
జలియన్ వాలాబాగ్ విషాదం నేపథ్యంలో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కేసరి చాప్టర్ 2’ (Kesari Chapter 2). ఏప్రిల్ 18న బాలీవుడ్‌లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో కూడా విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. మే 23న టాలీవుడ్‌లో విడుదల కానున్నట్లు ఒక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్ అనే ట్యాగ్‌లైన్‌ను చేర్చారు. మాధవన్, అనన్యపాండే, రెజీనా కీలక పాత్రలు పోషించారు. కరణ్ జోహార్ నిర్మించారు.
అక్షయ్ కుమార్ నటించిన దేశభక్తి చిత్రాల్లో ‘కేసరి’ భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకి కొనసాగింపుగా ‘కేసరి: ఛాప్టర్ 2’ను మేకర్స్ రూపొందించారు. ప్రముఖ రచయితలు రఘు, పుష్ప పలాట్ రచించిన ‘ది కేస్ దట్ షుక్ ది ఎంపైర్’ ఆధారంగా కరణ్ సింగ్ దీన్ని తెరకెక్కించారు. కేసరి చాప్టర్2 సినిమాకు కూడా బాలీవుడ్‌లో మంచి ఆదరణ లభించింది. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అత్యంత దురదృష్టకర, హేయమైన సంఘటనగా నిలిచిపోయిన ఘటనల్లో జలియన్‌వాలా బాగ్ ఉదంతం ఒకటి. 1919 ఏప్రిల్ 13న అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్‌లో జరిగిన కాల్పులు, తొక్కిసలాటలో ఎంతో మందిప్రాణాలు కోల్పోయారు. ఆ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. హిందీ ప్రేక్షకులకు మాత్రమే పరిమితం అయిన ఈ చిత్రం మే 23న తెలుగులో కూడా విడుదల కానుంది. గంతంలో ఛావా సినిమా కూడా మొదట హిందీలో విడుదలై ఆ తర్వాత తెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

దేశభక్తిని రగిలించే కోర్టు రూం డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను బ్రిటీష్ ప్రభుత్వం కచ్చితంగా చూడాలని అక్షయ్ కుమార్ గతంలో కోరారు. ఆ ప్రభుత్వంతో పాటు కింగ్ చార్లెస్ కూడా ఈ చిత్రాన్ని చూసి వారి తప్పులను ఇప్పటికైనా తెలుసుకోవాలని సూచించారు. ఈ సినిమా చూశాక వారు కచ్చితంగా క్షమాపణలు చెబుతారని ఆయన అన్నారు.