
నామినేషన్స్‌లోనే లేని సంజనా (Sanjana Galrani)ను ఎలిమినేట్ చేసిన ఇంటిసభ్యులు.. ఏంటి? నిజమే? అంత సీన్ లేదు! అలా స్టేజీపైకి పిలిచి అందరినీ తిట్టించి మళ్లీ ఇలా హౌస్‌లోకి పంపించారు. సంజనాలోని వైల్డ్‌ఫైర్‌తో శనివారం ఎపిసోడ్ ఎంటర్‌టైనింగ్‌గానే సాగింది. ముందుగా సంజనా స్టేజీపైకి రాగానే తనకోసం స్టాండ్ తీసుకోలేదని భరణిని ఏకిపారేసింది. బిడ్డా, బిడ్డా అంటూ తలమీద పెట్టుకుని చూసుకుంటే తన తలతో ఫుట్‌బాల్ ఆడాడని రాముపై మండిపడింది.
త్యాగాలు చేస్తే హౌస్‌లోకి సంజనా..
అన్నపూర్ణలా వండిపెట్టాలని చెప్పే హరీశ్ ఒకే డ్రెస్సుతో నాలుగురోజులుగా వంటచేస్తున్నాడు, ఏం చెప్పినా వినడు, ఈ మనిషితో బతకడం కష్టం అని మాస్క్ మ్యాన్ గురించి తన అభిప్రాయం చెప్పింది. ఇమ్మాన్యుయేల్‌ను కప్పు నీదే అని పదేపదే నొక్కి చెప్పింది. తర్వాత సంజనాకు బై చెప్పిన నాగ్.. ఆమె వెళ్లిపోతుంటే ఒక్క నిమిషం అంటూ మళ్లీ పిలిచాడు. బిగ్‌బాస్ ఆమెను ఇంట్లోకి పంపించే అవకాశం ఇస్తున్నాడు. కానీ, దీనికోసం కొన్ని త్యాగాలు చేయాలన్నాడు. ముందుగా ఇమ్మాన్యుయేల్‌ను కెప్టెన్సీ వదిలేయాలన్నాడు. క్షణం ఆలోచించకుండా ఇమ్మూ తన కెప్టెన్సీ బ్యాండ్ తిరిగిచ్చేశాడు.

జుట్టు కత్తిరించుకున్న రీతూ
తనూజకు ఎంతో ఇష్టమైన కాఫీ జోలికి సీజన్ అయిపోయేవరకు వెళ్లకూడదన్నాడు. అందుకు తనూజ కోసం ఒప్పేసుకుంది. రీతూ చౌదరిని టామ్‌బాయ్ హెయిర్‌కట్ చేయించుకోవాలన్నాడు. నాకు ప్రేమగా గోరుముద్దలు తినిపించేది, తనకోసం జుట్టు కత్తిరిచ్చుకోవడానికి రెడీ అని లేచి నిల్చుంది. దీంతో దివ్య నిఖిత.. రీతూ హెయిర్ కట్ చేసింది. జుట్టు కట్ చేస్తుంటే చిన్న పిల్లా ఏడ్చింది రీతూ. శ్రీజ ఇప్పుడు వేసుకున్న డ్రెస్‌తోనే సీజన్ అంతా ఉండాలి.. తన బట్టలన్నీ త్యాగం చేయాలన్నాడు నాగ్.

ఒప్పుకోని సుమన్, శ్రీజ
అందుకు శ్రీజ ఒప్పుకోలేదు. పోనీ సుమన్.. సిగరెట్స్ త్యాగం చేయాలన్నాడు.. సుమన్ కూడా కుదరదంటూ తల అడ్డంగా ఊపాడు. భరణి.. తనకెంతో ఇష్టమైన లాకెట్ బాక్స్‌ను స్టోర్ రూమ్‌లో పెట్టేయాలన్నాడు. వెంటనే భరణి దిగ్గున లేచి బెడ్‌రూమ్‌లో ఉన్న బాక్స్ తీసుకుని స్టోర్ రూమ్‌లో పెట్టి ఎమోషనలయ్యాడు. తనకోసం ఈ నలుగురూ ఇంత త్యాగం చేసేసరికి సంజనా షాక్‌లో ఉండిపోయింది. ఈ త్యాగాల ఫలితంగా ఆమెను తిరిగి హౌస్‌లోకి పంపారు. ఆమె రావడమే గిట్టని హరీశ్.. డెవిల్ ఈజ్ బ్యాక్ అని కామెంట్ చేశాడు.

లత్కోర్ పంచాయితీ
ఇకపోతే నామినేషన్స్‌లో హరీశ్.. పవన్-రీతూలు చాక్లెట్ తినిపించుకుంటూ కెప్టెన్సీ గురించి పథకం రచించిన విషయం గురించి ప్రస్తావిస్తూ లత్కోర్ పనులు అన్నాడు. దాని గురించి మాట్లాడేందుకు నాగ్.. లత్కోర్ హరీశ్ అని పిలిచాడు. నేను వ్యక్తిని అనలేదు, అతడు చేసిన పనిని మాత్రమే అన్నానని హరీశ్ వివరణ ఇచ్చాడు. అయినా నాగార్జున వినలేదు. లత్కోర్ పదం తప్పు.. నువ్వు గౌరవం ఆశించినప్పుడు అంతే గౌరవంగా మాట్లాడాలని క్లాస్ పీకాడు. ఫ్యామిలీ నుంచి లెటర్స్ వచ్చిన టాస్క్‌లో సంచాలక్‌గా తుత్తరపడ్డ శ్రీజకు.. మళ్లీ బిగ్‌బాస్ చెప్పేవరకు ఈరోజు వేసుకున్న డ్రెస్‌లోనే ఉండాలని కండీషన్ పెట్టాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగిసింది.