కాజల్‌ ప్లెస్‌లో త్రిష.. సాయేషా స్థానంలో ప్రగ్యా.. చివరి క్షణంలో మారిన తారలు

Heroine Changes In Upcoming Movies - Sakshi

‘యస్‌... ఈ సినిమా చేస్తా’... హీరోయిన్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేసింది. ‘అయ్యో... కుదరడం లేదండీ’... కొన్నాళ్లకు రెడ్‌ సిగ్నల్‌ పడింది. మళ్లీ కొత్త హీరోయిన్‌ వేటలో పడింది సినిమా యూనిట్‌. ఈ మధ్యకాలంలో ఇలా తారుమారు అయిన తారల జాబితా చాలానే ఉంది. ఒకరు తప్పుకుంటే.. ఇంకొకరికి ఆ చాన్స్‌ దక్కింది. ఆ ‘తారమారె’ విశేషాలు తెలుసుకుందాం. 

చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రంలో ‘ఆచార్య’ తొలి ప్రియురాలు త్రిషే. 2016లో వచ్చిన ‘స్టాలిన్‌’ తర్వాత చిరంజీవి, త్రిష జోడీ మరోసారి ‘ఆచార్య’ కోసం స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారని ఫ్యాన్స్‌ హ్యాపీ ఫీలయ్యారు కూడా. కానీ కొన్ని కారణాల వల్ల త్రిష తప్పుకోవడం, ఆ స్థానాన్ని కాజల్‌ అగర్వాల్‌ రీప్లేస్‌ చేయడం చకచకా జరిగిపోయాయి. ఇక ‘ఆచార్య’ చిత్రంలో త్రిష ప్లేస్‌ను కాజల్‌ రీప్లేస్‌ చేస్తే కమల్‌హాసన్‌ ‘భారతీయుడు 2’లో హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ రోల్‌ను త్రిష రీప్లేస్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాజల్‌ అగర్వాల్‌ గర్భవతి కావడంతో ‘భారతీయుడు 2’ నుంచి ఆమె తప్పుకున్నారు. ఆ పాత్రకు త్రిషను సంప్రదించారట చిత్రదర్శకుడు శంకర్‌.


‘భారతీయుడు 2’ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్‌ తాజా చిత్రాలు ‘పొన్నియిన్‌ సెల్వన్‌’, ‘రాంగీ’ (ఎప్పుడో షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది)లో త్రిష నటించారు. సో.. నిర్మాణ సంస్థతో ఉన్న అనుబంధం, కమల్‌తో సినిమా కాబట్టి ‘భారతీయుడు 2’కి త్రిష గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఎలాగూ ‘భారతీయుడు 2’ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి... ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర నుంచి ఐశ్వర్యా రాజేశ్‌ కొన్ని కారణాల వల్ల∙తప్పుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ మాటకొస్తే ‘భారతీయుడు 2’ సినిమాయే కాదు.. మలయాళ హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ తెలుగు రీమేక్‌ ‘భీమ్లా నాయక్‌’లో రానా భార్య పాత్ర ఒప్పుకుని, ఆ తర్వాత తప్పుకున్నారు ఐశ్వర్యా రాజేశ్‌.


దాంతో రానా భార్యగా సంయుక్తా మీనన్‌ సీన్లోకి వచ్చారు. ఇక 2015లో ‘అఖిల్‌’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన సాయేషా సైగల్‌ చాలా గ్యాప్‌ తర్వాత ఒప్పుకున్న చిత్రం బాలకృష్ణ ‘అఖండ’. అయితే ఆర్యను పెళ్లి చేసుకున్న సాయేషా తల్లయ్యారు. దాంతో ఆమె ప్లేస్‌ను  ప్రగ్యా జైస్వాల్‌ రీప్లేస్‌ చేశారు. ఇంకా నాగార్జున నటిస్తున్న ‘ఘోస్ట్‌’లో హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ పాత్ర అమలాపాల్‌కు దక్కిందన్నది ఫిల్మ్‌నగర్‌ లేటెస్ట్‌ టాక్‌. అలాగే జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు హిందీకి వెళితే.. అజయ్‌ దేవగన్‌ హీరోగా నటించిన హిందీ చిత్రం ‘మైదాన్‌’లో కథానాయికగా నటించడానికి ఒప్పుకుని, ఆ తర్వాత తప్పుకున్నారు కీర్తీ సురేశ్‌.

ఆ పాత్రను ప్రియమణి చేశారు. ఇదిలా ఉంటే.. తొలి హిందీ ప్రాజెక్ట్‌ కోసం నయనతార ఓ తమిళ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. షారుక్‌ ఖాన్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్‌గా చేస్తున్నారు నయనతార. అయితే షారుక్‌ తనయుడు ఆర్యన్‌ అరెస్ట్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. ఈ కారణంగా యువరాజ్‌ దయాలన్స్‌ దర్శకత్వంలో అంగీకరించిన తమిళ సినిమాకు డేట్స్‌ కేటాయించలేక నయనతార వదులుకున్నారు. దీంతో ఈ సినిమాలో నటించే అవకాశం శ్రద్ధా శ్రీనాథ్‌ సొంతమైనట్లు టాక్‌. వీరే కాదు.. తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమల్లో రీప్లేస్‌ అయిన తారలు ఇంకొందరు ఉన్నారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top