
వెబ్‌సిరీస్: ది హంట్: రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్
నటీనటులు: అమిత్ సియాల్, షాహిల్ వేద్, భగవతి పెరుమాళ్, గిరిష్ శర్మ, దానిష్ ఇక్బాల్, విద్యుత్ గార్గి తదితరులు
దర్శకత్వం: నగేష్ కుకునూర్
ఓటీటీ వేదిక: సోనీలివ్(7 ఎపిసోడ్స్)
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో ‘ది హంట్–ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్’ ఒకటి. ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం.
ఎన్నో సంచలన ఘటనలకు సజీవ సాక్ష్యం చరిత్ర. కానీ సామాన్యులకు చరిత్ర ద్వారా ఆ ఘటనల గురించి తెలిసేది గోరంతే... తెలియాల్సింది కొండంత. అయితే ఇప్పుడు జరిగిపోయిన సంచలన ఘటనలను విశ్లేషించి వాటికో సజీవ రూపాన్ని అందించే ప్రయత్నం ఓటీటీ సిరీస్ రూపంలో జరుగుతోంది.
సాధారణంగా ఏదైనా ఘటన అంటే అది ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? అన్న ఉత్సుకత ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అటువంటి ఉత్సుకతను దృష్టిలో పెట్టుకునే ఓటీటీ నిర్మాతలు జరిగిపోయిన సంచలనాత్మక ఘటనలపై దృష్టి సారిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇటీవల సోనీ లివ్ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతున్న సిరీస్ ‘ది హంట్–ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్’ బాగా ప్రేక్షకాదరణ పొందుతోంది.
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని చెన్నై నగరంలోని పెరుంబుదూర్ ప్రాంతంలోని ఓ మీటింగ్‌లో ఎల్‌టీటీఈ తీవ్రవాదులు మానవబాంబుతో అతి కిరాతకంగా చంపడం మనందరికీ తెలుసు. అయితే ఆ చంపిన తీవ్రవాదులను సరిగ్గా 90 రోజుల్లోనే మన ఇంటెలిజెన్స్ బృందం మట్టుబెట్టింది. ఈ ఆపరేషన్ ఇంత త్వరగా ఆ సంస్థ ఎలా చేసింది? అనేది 7 ఎపిసోడ్లలో అద్భుతంగా చిత్రీకరించారు. మొదటి ఎపిసోడ్‌లో జరిగిన ఘటనను చూపించి ఆ తదనంతర విచారణను చాలా స్పష్టంగా తీశారు దర్శకుడు. ఇటువంటి ఘటనలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన నగేశ్ కుకునూర్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు.
ఇంట్లో ఏదైనా రహస్యం ఉంటేనే మనం దానిని కనుక్కోవాలని విపరీతంగా ఉబలాటపడతాం. అలాంటిది మన దేశ ప్రధాని హత్య వెనుక రహస్యాన్ని చూడడం ఇంకెంత ఆసక్తి రేపుతుందో చెప్పనక్కరలేదు. ఈ 7 ఎపిసోడ్ల సిరీస్ తెలుగు భాషలో కూడా లభ్యమవుతోంది. మస్ట్ వాచ్ సిరీస్.
– హరికృష్ణ ఇంటూరు