2020లో మరణించిన సినీ ప్రముఖులు

Irrfan To Sushant Who Bollywood Celebrities We Lost In 2020 - Sakshi

ప్రముఖ నటులను కోల్పోయిన సినీ ఇండస్ట్రీ

కరోనాతో పాటు వెంటాడిన  అనారోగ్య సమస్యలు

అభిమానులను శోకంలో ముంచిన 2020 ఏడాది

2020 ఏడాది ప్రపంచానంతటికి భారంగానే గడిచింది. కరోనా వైరస్‌ ఉద్భవించినప్పటి నుంచి సమస్త ప్రజానీకాన్నిఅస్తవ్యస్తం చేసింది. భారత్‌లోనూ కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ఈ మహమ్మారి మనుషుల జీవన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. కొన్ని లక్షల మంది జీవితాలను ఆర్థికంగా దెబ్బతిసింది. ఎంతో మంది ప్రాణాలను కరోనా వైరస్‌ పొట్టన పెట్టుకుంది. కొందరు కరోనా కారణంగా మృత్యువాతపడితే, మరికొందరు అనారోగ్య కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయారు. వీరిలో బాలీవుడ్‌ ప్రముఖులే అధికంగా ఉన్నారు. నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, గాయకుడు బాలసుబ్రహ్మణ్యాన్ని కూడా ఈ ఏడాదే కోల్పోయాం. అయితే 2020లో మరణించిన సినీ‌ ప్రముఖులెవరో ఇప్పడు చుద్దాం.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌
బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ జూన్‌ 14న బాంద్రాలోని తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బుల్లితెర నటుడిగా సినీ ప్రస్థానం ప్రారంభించిన సుశాంత్‌ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టాడు. ధోని జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఎమ్‌ఎస్ ధోని చిత్రంతో మంచి పేరును సంపాదించాడు. ఆయన నటించిన చివరి చిత్రం దిల్‌ బచారా సుశాంత్‌ మరణించిన అనంతరం జూలై 24న ఓటీటీలో విడుదలైంది. అయితే సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, హత్య అని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి హత్యేనని అతని తండ్రి బిహార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనేక వివాదాలు, ఆరోపణల నడుమ సుశాంత్‌ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. క్రమేణా ఈ హీరో మరణం అనుక మలుపులు తిరిగి చివరికి సినీ ఇండస్ట్రీలో దాగి ఉన్న డ్రగ్స్‌ వ్యవహారాన్ని బయటపెట్టింది. డ్రగ్స్‌ లింక్స్‌ ఉన్న ఎంతో మంది సెలబబ్రిటీల బండారం బట్టబయలు చేసింది. చదవండి: ఏఆర్‌ రెహమాన్‌ తల్లి కన్నుమూత

ఇర్ఫాన్‌ ఖాన్‌ 
బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఏప్రిల్‌ 29 ముంబైలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆస్పత్రిలో కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌ వ్యాధితో పోరాటం చేస్తున్న ఈ నటుడు కొన్నాళ్లు లండన్‌లో చికిత్స కూడా తీసుకున్నాడు. ఈ మధ్యే భారత్‌కు తిరిగి వచ్చిన ఆయన ఆంగ్రేజీ మీడియం సినిమాలో నటించారు. మంగ‌ళవారం ఇర్ఫాన్ మరోసారి అనారోగ్యానికి గురికావ‌డంతో ముంబైలోని కోకిలాబెన్ ఆసుప‌త్రికి తర‌లించారు. చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. కాగా, జనవరి 7, 1967న జన్మించిన ఇర్ఫాన్ ఖాన్, హిందీతో పాటు హాలీవుడ్, దక్షిణాది చిత్రాల్లోనూ నటించారు. స్లమ్‌డాగ్‌ మిలియనీర్, ఎ మైటీ హార్ట్‌, జురాసిక్‌ వరల్డ్‌, లైఫ్‌ ఆఫ్‌ పై వంటి హాలీవుడ్‌ ఉత్తమ చిత్రాల్లోనూ నటించి మంచి పేరును సంపాదించారు. ఇర్ఫాన్, చివ‌రిగా 'అంగ్రేజీ మీడియం' అనే సినిమాలో నటించాడు. ఈయన మొదటి సినిమా ‘సలామ్ బాంబే’. తెలుగులో కూడా ఈయన మహేష్ బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో నటించారు. ఇర్ఫాన్‌కు భార్య సుతాపా సిక్దార్‌, ఇద్దరు కుమారులు ఉన్నారు.

