‘‘ఒకప్పుడు అన్ని రకాల జానర్ సినిమాలు వచ్చేవి. కానీ, కొంతకాలంగా ఫ్యామిలీ సినిమాలు తగ్గిపోయాయి. అందుకే మంచి ఫ్యామిలీ సినిమా వస్తే, ప్రేక్షకులు థియేటర్స్‌కు క్యూ కడుతున్నారు. కోవిడ్ టైమ్‌లో ఆడియన్స్ కొత్తదనం కోరుకుంటున్నారని తెలుసుకున్నాను. ఇందుకు తగ్గట్లే జానర్స్ షిఫ్ట్ చేస్తూ, కథలు రాస్తూ సినిమాలు చేస్తున్నాను’’ అని వెంకీ అట్లూరి చెప్పారు. సూర్య, మమిత బైజు హీరో హీరోయిన్లుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలైంది.
ఈ సినిమా రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, విజయవంతంగా ప్రదర్శితమవుతోందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా గురువారం విలేకరుల సమావేశంలో వెంకీ అట్లూరి చెప్పిన విశేషాలు...
⇒ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాకు మేం ఊహించినదానికంటే ఎక్కువ స్పందన లభిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. సూర్యగారు ఈ సినిమా కథ వినగానే కథకు అనవసరమైన కామెడీ లేదా కమర్షియల్ అంశాలు జోడించకుండా నిజాయితీగా చెబుదామని అన్నారు. అందుకే కథలోని ఏ పాత్ర పడిపోకుండా జాగ్రత్తలు వహించాను. అలాగే క్లైమాక్స్‌లో కూడా చాలా కేర్ తీసుకున్నాం.
⇒ నా దృష్టిలో ఏ మనిషి చెడ్డవారు కాదు. పరిస్థితుల వల్ల ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవరిస్తుంటారు. ఇదే ఈ విషయాన్ని ఈ సినిమాలో చెప్పాను. వయసు వ్యత్యాసం ఉన్న బంధంపై కథ రాయాలనుకున్నప్పుడే హీరోకు 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడానికి బలమైన కారణం ఉండాలనుకుని, ఈ అంశం చుట్టూ ఈ కథ అల్లాను. వయసు వ్యత్యాసం కూడిన అంశాన్ని తమిళనాడు సీఎం విజయ్‌గారి జీవితంతో పోల్చుతూ కొందరు సోషల్ మీడియాలో మీమ్స్ చేస్తున్నారని అంటున్నారు. కానీ నిజానికి ఈ కథను 2022లోనే అనుకుని, క్యారెక్టర్ పేరు సంజయ్ అని రాసుకున్నాను. కాకపోతే హీరోగా సూర్యగారిని ఊహించుకోలేదు. సూర్యగారికి కథ చెప్పిన తర్వాత ఆయన బాడీ ల్యాంగ్వేజ్‌కి తగ్గట్లు కొన్ని మార్పులు చేయడం జరిగింది.
⇒ సూర్యగారికి తమిళంలో మంచి మార్కెట్ ఉంది. అందుకే ఈ సినిమాను తమిళంలో తీసి, తెలుగులో డబ్ చేశాం. అయితే తమిళంలో కన్నా, తెలుగులోనే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి కదా అంటున్నారు. కానీ రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను చూస్తున్నారు. తమిళనాడు ఒక రాష్ట్రం మాత్రమే. పైగా మన దగ్గర థియేటర్స్ సంఖ్య ఎక్కువ. అలాగే టికెట్ ధరల్లో కూడా వ్యత్యాసం ఉంది. అయితే అక్కడి సిని మాలకు థియేటర్స్‌లో లాంగ్ రన్ ఉంటుంది.
⇒ సితార బ్యానర్‌లో నిర్మితమయ్యే సినిమాలకు త్రివిక్రమ్‌గారి పర్యవేక్షణ ఉంటుంది. దీంతో ఆయన సినిమాలు చూసి కొన్ని చిన్న చిన్న మార్పులు చెబుతుంటారు. కానీ ఈ సినిమాకి ఆయన ఏ మార్పులు చెప్పలేదు. డబ్బు, అగ్రిమెంట్లను మించిన అతీతమైన బంధం సితార బ్యానర్‌తో నాకు ఏర్పడింది. నా నెక్ట్స్ చిత్రం కూడా ఇదే బ్యానర్‌లో ఉండొచ్చు. ఇటీవలి కాలంలో తెలుగు హీరోతోనే సినిమా చేయాలనుకున్నాను. ఏంటో... అనుకుంటే కుదరడం లేదు. ఈసారి అనుకోకుండా ముందుకు వెళ్తాను (నవ్వుతూ).


