్‌ మాస్టర్‌
చుట్టూ ఉన్నవారికి సహాయపడాలనే తత్త్వం నాన్నది. రైటర్, యాక్టర్స్‌కి అవకాశం ఇచ్చారు. డా. మోహన్‌బాబుని నాకు ట్యూషన్‌ మాస్టర్‌గా పెట్టారు. ఆయన కొంతకాలం నాన్న దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశారు. జయసుధ, జయప్రద వంటి ఎంతోమంది నటులను వెండితెరకు పరిచయం చేశారు. టెక్నీషియన్స్‌కి ఉచితంగా ఆహారం అందించేవారు. పాత నటులకి నెలకు ఇంత అని పెన్షన్‌ ఇచ్చేవారు. చిత్రపురి కాలనీ కట్టించి, చాలా మందికి ఇళ్లు అందేలా చూశారు.

మూడుసార్లు ‘మా’ అధ్యక్షులుగా...
నాన్న మెడిసిన్‌ చదువుతున్నరోజుల్లో అక్క పుట్టింది. ఆ తరవాత మద్రాసు వచ్చారు. ‘చివరకు మిగిలేది’ చిత్రంతో సినీ రంగంలో తొలి అడుగు వేశారు. 1965లో పచ్చని సంసారం సినిమాతో కథా రచయితగా అడుగు ముందుకు వేశారు. ఆ తరవాత సూపర్‌స్టార్‌ కృష్ణ గారితో కలిసి సినిమాలు ప్రొడ్యూస్‌ చేశారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ప్రారంభించి, మూడుసార్లు అధ్యక్షుడిగా చేశారు. ఉదయాన్నే ఇంటి దగ్గరే మేకప్‌ వేసుకుంటూనే బ్రేక్‌ ఫాస్ట్‌ పూర్తి చేసి, సెట్స్‌కి వెళ్లేవారు. అమ్మ లంచ్‌ పంపేది. పోషకాహారం ఇష్టపడేవారు. నెయ్యి, జున్ను బాగా ఇష్టం. వేసవి కాలంలో బ్రేక్‌ఫాస్ట్‌లో మామిడిపళ్లు తప్పనిసరిగా ఉండాలి. ఉదయం 9.30కి ఎవరు వచ్చినా వాళ్లకి కూడా బ్రేక్‌ఫాస్ట్‌ పెట్టించేవారు.

అకస్మాత్తుగా మాయమైపోయారు..
ప్రతి కార్తీక పౌర్ణమికి ఉదయం సత్యనారాయణ వ్రతం, సాయంత్రం శివుడి పూజ చేసేవారు. పూజలు, మంచి రోజులు, ముహూర్తాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. అయ్యప్ప మాల వేసుకుని, కఠిన నియమాలు పాటించేవారు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా కార్తీక పౌర్ణమి పూజ చేసుకున్నారు. మా అందరితో హాయిగా మాట్లాడారు. తెల్లవారేసరికి హార్ట్‌ అటాక్‌. అకస్మాత్తుగా తన అరవయ్యో ఏట కన్నుమూశారు.

- వైజయంతి పురాణపండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement