అక్షయ్‌ కుమార్‌ ‘పృథ్వీరాజ్‌’ మూవీపై కర్ణిసేన ఆగ్రహం

Karni Sena Demand Changes The Akshay Kumar Prithviraj Movie Title - Sakshi

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌, మాజీ విశ్వసుందరి మానుషి చిల్లర్‌ ప్రధాన పాత్రల్లో రాబోతున్న చిత్రం ‘పృథ్వీరాజ్’. తాజాగా ఈ మూవీ టైటిల్‌ వివాదంలో చిక్కుకుంది. చక్రవర్తి పృథ్వీరాజ్‌ చౌహాన్‌ జీవిత కథ ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా తన నిర్మాణ సంస్థ యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న మూవీ టైటిల్‌పై కర్ణి సేన సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఈ మూవీ టైటిల్‌ పేరు వెంటనే మర్చాలని కర్ణి సేన యూత్‌ వింగ్‌ ప్రెసిడెంట్‌, చిత్ర నిర్మాత సుర్జీత్‌ సింగ్‌ రాథోర్‌ డిమాండ్‌ చేశారు. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూస్‌  ఆర్టికల్‌ షేర్‌ చేస్తూ మూడు షరతులు విధించారు. మేకర్స్‌ వెంటనే ఈ మూవీ టైటిల్‌ను పృథ్వీరాజ్‌ నుంచి చక్రవర్తి పూర్తి పేరు పృథ్వీరాజ్‌ చౌహాన్‌గా మార్చాలని, అలా కాకుండా ‘పృథ్వీరాజ్’ అని మాత్రమే పేరు పెట్టడం తగదన్నారు. అది హిందూ చక్రవర్తి ప్రతిష్ఠకు భంగం కలిగించడమే అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ తమ డిమాండ్‌లను తిరస్కరిస్తే గతంలో సంజయ్‌ లీలా భన్సాలీ ‘పద్మావత్‌’ సినిమా ఎదుర్కొన్న పరిణామాలనే మీరు కూడా చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ పోస్టులో ఆయన ‘ఈ మూవీలో లీడ్‌ రోల్‌ పోషిస్తున్న అక్షయ్‌ కుమార్‌ను తాము గౌరవిస్తున్నాం. అయితే ఈ చిత్ర నిర్మాత ఆదిత్య ప్రజల మనోభావాలను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. చివరి హిందూ సామ్రాట్‌ యోధుడైన పృథ్వీరాజ్‌ చౌహాన్‌ పూర్తి పేరు మీ మూవీకి పెట్టాలి. అంతేగాక ఇందులో ఆయన గొప్పతనం ప్రతిబింబించాలి. ఒకవేళ అలా లేకుంటే పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి ఆందోళన చేపడతాం’ అంటూ డిమాండ్‌ చేశారు. కాగా గతంలో సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన పద్మావత్‌ సినిమాకు విడుదల సమయంలో వివాదం చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top