అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా క్రేజీ కల్యాణం. బద్రప్ప గాజుల దర్శకత్వంలో బూసం జగన్ మోహన్రెడ్డి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్తో దూసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా బరాత్ పేరుతో ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్కు హాజరైన డైరెక్టర్ బద్రప్ప గాజుల ఫుల్ ఎమోషనల్ అయ్యారు. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను వేదికపైకి పిలిపించి మాట్లాడారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను నాన్నను హగ్ చేసుకోలేదని అన్నారు. ఏ పని చేయకుండా గాలికి తిరిగానని..నా కోసం అమ్మా, నాన్నలు చాలా కష్టపడ్డారని తెలిపారు. ఈ రోజు వేదికపైకి పిలిచి అమ్మా, బాపును మనస్ఫూర్తిగా హత్తుకోవాలని ఉందని బద్రప్ప భావోద్వేగానికి గురయ్యారు.
డైరెక్టర్ బద్రప్ప మాట్లాడుతూ.."నాకొక చిన్న కోరిక ఉందండి. నా చిన్నప్పుడు మా బాపు నన్ను ఎత్తుకుని ఉంటాడు. కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను నాన్నను హగ్ చేసుకోలేదు. మా అమ్మ, నాన్నను వేదికపై హగ్ చేసుకోవాలనుకుంటున్నా. నేను ఏ పని చేయకుండా గాలికి తిరిగాను. నా కోసం చాలా కష్టపడ్డారు. బాపు నేను సినిమా తీసినా. నీ పేరు నిలబెడతా. ఇప్పటికీ పొలంలో పనిచేస్తారు. మా ఇంట్లో మనుషులకు జ్వరం వచ్చినా నాన్న బర్రెలనే పట్టించుకుంటాడు. ఇప్పటి వరకు వీళ్ల సంతోషం కోసం నేను ఏమి చేయలేదు. ఇప్పుడు మీ గురించే సినిమా తీసినా' అంటూ ఎమోషనల్ అయ్యారు.


