
కొన్నిరోజుల ముందు వరకు వేతనాల పెంపు విషయంలో సినీ కార్మికులు-టాలీవుడ్ నిర్మాతల మధ్య సస్పెన్స్ నడిచింది. రీసెంట్‌గానే అది కొలిక్కి వచ్చింది. ఎప్పటిలానే షూటింగ్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ నిర్మాతలు-దర్శకులు ఆదివారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఇండస్ట్రీ గురించి, సినీ కార్మికుల గురించి మాట్లాడారు.
జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, డివివి దానయ్య, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగా, అనిల్ రావిపూడి తదితరులు ఉన్నారు. వీళ్లతో రేవంత్ రెడ్డి పలు విషయాలు చర్చించారు.
(ఇదీ చదవండి: 100వ సినిమా తర్వాత రిటైర్ మెంట్: దర్శకుడు ప్రియదర్శన్)
'సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగా ఉండాలి. సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడుతా. ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీకి పూర్తి సహకారం ఉంటుంది. పరిశ్రమలోకి కొత్త గా వచ్చే వారికి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలి. తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. పరిశ్రమలో వివాదం వద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించాను. కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలి. నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి ఓ పాలసీ తీసుకువస్తే బాగుంటుంది. సినీ కార్మికులను, నిర్మాతలను మా ప్రభుత్వం కాపాడుకుంటుంది'
'సినిమా పరిశ్రమ కు మానిటరింగ్ అవసరం. పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదు. పరిశ్రమ విషయంలో నేను న్యూట్రల్ గా ఉంటా. హైదరాబాద్లో ఇంటర్నేషనల్ సినిమాల షూటింగ్ కూడా జరుగుతోంది. తెలుగు చిత్రాల షూటింగ్ ఎక్కువగా రాష్ట్రంలోనే జరిగేలా చూడాలి. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమని ఉంచడమే నా ధ్యేయం' అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: ఆసక్తికరంగా 'లోక' ట్రైలర్.. సూపర్ హీరో కాన్సెప్ట్)