
(Bigg Boss Telugu 9) వైల్డ్‌కార్డులు తమ ప్రతాపం చూపించాలనుకుంటున్నారో, ఏమో కానీ గొడవలు పడుతూనే ఉన్నారు. మాధురి తగ్గేదేలే అన్న లెవల్‌లో కొట్లాటకు సిద్ధం అవుతుంటే ఆయేషా కావాలని కొందరిని టార్గెట్ చేసి మరీ తిడుతోంది. మరి నిన్నటి (అక్టోబర్ 15వ) ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేద్దాం...
ప్రాంక్ పేరుతో..
సంజనాతో కలిసి ప్రాంక్ గొడవ ప్లాన్ చేసింది మాధురి (Divvala Madhuri). ప్రాంక్ పేరుతో మనసులో ఉన్న కోపం, అక్కసునంతా సంజనాపై కక్కేసింది. ఆమె తిట్ల దండకానికి జడుసుకున్న సంజనా.. వెంటనే కట్ చెప్పేసి ఇదంతా ఊరికనే చేశామని చెప్పి ఊపిరి పీల్చుకుంది. మాధురి.. దివ్యను టార్గెట్ చేసిందో ఏంటోకానీ, మరోసారి ఆమెతో గొడవపడింది. దివ్య సాధారణంగా మాట్లాడుతుంటే కూడా నువ్వెంత? అని చీప్‌గా తీసిపడేసే ప్రయత్నం చేసింది. రూల్స్ పాటించనని, తనకు నచ్చినట్లుగానే ఉంటానని, అది నచ్చకపోతే హౌస్ నుంచి వెళ్లిపోమని దివ్యకు ఆర్డర్ వేసింది. లైవ్‌లో హౌస్‌మేట్స్ అందరికీ ఇంకా చాలానే ఆంక్షలు పెట్టింది.

నా రూల్స్ నచ్చకపోతే వెళ్లిపో
రాత్రి ఇకఇకలు పకపకలు ఉండొద్దని, లైట్స్ ఆఫ్ అయ్యాక అంతా సైలెంట్‌గా ఉండాలంది. మీ అల్లరి వల్ల తన నిద్ర చెడిపోతే క్షమించను అని వార్నింగ్ ఇచ్చింది. పొద్దున పాట వచ్చేవరకు మాట్లాడొద్దని కండీషన్ పెట్టింది. అంతగా మాట్లాడాలనుకుంటే గార్డెన్ ఏరియాకి వెళ్లి సైలెంట్‌గా మాట్లాడుకోమంది. ఈ రూల్స్‌కు రీతూ ఒప్పుకోలేదు. మీరు చెప్పిన మాట వినేందుకు ఇక్కడికి రాలేదు. బిగ్‌బాస్ రూల్స్ మాత్రమే పాటిస్తా అని కరాఖండిగా చెప్పింది. నా రూల్స్ నచ్చకపోతే బిగ్‌బాస్ హౌస్ నుంచి వెళ్లిపోమనగా.. నేనెందుకు వెళ్తా.. కావాలంటే మీరే వెళ్లిపోండి అని ఇచ్చిపడేసింది రీతూ. మాధురి రూల్స్ పెడుతుంటే కెప్టెన్ ఏం చేస్తున్నాడో మరి!

ఓవరాక్షన్ ఆపవే..
కిచెన్‌లో గిన్నెలు తోమే దగ్గర ఆయేషా, రీతూకి పంచాయితీ అయింది. రాత్రి గిన్నె కడగనని ఆయేషా.. అది అర్ధరాత్రి సింక్‌లో వేశారని రీతూ గొడవపడ్డారు. నీ పని నువ్వు చేయకపోతేనే కదా అడుగుతున్నాను.. ఫస్ట్ కరెక్ట్‌గా ఉండు.. అని కోప్పడింది ఆయేషా. నువ్వు కూడా ఉండని రీతూ అనగా.. నువ్వు ఊరుకోవే.. ఏం పని చేయవు, అడిగితే న్యన్యన్య అంటావ్ అని ఆయేషా వెక్కిరించింది. మధ్యలో మాధురి కూడా దూరిపోయి రీతూపై రెచ్చిపోయింది. ఏయ్.. నీకో స్టాండ్ లేదా? అబద్ధాలు ఆడుతున్నావ్ అంటూ మండిపడింది. రీతూ కూడా తగ్గకుండా ఆమెకు కౌంటర్లిచ్చింది. ఇక గిన్నెలు తోముతున్న ఆయేషా.. ఆపవే ఓవరాక్షన్.. మాటలు ఆపేయ్ ఫస్ట్.. అంటూ రీతూను వాయించేసింది.
పెద్ద లిస్ట్ చదివిన పచ్చళ్ల రమ్య
మరోవైపు పచ్చళ్లపాప రమ్య మోక్ష తన సూపర్ పవర్ ఉపయోగించేసింది. ఈరోజు కోసం నిన్న ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ అంటే ఏదో బిర్యానీ, ఐస్‌క్రీమ్ అంతేగా అనుకునేరు.. కాదుకాదు! టిఫిన్‌లోకి గుడ్డు పెసరట్టు ఉప్మా, పూరి, మైసూర్ బజ్జీ.. లంచ్‌లోకి ఎగ్ బిర్యానీ, చికెన్ జాయింట్స్, వెజ్ టిక్కా పిజ్జా.. సాయంత్రం బనానా చిప్స్, నాలుగు ఎగ్ ట్రేలు, మిక్చర్, ఫ్యామిలీ ప్యాక్ ఐస్‌క్రీమ్, చాక్లెట్స్.. డిన్నర్‌కు చికెన్, వెజ్ పికిల్స్, నాన్‌వెజ్ పికిల్స్.. ఇలా పేద్ద లిస్ట్ చదువుకుంటూ పోయింది. ఈ ఫుడ్‌ను హౌస్‌మేట్స్ అందరూ ఆస్వాదించేందుకు వీల్లేదు. కేవలం రమ్య.. ఆమె సెలక్ట్ చేసిన సుమన్ మాత్రమే కలిసి షేర్ చేసుకోవాలి.