‘అనసూయ’గా మారిన వంటలక్క అత్తమ్మ!

Karthika Deepam Soundarya Archana Ananth Special Interview In Sakshi

‘కేరాఫ్‌ అనసూయ’తో మరో పవర్‌ఫుల్‌ పాత్ర ద్వారా ‘స్టార్‌ మా’ ప్రేక్షకుల ముంగిటకొస్తున్నారు అర్చన అనంత్.‌ కార్తీకదీపం సీరియల్‌లో వంటలక్క దీపకు అత్తమ్మ సౌందర్యగా తెలుగు లోగిళ్లలో సుపరిచితమైన వ్యక్తి  అర్చన అనంత్‌. ఐపీఎల్‌ను మించిన క్రేజ్‌ కార్తీకదీపం సీరియల్‌కు తెలుగునాట ఉన్నా సీరియల్‌లో అత్తమ్మగా తప్ప వ్యక్తిగతంగా అర్చన గురించి తెలిసింది అతి కొద్దిమందికి మాత్రమే! ఫ్యాషన్‌ డిజైనర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడిన అర్చన ఇప్పుడు నటిగా మాత్రం విశ్వరూపం చూపుతున్నారు.

కార్తీకదీపంలో తనదైన నటనతో ప్రతి హృదయాన్నీ తట్టిలేపిన ఆమె ఇప్పుడు కేరాఫ్‌ అనసూయ అంటూ ‘స్టార్‌ మా ’ ఛానెల్‌లో అక్టోబర్‌ 12వ తేదీ నుంచి మధ్యాహ్నం 2గంటలకు తెలుగు లోగిళ్లను పలుకరించబోతున్నారు. నటనా రంగం వైపు మళ్లడం దగ్గర నుంచి అనసూయగా తాను చేయబోయే పాత్ర వరకూ అనేక అంశాలను ‘సాక్షి’ తో ముచ్చటించారు.

అలా  మొదలైంది..
డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అని చాలామంది అంటుంటారు కానీ, దానికి భిన్నం అర్చన కెరీర్‌ ప్రయాణం. అసలు తానెన్నడూ నటి కావాలని అనుకోలేదనే అంటుంటారామె. నటిగా మారడానికి గల కారణాలను ఆమె చెబుతూ ‘‘ఫ్యాషన్‌ డిజైనర్‌గా చేస్తున్నవేళ, తన సహచరులు ఓ కన్నడ ప్రాజెక్ట్‌ కోసం ఆడిషన్‌ ఇవ్వమని కోరడం జరిగింది. సరే, అడిగారు కదా అని వెళ్లి ఆడిషన్‌లో పాల్గొన్నాను. ఆ తరువాత నటించే అవకాశం వచ్చింది. చెబితే మీరు నవ్వుతారు కానీ, నా తొలి పాత్ర ఓ శవంలా పడుకోవడం. నో డైలాగ్స్‌... నో ఎక్స్‌ప్రెషన్స్‌. అదీ ఓ షార్ట్‌ఫిలిం కోసం! ఆ చిత్ర కెమెరామెన్‌ మా నాన్నకు స్నేహితులు కావడంతో నేను కూడా ఏం మాట్లాడలేకపోయాను. ఆయన అయితే ఏం లేదు.. మీరు శవంలా పడుకుంటే చాలన్నారు. అలాగే పడుకున్నాను.. అదిగో అలా నా నటనా ప్రయాణం ప్రారంభమైంది’’ అని చెప్పుకొచ్చారు.

సినీ కుటుంబమే కానీ..
అర్చన కుటుంబ నేపథ్యం సినిమానే. నాన్న కన్నడ సినిమాలో పేరున్న నటులు అనంత వేలు. తమ ఇంట్లో సినిమా వాతావరణమే ఉండేది కానీ తనకు దానిమీద ఆసక్తి మాత్రం పెద్దగా ఉండేది కాదు. నాన్న చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. తన పరపతి ఉపయోగించి తనన్ను ఎక్కడా రికమెండ్‌ చేయలేదాయన అని వెల్లడించిన అర్చన... అన్నట్లు తమ నాన్నే తనకు మంచి ఫ్రెండ్‌ అని చెప్పుకొచ్చారు.

