
బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న 'రామాయణ' సినిమా గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ విజువల్స్ అద్బుతంగా ఉన్నాయంటూ గ్రాఫిక్స్ వర్క్‌పై ప్రశంసలు అందుతున్నాయి. ఈ మూవీ భారతదేశంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డ్ నెలకొల్పనుంది. మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. ఈ కావ్యాన్ని ఆధారం చేసుకుని ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. కానీ, గ్రాఫిక్స్ వర్క్ ప్రధాన బలంగా ఒక అద్భుతాన్ని దర్శకుడు నితేశ్ తివారీ వెండితెరపై చూపించనున్నాడు. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్‌లో 'రామాయణ' పేరుతో అత్యంత భారీ బడ్జెట్ పేరుతో సినిమా వస్తుంది.

భారతీయ సినీ చరిత్రలో అత్యంత బడ్జెట్ చిత్రంగా 'రామయణ'
అన్ని యుద్ధాల్ని అంతం చేసే యుద్ధం మొదలైందని తాజాగా విడుదలైన రామయణ గ్లింప్స్‌లో మేకర్స్ పేర్కొన్నారు. అదేవిధంగా ఈ చిత్రంతో బాక్సాఫీస్ రికార్డ్‌లు అన్నీ అంతం కావడమే కాకుండా కొత్త రికార్డ్ మొదలైంది. రామయణ పార్ట్-1 కోసం ఏకంగా రూ. 835 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దేశంలోనే అత్యంత ఖరీదైన సినిమాగా 'రామాయణ' చరిత్ర సృష్టించింది. రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఇప్పటివరకు అత్యధిక బడ్జెట్ చిత్రాలుగా నిలిచిన కల్కి 2898 ఏడీ (రూ. 600 కోట్లు), ఆర్ఆర్ఆర్ (రూ. 550 కోట్లు), ఆదిపురుష్ (రూ. 550 కోట్లు) వంటి చిత్రాలను రామాయణ అధిగమించింది.

భారీ తారాగణం
రామాయణ సినిమాలో రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. లంకాధిపతి రావణుడి పాత్రలో 'కేజీఎఫ్' ఫేమ్ యశ్ కనిపించనున్నారు. రవి దూబే (లక్ష్మణుడు), సన్నీ డియోల్ (ఆంజనేయుడు)గా కనిపించనున్నారు. వీరితో పాటు వివేక్ ఒబెరాయ్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా, కాజల్ అగర్వాల్, అరుణ్ గోవిల్, షీబా చద్దా వంటి సూపర్‌స్టార్స్ ఈ మూవీ కోసం పనిచేస్తున్నారు. దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ దర్శకత్వంలో ఈ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతుంది.
ఎనిమిది ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న సంస్ధతో మ్యాజిక్
ఈ మూవీ కోసం ఉత్కంఠభరితమైన విజువల్ ఎఫెక్ట్‌లను మేకర్స్ అందించనున్నారు. అందు కోసం కోట్ల రూపాయలే ఖర్చుచేస్తున్నారు. ప్రపంచంలోనే గుర్తింపు పొందిన బ్రిటిష్-ఇండియన్ VFX కంపెనీ ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తుంది. ఈ సంస్థ ఇప్పటికే ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్‌కు గాను ఎనిమిది ఆస్కార్ అవార్డ్‌లను గెలుచుకుంది. ఆపై ఈ మూవీకి హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మెర్ పనిచేస్తున్నారు. ఆయన గ్లాడియేటర్, ఇంటర్ స్టెల్లర్, ది లయన్ కింగ్, డ్యూన్ వంటి టాప్ చిత్రాలకు సంగీతం అందించారు. ఆర్ రెహమాన్ కూడా రామయణ చిత్రానికి సంగీతంలో భాగం పంచుకోవడం విశేషం.