
సుమన్, గౌరవ్ కెప్టెన్స్ అయ్యారని ముందే లీక్ అవడంతో ఎపిసోడ్‌లో పస లేకుండా పోయింది. హౌస్‌మేట్స్‌ను వచ్చినప్పటినుంచి చెడుగుడు ఆడేసుకుంటున్న ఆయేషా ఒక్క గేమ్‌లో ఓడిపోయినందుకు గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 17వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..
అంతా నావల్లే..
కెప్టెన్సీ కంటెండర్లను జంటలుగా విడిపోమన్నాడు బిగ్‌బాస్ (Bigg Boss 9 Telugu). సుమన్‌తో జత కట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపించలేదు. చివరకు గౌరవ్ అతడితో జోడీ కట్టాడు. మాధురి- రమ్య, ఆయేషా- సాయి, గౌరవ్- సుమన్ జంటలు కెప్టెన్సీ గేమ్ ఆడారు. ఈ గేమ్‌లో సుమన్-గౌరవ్ చాలా ప్రశాంతంగా ఆడి గెలిచారు. ఓటమిని ఆయేషా జీర్ణించుకోలేకపోయింది. నాకు చీకట్లో కళ్లు సరిగా కనిపించలేదు, నా వల్లే గేమ్ పోయిందంటూ తన చెంపపై తనే కొట్టుకుంటూ ఏడ్చింది. ఆమెనలా చూసి మాధురి సైతం కన్నీళ్లు పెట్టుకుంది.

పవన్ వాడేసిన నిఖిల్
గెలిచిన జంట సుమన్ (Suman Shetty)- గౌరవ్‌ను కెప్టెన్స్‌గా ప్రకటించాడు బిగ్‌బాస్. అంతలోనే ఓ ట్విస్ట్ ఇచ్చాడు. నిఖిల్.. తన కెప్టెన్సీ కంటెండర్ పవర్ ఉపయోగించి కెప్టెన్స్‌లో ఒకర్ని చాలెంజ్ చేయొచ్చన్నాడు. దీంతో అతడు గౌరవ్‌తో తలపడతానన్నాడు. అలా వీరిద్దరికీ సాండ్ టాస్క్ పెట్టగా ఇందులో గౌరవ్ గెలిచి తన కెప్టెన్సీ కాపాడుకున్నాడు. అలా గెలిచాడో, లేదో.. అప్పుడే సుమన్‌తో చర్చించి ఆయేషాకు ఓ వరమిచ్చాడు.
భరణిలో భయం మొదలైందా?
ఆయేషాకి పడుకోవడానికి బెడ్ లేదు కాబట్టి.. ఇంకో ఇద్దరమ్మాయిలతో కలిసి కెప్టెన్ రూమ్‌లో పడుకోవచ్చు.. మేము బయట మిగిలిన బెడ్స్‌పై పడుకుంటాం అన్నాడు. ఈ మాటకు అందరూ చప్పట్లు కొట్టారు. ఇక బంధాల సుడిగుండంలో చిక్కుకున్న భరణి (Bharani Shankar)కి తన ఫ్యూచర్ అర్థమైపోయింది. ఎలిమినేట్ అవుతానని భయపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయం ఇమ్మాన్యుయేల్ మాటల్లో స్పష్టమైంది. సంజనతో ఇమ్మూ మాట్లాడుతూ.. ఎప్పుడైనా నేను డేంజర్‌లో ఉన్నప్పుడు.. ఇంట్లో ఎవరూ నన్ను కాపాడలేనప్పుడు నువ్వు నాతో ఉంటావా? అని భరణి అన్న అడిగాడని చెప్పాడు.

మహా ముదురు
ఆ మాటకు సంజనా అవాక్కైపోయి.. నీ దగ్గర పవరాస్త్ర ఉంది, కాబట్టి నిన్ను ముందే లాక్ చేస్తున్నాడన్నమాట! మహా ముదురు అని కామెంట్ చేసింది. ఇంకా ఇమ్మూ మాట్లాడుతూ.. హౌస్‌లో 15 మంది ఒకవైపు, నువ్వొకడివే ఒకవైపు ఉంటే.. నీవైపు న్యాయం ఉంటే.. అప్పుడు నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పా.. అని ఇమ్మూ సంజనాతో చెప్పుకొచ్చాడు. అంటే భరణిలో ఎలిమినేషన్ భయం మొదలైందన్నమాట!