దేవీశ్రీ ప్రసాద్‌ ప్రైవేట్‌ ఆల్బమ్‌ను లాంచ్‌ చేసిన కమల్‌హాసన్‌

Kamal Haasan Launches Devi Sri Prasad New Album - Sakshi

తమిళ సినిమా: ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌.. తమిళంలోనూ పలు చిత్రాలకు సంగీతం అందిస్తూ వస్తున్నారు. తాజాగా ఓ పెన్నే (ఓ అమ్మాయి) అనే పాన్‌ ఇండియా ప్రైవేట్‌ ఆల్బమ్‌ను రూపొందించారు. టి.సిరీస్‌ సంస్థ ద్వారా భూషణ్‌ కుమార్‌ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందించిన ఈ ఆల్బమ్‌కు దేవీ శ్రీ ప్రసాద్‌ పాటను రాసి, పాడి, సంగీతాన్ని అందించి నటించడం విశేషం. కాగా, ఈ పాట హిందీ వర్షన్‌ ఇటీవల బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ ఆవిష్కరించారు. తమిళ వెర్షన్‌ పాట ఆల్బమ్‌ను ఆదివారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో నటుడు కమలహాసన్‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా దేవి శ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ నటుడు కమలహాసన్‌ ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అంతర్జాతీయ ఆల్బమ్‌ ఐడియాను ముందుగా తాను కమలహాసన్‌కే చెప్పానన్నారు. ఆయన ప్రోత్సాహం, ఉద్వేగమే తాను ఈ ఆల్బమ్‌ను పూర్తి చేయడానికి కారణం అయ్యాయన్నారు. స్వయం సంగీత కళాకారులు బయట ప్రపంచంలోకి రావాలనే తాను కరోనా కాలంలో రాక్‌ స్టార్‌ కార్యక్రమాన్ని నిర్వహించానని అదేవిధంగా స్వయం సంగీత కళాకారులు అన్ని భాషల్లోనూ తమ ప్రతిభను నిరూపించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ ఓ పెణ్నే మ్యూజిక్‌ ఆల్బమ్‌ను రూపొందించినట్లు చెప్పారు. కమలహాసన్‌ మాట్లాడుతూ దేవి శ్రీ ప్రసాద్‌ తనకు చాలాకాలంగా తెలుసన్నారు. ఈయన తనను ఎంతో అబ్బురపరుస్తున్నారని, ఎంతో సాధిస్తూ ఉద్వేగభరితంగా ముందుకు సాగుతున్నారన్నారు.

ఒక ఉత్తమ సంగీత కళాకారుడికి ఉండాల్సిన లక్షణం ఇదే అన్నారు. ఈయనకు తమిళంలో సక్సెస్‌ ఆలస్యం అయ్యిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేవి శ్రీ ప్రసాద్‌ ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, అందుకు మీ అందరి సహకారం కావాలన్నారు. అదేవిధంగా సినిమా పాటల కంటే ఇలాంటి ప్రైవేట్‌ ఆల్బమ్‌లు చాలా రావాలన్నారు. సంగీత కళాకారులు అందుకు కృషి చేయాలనే భావన తనకు ఎప్పుడూ ఉంటుందన్నారు. సినిమా పాటలకు సంగీత దర్శకులకు కొన్ని పరిధులు ఉంటాయని, అయితే ప్రైవేట్‌ పాటలకు వారి ప్రతిభను పూర్తిగా చాటే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇతర దేశాల్లో సినీ సంగీత దర్శకుల కంటే స్వతంత్ర సినీ సంగీత కళాకారులే ప్రముఖులు అయ్యారని వెల్లడించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top