Harish Shankar: పక్కోడి సినిమా పోతే చప్పట్లా? అది కామన్‌సెన్స్‌ లేనోడు చేస్తాడు

Harish Shankar Speech in Balagam Success Meet - Sakshi

కంటెంట్‌ ఉన్న సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనేది బలగంతో మరోసారి నిరూపితమైంది. రోజురోజుకీ వసూళ్లు పెంచుకుంటూ పోతూ హిట్‌ ట్రాక్‌ ఎక్కిందీ మూవీ. శుక్రవారం ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. దీనికి డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ ప్రత్యేక అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'చాలా రోజుల నుంచి చూస్తున్నా. సినిమాను క్లాస్‌, మాస్‌, కమర్షియల్‌ అని వేరు చేసి మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఇండస్ట్రీలో మనం పెట్టుకున్న పేర్లు. కానీ జనాలు మంచి సినిమానా? కాదా? ఆ ఒక్కటే చూస్తారు. శంకరాభరణం, సాగరసంగమం సినిమాలకు బండ్లు కట్టుకుని వెళ్లారు. ఇసుకేస్తే రాలనంత జనం. ఆ సినిమాల్లో సుమోలు ఎగరలేదు, రక్తపాతాలు జరగలేదు. కానీ మాస్‌ ఆడియన్స్‌ కూడా చూశారు. అంతెందుకు, ఈ సినిమా చూసి కమర్షియల్‌ డైరెక్టర్లు అనిల్‌ రావిపూడి, వంశీ పైడిపల్లి, త్రినాధ్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఒకడు మూడు వందల కోట్ల సినిమా తీసినా, ఒకడు మూడు కోట్ల సినిమా తీసినా అన్నీ మన సినిమాలే. బయట మనకెన్నో సమస్యలున్నాయి.. వాటిపై పోరాడటం మానేసి మనలో మనం పోట్లాడుకోవడం కరెక్ట్‌ కాదు. పెద్ద సినిమా, చిన్న సినిమా అని కాదు, దేనికదే యునిక్‌. కాసర్ల శ్యామ్‌ రాసిన పాటలు అద్భుతంగా ఉన్నాయి. మనం త్వరలోనే కలిసి పనిచేద్దాం. కేజీఎఫ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి సినిమాలు హిట్‌ అయినప్పుడు మేమంతా సెలబ్రేట్‌ చేసుకుంటాం. ఎందుకంటే హమ్మయ్య బయ్యర్ల దగ్గర డబ్బులున్నాయి. తర్వాత నా సినిమాను మంచి రేటుతో కొంటారని అనుకుంటాం. అందుకే మా ముందు సినిమాలు హిట్‌ అయితే సంతోషపడతాం. అంతే తప్ప చాలా మంది అనుకున్నట్లు పక్కోడి సినిమాలు పోతే చప్పట్లు కొట్టం. అది కామన్‌సెన్స్‌ లేనివాళ్లు చేసే పని' అని చెప్పుకొచ్చాడు హరీశ్‌ శంకర్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top