
బిగ్‌బాస్ 9 నుంచి దమ్ము శ్రీజను ఎలిమినేషన్ పేరుతో కావాలనే హౌస్ నుంచి పంపించేశారని ప్రేక్షకుల అభిప్రాయం. దీంతో రీఎంట్రీ కోసం ఆమెకు మద్ధతు కూడా తెలిపారు. అయితే, బిగ్‌బాస్ మనసు మాత్రం కరగలేదు. తనకు నచ్చిన వారిని మాత్రమే హౌస్‌లో ఉంచుతాననే సంకేతాన్ని ఈ సీజన్‌తో బిగ్‌బాస్ ఇచ్చేశాడు. దీంతో ఈ షో అంతా ఒక ఫేక్ అంటూ ఓట్లేసిన వారే అంటున్నారు. తమ ఓటింగ్‌తో సంబంధం లేకుండా శ్రీజను ఎలా ఎలిమినేట్ చేస్తారని ఫైర్ అయ్యారు. అయితే, ఎన్నో ఆశలతో బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన శ్రీజ మాత్రం ఇప్పటికీ ఆ ట్రామా నుంచి కోలుకోలేదని తెలుస్తోంది. తాజాగా ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక వీడియో షేర్ చేసింది.
శ్రీజ తండ్రి విశాఖ మున్సిపాలిటీ 92వ వార్డులో పారిశుధ్య విభాగంలో అవుట్‌సోర్సింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. చిన్న తనం నుంచే కష్టాలతో పెరిగిన శ్రీజ కూడా చాలా కష్టపడి చదవి ఉన్నత చదువులు పూర్తి చేసింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నెలకు రెండు లక్షలకు పైగా జీతంతో ఉద్యోగం సాధించింది. అయితే, ఇండస్ట్రీ మీద ఉన్న ఫ్యాషన్‌తో బిగ్‌బాస్ వైపు అడుగులేసింది. అందులో ఛాన్స్ రాగానే తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. కానీ, బిగ్‌బాస్ మాత్రం ప్రేక్షకుల ఓటింగ్స్‌తో సంబంధం లేకుండా ఆమెను హౌస్ నుంచి పంపించేశాడు. దీంతో ఆమె జీవితంలో తీరని నష్టాన్ని బిగ్‌బాస్ మిగిల్చాడని చెప్పవచ్చు.
ఉద్యోగం కూడా వదిలేశాను: శ్రీజ
బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పటికీ కూడా నేను ఒక్క ఎపిసోడ్ చూడలేదు. దీపావళి సెలబ్రేషన్స్ టైమ్‌లో హౌస్‌లో నేను ఉండాల్సింది కదా అనిపిస్తుంది. అగ్నిపరీక్ష దాటుకునేందుకు చాలా కష్టపడ్డాను. 5 లెవల్స్ దాటుకొని అక్కడి వరకు చేరుకున్నాను. బిగ్‌బాస్ కోసం ఒక పర్మినెంట్ టాటూ కూడా చేతిపై వేయించుకున్నాను. ఈ షో కోసం నా జాబ్‌ను కూడా వదులుకున్నాను. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాక గెలుపు కోసం వంద శాతం ప్రయత్నం చేసిన సరే లక్ కలిసిరాలేదు. ఎలిమినేషన్ రౌండ్‌లో కూడా ప్రతి టాస్క్‌లో చివరి వరకు వెళ్లాను. కానీ, గెలుపు మాత్రం దక్కలేదు. ఇప్పటి వరకు జరిగిన బిగ్‌బాస్ సీజన్స్‌లో కూడా నా మాదిరి ఎవరూ ఎలిమినేట్ కాలేదు. 5వారాలు హౌస్‌లో ఉన్నా కూడా ఒక జర్నీ లేకుండానే బయటకు వచ్చేశాను. అని కన్నీళ్లు పెట్టుకుంది.