ఈ హ్యాపీనెస్ ఏమిటి? ఎట్లా ఇట్లా అయితే?: కత్తి మహేష్‌

Kathi Mahesh Comments Over Singer Sunitha Marriage - Sakshi

తల్లి పెళ్లి వేడుకలో పిల్లల సందడి. తన జీవితంలోని మధుర జ్ఞాపకంలో అడుగడుగునా వారి భాగస్వామ్యం. పెళ్లిపందిరిలో.. తమను పెంచి పెద్దచేసిన అమ్మను అట్టిపెట్టుకునే ఉన్నారు... ఉంగరాల ఆటలో ఆమె గెలుపును ఆస్వాదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఇన్నాళ్లు ఒంటరి మహిళగా ఉన్న మాతృమూర్తికి తోడు దొరికినందుకు వారి కళ్లు సంతోషంతో వెలిగిపోయాయి. ప్రముఖ గాయని సునీత వివాహంలో ఆవిష్కృతమైన దృశ్యాలు ఇవి. కొత్త జీవితం మొదలుపెట్టబోతున్నానన్న సంతోషం కంటే.. పిల్లలు అందుకు అండగా నిలిచినందుకే  బహుశా ఆమె ఎక్కువగా ఆనందించి ఉంటారు. ఏదైతేనేమీ ఎన్నో ఒడిదొడుకుల అనంతరం ఆమె.. వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనితో జనవరి 9న ఏడడుగులు నడిచారు. శంషాబాద్‌లోని ఓ ఆలయంలో వీరి పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. (చదవండి: ఘనంగా సింగర్‌ సునీత వివాహ వేడుక)

ఇక అప్పటి నుంచి ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉన్నాయి. సెలబ్రిటీ పెళ్లి.. అందునా ఇద్దరికి రెండో వివాహం. ఇంకేముంది నెటిజన్లకు కావాల్సినంత చర్చ. సునీత నిర్ణయాన్ని స్వాగతిస్తూ భర్తతో ఆమెకున్న అనుబంధాన్ని, అందుకు పిల్లలు ఆనందిస్తున్న తీరు చూసి చాలా మంది అభినందనల అక్షింతలు జల్లుతుంటే.. మరికొంత మంది మాత్రం.. ‘‘పెళ్లీడుకొచ్చిన పిల్లల్ని పెట్టుకుని, తల్లి రెండో పెళ్లి చేసుకోవడం ఏమిటి? సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు’’ అంటూ మండిపడుతున్నారు. అయితే ఇలాంటి కామెంట్లపై సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ తనదైన శైలిలో స్పందించారు. 
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

ఛస్‌! అయ్‌.. అసలు ఏంటిది?
‘‘ఈ కళ్లలో ఆనందం చూస్తే ఎందుకో "ఇబ్బంది."? అరే... ఎదో బాధ్యతతో పెళ్లి చేసుకుంటారు. ఎవరినైనా ఉద్ధరించడానికి పెళ్లి చేసుకుంటారు. బాధల్లో ఉంటే ఓదార్చడానికి,ఆదుకోవడానికి పెళ్లి చేసుకుంటారు. ఇలా సుఖం కోసం. ఆనందం కోసం. ఆర్భాటంగా పెళ్లి చేసుకుని. సంతోషంగా కనిపిస్తే...హమ్మో! ఎంత కష్టం. ఎంత కష్టం. ఎదో రెండోపెళ్లి చాటుమాటుగా చేసుకుని. గిల్ట్ ఫీలవుతూ, ఏడుపు ముఖాలతో కనిపించాలిగానీ. ఈ బిమింగ్ హ్యాపీనెస్ ఏమిటి?ఆ కళ్లలో ఆ ఆనందం ఏమిటి? ఆ వెలుగేమిటి? ఎట్లా ఇట్లా అయితే? సమాజం నాశనం అయిపోదా...హమ్మా!!! సమాజానికి మీరు ఇలా ఏం సందేశం ఇస్తున్నట్టు? ఛస్! ఆయ్!!’’ అంటూ ఫేస్‌బుక్‌ వేదికగా నెగిటివిటీ ప్రచారం చేస్తున్న వారిని ఉద్దేశించి వ్యంగ్యస్త్రాలు సంధించారు. 

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top