కల నెరవేర్చుకోవడానికి పదేళ్లు పట్టింది..
నటిగా మారిన తరువాత తెలుగు వినోద పరిశ్రమలోకి రావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు అర్చన. నిజానికి తన తొలి ప్రాజెక్ట్‌ కన్నడ అని చెప్పిన ఆమె కన్నడ, తమిళ, మలయాళ భాషలలో బిజీగా మారిన తరువాతనే తెలుగుకు రావడం జరిగిందన్నారు. తాను ఓ తెలుగు ప్రాజెక్ట్‌ కోసం వచ్చి తమిళ ప్రాజెక్ట్‌కు ఎంపికయ్యానని, అలాగే మలయాళంలో  కూడా చేశానన్న ఆమె నటిగా మారిన పదేళ్లకు కానీ తెలుగులో తనకు అవకాశం లభించలేదన్నారు. కార్తీకదీపంలో సౌందర్య క్యారెక్టర్‌ కోసమే తనకు ఇన్నేళ్లూ అవకాశం లభించలేదేమోనని అప్పుడప్పుడూ అనిపిస్తుందంటూ కార్తీకదీపంలో ఆ పాత్ర లభించడం తన అదృష్టమన్నారు. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సీరియల్‌కు అభిమానులున్నారిప్పుడు. తనను సౌందర్యగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ గుర్తిస్తుండటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆ క్యారెక్టర్‌లో ఇమిడిపోవడానికి తన నిజ జీవిత సంఘటనలు కూడా కారణమంటూ తన అమ్మ  తమతో ప్రవర్తించే రీతిలోనే.. దీపతో సౌందర్య ఆ సీరియల్‌లో ప్రవర్తిస్తుందన్నారు.
 
ఇకపై అనసూయ అనే అంటారు..?
‘కేరాఫ్‌ అనసూయ’ తెలుగులో తాను చేస్తోన్న తాజా సీరియల్‌ అని చెప్పారు అర్చన. సౌందర్య క్యారెక్టర్‌లాగానే అనసూయ క్యారెక్టర్‌ తనకు మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. అనసూయ క్యారెక్టరైజేషన్‌ గురించి ఆమె వెల్లడిస్తూ మనందరికీ డబ్బు పట్ల అమితమైన ప్రేమ ఉంటుంది. విలాసవంతమైన జీవితం గడపాలనే కోరికా ఉంటుంది. దానికోసం ఒకొక్కరూ ఒక్కోలా శ్రమిస్తారు. పేదింటి పిల్ల అయిన అనసూయ కూడా అంతే ! డబ్బున్న వ్యక్తిని పెళ్లాడితే తాను కోరుకున్న జీవితం వస్తుందని అలాగే చేస్తుంది. అంతేకాదు, తాను అనుభవిస్తున్నట్లుగానే విలాసవంతమైన జీవితం తన కుమార్తెలు కూడా అనుభవించాలనుకుని ఆ ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నంలో జరిగే సంఘటనలే ‘కేరాఫ్‌ అనసూయ’. ఖచ్చితంగా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే క్యారెక్టర్‌ ఇది. ‘స్టార్‌మా’ లోనే తాజా సీరియల్‌ వస్తుండటం, అదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రతి గృహిణినీ కదలించబోతుండటం పట్ల ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. ఇకపై మీ మీ అత్తమ్మ... అనసూయగా మారుతుండటాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారనే నమ్ముతున్నాను.

కార్తీకదీపం లాగానే స్ట్రాంగ్‌ క్యారెక్టర్‌తో సినీ రంగానికి...
కన్నడంలో ఇప్పటికే మూడు చిత్రాలు చేశాను. కానీ తెలుగులో ఓ బలీయమైన క్యారెక్టర్‌తో రావాలని కోరుకుంటున్నాను. అదీ ఓ పవర్‌ఫుల్‌ పోలీసాఫీర్‌గా కనిపించాలనుకుంటున్నాను. అలాగే ‘దాసీ’ క్యారెక్టర్‌లో కూడా నటించాలనుకుంటున్నాను. టీవీ, సినిమా రెండూ వైవిధ్యమైన మాధ్యమాలు. రెండూ గొప్పవే అని అన్నారు. సహజసిద్ధంగా నటన ఉండాలనేది తన భావన అన్న అర్చన, కళ్లతోనే నటించడమే తన దృష్టిలో అసలైన నటనగా వెల్లడించారు. చక్కటి అవకాశం వస్తే ఓటీటీలలో కూడా చేయడానికి అభ్యంతరం లేదన్నారామె.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top