
ఇల్లు కట్టి చూడు- పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు. ఇప్పుడీ రెండు పనులు భుజానేసుకున్నారు బుల్లితెర జంట ప్రియాంక జైన్ (Priyanka Jain)- శివకుమార్ (Shivakumar). కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న వీరిద్దరూ పెళ్లిని ఎంతో గ్రాండ్‌గా జరుపుకోవాలని డిసైడయ్యారు. ఈ ఏడాదే పెళ్లి అని ప్రకటించారు.. కానీ అది వాయిదా పడేలాగే కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం మరో ముఖ్యమైన పని మీద పడ్డారు.
గతేడాది ల్యాండ్ కొన్న జంట
ప్రస్తుతం అద్దె ఇంట్లో కలిసుంటున్న ప్రియాంక -శివ్ గతేడాది హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్నారు. భూమి కొని.. అక్కడ ఇల్లు కట్టుకుంటే ఆ మజాయే వేరంటూ 2024 ఏప్రిల్‌లో భూమి కొని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మంచి ముహూర్తం చూసుకుని ఇంటిపనులు మొదలుపెట్టారు. ఆ విషయాన్ని ఈ ప్రేమపక్షులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కోటి రూపాయల లోన్‌తో ఇల్లు కట్టుకుంటున్నట్లు తెలిపారు.

మా ఫ్యూచర్ కళ్లముందు..
ఇది కేవలం ఇటుకలతో కాదు, ఎన్నో ఆశలు, కలలతో నిర్మితమవుతోన్న ఇల్లు. నిలువైన గోడల్ని చూస్తుంటే మా భవిష్యత్తు కళ్ల ముందు కనిపిస్తోంది. ఇక్కడ కేవలం ఇంటికి పునాది పడలేదు. జీవితకాల జ్ఞాపకాల సమాహారానికి పునాది పడింది. ఈ కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. ఇక్కడ అందమైన జ్ఞాపకాలను కూడబెట్టుకునేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాం. ఇది మా శాశ్వత నివాసం అని రాసుకొచ్చింది.
సీరియల్స్‌తో పాపులారిటీ
ఇది చూసిన అభిమానులు, సెలబ్రిటీలు ప్రియాంక-శివ్ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా వీరిద్దరూ మౌనరాగం సీరియల్‌లో జంటగా నటించారు. అప్పుడే వీరి పరిచయం ప్రేమగా మారింది. జానకి కలగనలేదు సీరియల్‌తో ప్రియాంక మరింత పాపులారిటీ సంపాదించింది. తర్వాత తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్‌లో పాల్గొంది. టాప్ 5లో ఒకరిగా నిలిచింది. శివకుమార్ ప్రస్తుతం తెలుగులో ఓ సీరియల్ చేస్తున్నాడు.