రిషి కపూర్‌
ప్రముఖ నటుడు రిషికపూర్‌ ఏప్రిల్‌ 30న కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడటంతో రిషి కపూర్‌ను కుటుంబ సభ్యులు ముంబైలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ చేర్పించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 2018 నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న రిషి కపూర్‌ ఏడాది పాటు అమెరికాలో చికిత్స తీసుకున్నారు. అనంతరం 2019లో ఇండియాకు తిరిగి వచ్చారు. 1952, సెప్టెంబర్‌ 4న ముంబైలో జన్మించిన రిషీకపూర్‌ మేరా నామ్‌ జోకర్‌ చిత్రంలో బాల నటుడుగా  ‘బాబీ’ చిత్రంతో హీరోగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రంతోనే ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును సొంతం చేసుకున్నారు.  మేరానామ్ జోకర్, బాబీ, జిందా దిల్, రాజా, అమర్ అక్బర్ ఆంటోనీ, సర్గమ్‌, పతీపత్నీఔర్ ఓ..,కర్జ్‌, కూలీ, దునియా, నగీనా, దూస్రా ఆద్మీ చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. రిషీ కపూర్‌కు భార్య నీతూ కపూర్, పిల్లలు రిద్దిమా క‌పూర్, ర‌ణ్‌బీర్ క‌పూర్ ఉన్నారు. 1980లో హీరోయిన్‌ రీతూకపూర్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. నటుడుగానే కాకుండా దర్శక, నిర్మాతగా రాణించిన ఆయన పలు అవార్డులను సొంతం చేసుకున్నారు.

 

సరోజ్‌ ఖాన్‌
ప్రముఖ నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్ జూలై 3న మృతి చెందారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. జూన్‌ 20న శ్వాసకోశ సమస్య కారణంగా ఖాన్‌ ముంబై బాంద్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చేరారు. ఈ సందర‍్భంగా నిర్వహించిన కోవిడ్19 పరీక్షల్లో నెగిటివ్‌గా తేలింది. పరిస్థితి మెరుగుకావడంతో ఆమెను డిశ్చార్జ్ చేశారు. సరోజ్ ఖాన్ హఠాన్మరణం బాలీవుడ్‌లో విషాదాన్ని నింపింది. నాలుగు దశాబ్దాల కెరీర్‌లో, దాదాపు 200కు పైగా సినిమాలకు 2 వేలకు పైగా పాటలకు కొరియోగ్రాఫ్ చేసిన ఘనత ఖాన్  సొంతం. దివంగత నటి శ్రీదేవి సూపర్‌ హిట్‌ మూవీ నాగిని, మిస్టర్ ఇండియాతో పాటు, సంజయ్ లీలా భన్సాలీ  దేవదాస్ లోని  డోలా రే డోలా, మాధురి దీక్షిత్-నటించిన తేజాబ్ నుండి ఏక్ దో టీన్,  2007లో జబ్ వి మెట్ నుండి యే ఇష్క్ హాయేతో సహా ఎన్నో మరపురాని పాటలకు ఆమె కొరియోగ్రఫీ చేశారు. మూడుసార్లు జాతీయ అవార్డులను ఖాన్  గెల్చుకున్నారు.

జగ్‌దీప్
ప్రముఖ హాస్యనటుడు జగ్‌దీప్ (సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ) అనారోగ్య సమస్యల కారణంగా జూలై 9న కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. రమేష్ సిప్పీ తెరకెక్కించిన అమితాబ్ సూపర్ హిట్ మూవీ ‘షోలే’లో సూర్మా భూపాలీ పాత్ర జగ్దీప్ నట జీవితంలోనే ఓ మైలురాయి లాంటిది. ఆ పాత్రకు ఆయనకు వచ్చిన ప్రశంసలు అన్నీఇన్నీ కావు. అంతేకాదు, అందాజ్ అప్నా అప్నా సినిమాలో జగ్దీప్ పోషించిన సల్మాన్ తండ్రి పాత్ర కూడా ఆయన నట జీవితంలో చెప్పుకోదగ్గది. ఆయన చేసిన పాత్రలు దాదాపుగా హాస్య ప్రధానమైనవే కావడం గమనార్హం. బాల్య నటుడిగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన జగ్దీప్ దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు.

