Sakshi News home page

Hollywood Shut Down: హాలీవుడ్‌లో సమ్మె సైరన్‌..రోడ్డెక్కిన నటీనటులు

Published Sat, Jul 15 2023 4:16 AM

Hollywood shut down: Hollywood actors and writers double strike - Sakshi

ప్రపంచవ్యాప్త్తంగా సినిమా పరిశ్రమకు ‘పెద్దన్న’ అని హాలీవుడ్‌కి పేరు. భారీ బడ్జెట్‌ చిత్రాలతో, అత్యున్నత సాంకేతిక విలువలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సం΄ాదించుకుంది హాలీవుడ్‌. ఇప్పుడు ఆ హాలీవుడ్‌ నిరసనలతో భగభగమంటోంది. సమ్మె సైరన్‌ తప్ప యాక్షన్‌.. సౌండ్‌లాంటి షూటింగ్‌ లొకేషన్లో వినిపించే మాటలు వినిపించడంలేదు. నటీనటులు మేకప్‌ వేసుకోవడంలేదు.. రచయితలు కలం మూత తెరవడంలేదు. దాంతో షూటింగులు నిలిచిపోయాయి. కరోనా టైమ్‌లో  వెలవెలబోయినట్లు స్టూడియోలు కళ తప్పాయి. ఇన్నాళ్లుగా సమ్మె చేస్తూ వచ్చిన రచయితల సంఘానికి నటీనటుల సంఘం మద్దతు తెలిపింది. ‘వేతనాలు పెంచండి... గౌరవించండి... సౌకర్యాలు సమకూర్చండి..’ అంటూ పలు నినాదాలతో సమ్మె కొనసాగిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళదాం..

హాలీవుడ్‌ చిత్ర పరిశ్రమని డబుల్‌ స్ట్రయిక్‌ కుదిపేస్తోంది. ఓ వైపు కొన్నాళ్లుగా ‘రైటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ అమెరికా’ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతోంది. తాజాగా ‘ది స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌’ సమ్మెకు పిలుపునిచ్చింది. తాము రాసే టీవీ షోలు, ఓటీటీ సిరీస్‌ల నుంచి మంచి లాభాలు ఆర్జిస్తున్న నిర్మాణ సంస్థలు తమకు కనీస వేతనాలు ఇవ్వడంలేదని ఆరోపిస్తూ ‘రైటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ అమెరికా’ ఆధ్వర్యంలో పదకొండు వారాలుగా రచయితలు సమ్మె చేస్తున్నారు. ఇప్పుడు హాలీవుడ్‌ నటీనటులు సైతం రైటర్స్‌ సమ్మెలో చేరాలని నిర్ణయించుకున్నారు. నిర్మాణ సంస్థలు, ఓటీటీలతో జరిపిన చర్చలు విఫలం కావడంతో భారతీయ కాలమానం ప్రకారం గురువారం రాత్రి సమ్మె ఆరంభమైంది. దీంతో షూటింగ్‌లు ఆగాయి.  

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (కృత్రిమ మేథస్సు) హాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కృత్రిమ మేథస్సుతో పని చేసే ఓ యాంకర్‌ని ఇటీవలే పరిచయం చేశారు. ఈ సెగ హాలీవుడ్‌కు బాగానే తాకింది. కృత్రిమ మేథస్సుతో ముప్పు పొంచి ఉందని, తమ భవిష్యత్తుకి భరోసా ఇవ్వడంతోపాటు జీతాలు పెంచాలని, సరైన పని నిబంధనలను కల్పించాలని ‘ది స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌’ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ‘ఏ’ లిస్ట్‌ యాక్టర్స్‌తో సహా 1,60,000 మంది నటీనటులకు ‘స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌–అమెరికన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ టెలివిజన్‌ అండ్‌ రేడియో ఆర్టిస్ట్స్‌’ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రధాన నిర్మాణ స్టూడియోలతో జరిగిన చర్చలు విఫలం కావడంతో ‘ది స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌’ నిరవధిక సమ్మెకు దిగింది. ‘రైటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ అమెరికా’, ‘ది స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌’ సమ్మెతో ప్రస్తుతం కొనసాగుతున్న హాలీవుడ్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, టీవీ షో షూటింగ్స్‌ ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.