బాలసుబ్రహ్మణ్యం
గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం సెప్టెంబర్‌ 25న క‌న్నుమూశారు.  శ్వాస తీసుకోవ‌డానికి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డ ఆయ‌న 25న మధ్యాహ్నం వెంటిలేట‌ర్‌పైనే తుది శ్వాస విడిచారు. త్వ‌రలోనే పూర్తి ఆరోగ్యంతో వ‌స్తాడ‌నుకున్న అభిమానుల‌ను శోక‌సంద్రంలో ముంచేసి తిరిగి రాని లోకాల‌కు బాలు వెళ్లిపోయారు. కాగా ఎస్పీ బాలుకు క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో ఆగ‌స్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్ప‌త్రిలో చేరారు. 50 రోజులుగా వెంటిలేట‌ర్‌పై చికిత్స తీసుకుంటున్న ఆయ‌న మృతి చెంద‌డం ప‌ట్ల‌ ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. ఎస్పీ బాలు పూర్తి పేరు శ్రీప‌తి పండితారాధ్యుల బాలసుబ్ర‌హ్మ‌ణ్యం.. 1946 జూన్ 4న నెల్లూరులోని కోనేట‌మ్మ పేట గ్రామంలో బ్రాహ్మ‌ణ కుటుంబంలో జ‌న్మించారు. ఈయ‌న‌ సాంబ‌మూర్తి, శ‌కుంత‌ల‌మ్మ దంప‌తుల రెండో సంతానం. ఇంజ‌నీర్ కావాల‌ని క‌ల‌లు క‌ని గాయ‌కుడయ్యారు. సావిత్రిని వివాహం చేసుకున్న ఆయ‌న‌కు ఇద్ద‌రు పిల్ల‌లు చ‌ర‌ణ్‌, పల్లవి ఉన్నారు. శ్రీశ్రీశ్రీ మ‌ర్యాద రామ‌న్న(1966) చిత్రంలోతొలిసారి పాట పాడారు. శంకరాభరణం, సాగరసంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా 'ఏక్ దుజే కేలియే' లాంటి హిందీ చిత్రాలకు బాలు పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా సాగిన‌సినీ ప్ర‌స్థానంలో న‌ల‌భై వేల పైచిలుకు పాట‌లు పాడి గిన్నిస్ రికార్డును సాధించారు. 

చిరంజీవి సర్జా
కన్నడ హీరో చిరంజీవి సర్జా జూన్‌ 7న గుండెపోటుతో కన్నుమూశారు. ‘యాక్షన్‌ కింగ్‌’ అర్జున్‌కు మేనల్లుడు, మరో కన్నడ నటుడు ధ్రువ్‌ సర్జాకు సోదరుడు చిరంజీవి సర్జా. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఆయన్ను హాస్పిటల్‌లో జాయిన్‌ చేశారు. చికిత్స పొందుతూ చిరంజీవి సర్జా మృతి చెందారు. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.  1980 అక్టోబరు 17న బెంగళూరులో జన్మించిన చిరంజీవి సర్జా కెరీర్‌ తొలినాళ్లలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశారు. ఆ తర్వాత నటుడిగా మారి 2009లో ‘వాయుపుత్ర’ అనే చిత్రంతో హీరోగా కెరీర్‌ను ప్రారంభించారు. ‘ఆకే’, ‘సింగా’, ‘సంహారా’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన చిరంజీవి సర్జా యాక్షన్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు ఆయన 19 సినిమాల్లో హీరోగా నటించారు. గత ఏడాది చిరంజీవి సర్జా నటించిన నాలుగు సినిమాలు (సింగా, ఖాకీ, ఆద్యా, శివార్జున) ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అలాగే ఆయన హీరోగా కమిటైన నాలుగు సినిమాల్లో ఒక చిత్రానికి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతుండగా, మూడు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి.  2018 మే 2న నటి మేఘనా రాజ్‌ను వివాహమాడారు చిరంజీవి సర్జా. 

జయప్రకాశ్ రెడ్డి
రంగస్థల నటుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి.. ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించిన జయప్రకాశ్ రెడ్డి 2020 సెప్టెంబర్ 8న గుండెపోటుతో మరణించారు. రాయలసీమ మాండలీకంతో విలనిజం పండిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న ఆయన.. ‘ప్రేమించుకుందాం రా', ‘సమరసింహారెడ్డి', ‘జయం మనదేరా', ‘చెన్నకేశవరెడ్డి', ‘టెంపర్‌' తదితర సినిమాల్లో అద్భుతంగా నటించి మెప్పించారు. వెంకటేష్, దాసరి కాంబినేషన్‌లో వచ్చిన బ్రహ్మ పుత్రుడుతో పరిచయమైన.. ప్రేమించుకుందా రా సినిమాతో ఎంతో పాపులర్ అయ్యారు జయప్రకాష్

నిషికాంత్‌ కామత్
‘దృశ్యం’ దర్శకుడు నిషికాంత్‌ కామత్‌ ఆగష్టు 18 న మరణించారు. చాలాకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీలో (ఏఐజీ) జులై 31 నుంచి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కొంతకాలంగా బాగానే ఉన్నప్పటికీ కాలేయ వ్యాధి తిరగబెట్టడంతో శరీరంలోని పలు అవయవాలు పని చేయకపోవడంతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దక్షిణాదిలో ఘనవిజయం సాధించిన ‘దృశ్యం’ సినిమాని అజయ్‌ దేవ్‌గన్, టబులతో బాలీవుడ్‌లో ‘దృశ్యం’ పేరుతోనే రీమేక్‌ చేసి హిట్‌ అందుకున్నారు నిషికాంత్‌ కామత్‌. 2005లో వచ్చిన ‘డోంబివాలీ ఫాస్ట్‌’ అనే మరాఠీ చిత్రంతో దర్శకుడిగా కెరీర్‌ని మొదలుపెట్టిన ఆయన హిందీలో ‘ముంబై మేరీ జాన్, ఫోర్స్, రాకీ హ్యాండ్సమ్‌’ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు ‘సాచ్య ఆట ఘరాట్‌’ అనే మరాఠీ సినిమాలోనూ, ‘డాడీ, జూలీ 2’ వంటి హిందీ చిత్రాల్లోనూ తన నటనతో ఆకట్టుకున్నారు. కాగా దర్శకుడిగా నిషికాంత్‌ చివరి చిత్రం ‘మదారీ’ (2016).

సౌమిత్ర ఛటర్జీ
ఆస్పత్రిలో చేరిన ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ నవంబర్‌ 16న మృతి చెందారు. అక్టోబర్‌ 6న ఛటర్జీ కరోనా బారిన పడి, కోల్‌కత్తాలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆదివారం తుది శ్వాస విడిచారు. ‘గత రెండు రోజులుగా ఛటర్జీ ఆరోగ్యం మరింత విషమించింది.. ఆయన్ను కాపాడటానికి మేం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు’ అని వైద్యులు పేర్కొన్నారు. 1935 జనవరి 19న పశ్చిమబెంగాల్‌లోని కృష్ణానగర్‌లో జన్మించిన సౌమిత్ర ఛటర్జీ థియేటర్‌ ఆర్టిస్ట్‌గా అహింత్ర చౌదరి వద్ద నటనలో శిక్షణ తీసుకున్నారు. స్వయంకృషితో బెంగాలీ చిత్ర సీమలో నంబర్‌వన్‌ స్థాయికి చేరుకున్నారు. బెంగాలీ తొలి తరం నటుల్లో అగ్రగణ్యుడైన సౌమిత్ర  ఛటర్జీ.. సుప్రసిద్ధ దర్శకుడు సత్యజిత్‌ రే ‘అపుర్‌ సంసార్‌’తో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి, పలు సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించారు. సత్యజిత్‌ రే దర్శకత్వం వహించిన 14 సినిమాల్లో ఆయన నటించడం విశేషం.

వాజిద్ ఖాన్
ప్రాణాంతక కరోనా మహమ్మారి బారినపడి ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్(42) జూన్‌ 1న మృత్యువాతపడ్డారు. కిడ్నీ సంబంధిత సమస్యతో సతమతమవుతున్న ఆయనకు కొన్ని రోజుల కిందట కరోనా లక్షణాలు కనిపించాయి. గుండె సంబంధిత సమస్యలతోనూ చికిత్స పొందుతున్న వాజిద్ ఖాన్ ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ పిన్న వయసులోనే చనినపోవడంపై బాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా పలు హిట్ సినిమాలకు పనిచేశారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ సినిమాలు వాంటెడ్, దబాంగ్, ఏక్తా టైగర్ సినిమాలకు, రౌడీ రాథోడ్, హీరోపంటి, పార్ట్‌నర్ లాంటి హిట్ సినిమాలకు సాజిద్ - వాజిద్ జోడీనే స్వరాలు సమకూర్చింది. 

వీరితోపాటు టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు రావి కొండలరావు,  కోసూరి వేణు గోపాల్, నటుడు జాన్ కొట్టోలీ, బుల్లితెర నటి కొండపల్లి శ్రావణి, మలయాళ దర్శకుడు జిబిత్ జార్జ్, తమిళ నటుడు సేతురామన్, తమిళ యువ దర్శకుడు బాలమిత్రన్ కన్నుమూశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top