‘ఓపెన్‌ హైమర్‌’ ప్రీమియర్‌ నుండి నిష్క్రమణ...  
క్రిస్టోఫర్‌ నోలన్‌ దర్శకత్వం వహించిన హాలీవుడ్‌ ఫిల్మ్‌ ‘ఓపెన్‌ హైమర్‌’ ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా లండన్‌లో గురువారం ఈ సినిమా ప్రీమియర్‌ వేశారు. అయితే గురువారం అర్ధరాత్రి ‘ది స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌’ సమ్మెప్రారంభం కావడంతో ‘ఓపెన్‌ హైమర్‌’ ప్రీమియర్‌ నుండి యాక్టర్స్‌ రాబర్ట్‌ డౌనీ జూనియర్, సిలియన్‌ మర్ఫీ, మాట్‌ డామన్, ఎమిలీ బ్లంట్‌ వంటి స్టార్స్‌తో సహా పలువురు నటీనటులు వెళ్లిపోయినట్లు హాలీవుడ్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. హాలీవుడ్‌ ప్రముఖ సంస్థలు ‘పారామౌంట్, వార్నర్‌ బ్రదర్స్, డిస్నీ, నెట్‌ ఫ్లిక్స్‌’ వంటి వాటి ప్రధాన కార్యాలయాల వద్ద శుక్రవారం ఉదయం పికెటింగ్‌ (సమ్మె)ప్రారంభించారని టాక్‌.  

ఎమ్మీ, ఆస్కార్‌ అవార్డ్‌ వాయిదా?
హాలీవుడ్‌లో మొదటిసారి 1960లో నటుడు రోనాల్డ్‌ రీగన్‌ నేతృత్వంలో రచయితల సంఘం, నటీనటుల సంఘం కలిసి డబుల్‌ స్ట్రైక్‌ చేశాయి. అలానే 1980లో స్క్రీన్‌ యాక్టర్స్‌ సమ్మె మూడు నెలలపాటలు జరిగింది. మళ్లీ 63 ఏళ్లకు ఇప్పుడు రచయితల, నటీనటుల సంఘం కలసి డబుల్‌ స్ట్రైక్‌ చేస్తుండటం విశేషం. ఈ సమ్మె ఇలాగే కొనసాగితే పెద్ద చిత్రాల విడుదల వాయిదా పడే పరిస్థితి. అలాగే సెప్టెంబర్‌ 18న జరగనున్న ఎమ్మీ అవార్డ్స్, టెలివిజన్‌ వెర్షన్‌ ఆస్కార్‌ అవార్డులు కూడా నవంబర్‌ లేదా వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం ఉందని హాలీవుడ్‌ మీడియాలోవార్తలొస్తున్నాయి.                ∙

సమ్మె బాధాకరం
‘ది స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌’ సమ్మెను స్టూడియోలకుప్రాతినిధ్యం వహిస్తున్న ‘అలయన్స్‌ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ అండ్‌ టెలివిజన్‌ ప్రొడ్యూసర్స్‌’ తప్పుబట్టింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘సినిమాలు, టీవీ కార్యక్రమాలకు జీవం పోసే నటీనటులు లేకుండా స్టూడియోలు పని చేయవు. కాబట్టి సమ్మె అనేది ఆశించిన ఫలితం ఇవ్వదు. పరిశ్రమపై ఆధారపడిన వేల మంది కార్మికుల ఆర్థిక ఇబ్బందులకు దారి తీసే మార్గాన్ని యూనియన్‌ ఎంచుకోవడం బాధాకరం’’ అని పేర్కొంది.

Advertisement
Advertisement