
ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ (Priyadarshan) రిటైర్‌మెంట్ ప్లాన్స్ ప్రకటించాడు. వంద సినిమాల మైలురాయిని చేరగానే మూవీ ఇండస్ట్రీ నుంచి విశ్రాంతి తీసుకుంటానన్నాడు. ప్రస్తుతం ఇతడు కొచ్చిలో హైవాన్ మూవీ షూట్ చూస్తున్నాడు. ఇందులో సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మలయాళ మూవీ ఒప్పమ్‌కు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది.
100వ సినిమాతో గుడ్‌బై
తాజాగా దర్శకుడు ప్రియదర్శన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం హైవాన్ సినిమా చేస్తున్నాను. ఇందులో ఒప్పం హీరో మోహన్‌లాల్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఆయన రోల్ ప్రేక్షకులను కచ్చితంగా సర్‌ప్రైజ్ చేస్తుంది. అలాగే మోహన్‌లాల్‌ను హీరోగా పెట్టి ఓ సినిమా చేయాలనుకుంటున్నాను. మరోపక్క హెరా ఫెరి 3 సినిమా బాధ్యత నాపై ఎలాగో ఉంది. నా 100వ సినిమా అయిపోయాక రిటైర్ అవ్వాలనుకుంటున్నాను. ఇప్పటికే చాలా అలిసిపోయాను అని చెప్పుకొచ్చాడు.
ఫస్ట్, లాస్ట్ సినిమా ఆ హీరోతోనే!
కాగా మోహన్‌లాల్, ప్రియదర్శన్ చిన్ననాటి స్నేహితులు. మోహన్‌లాల్ హీరోగా నటించిన పూచక్కొరు మూకుత్తి (1984) మూవీతోనే ప్రియదర్శన్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. దీనికంటే ముందు మోహన్‌లాల్ నటించిన తిరనోత్తం (1978)సినిమాకు దర్శకుడు వి. అశోక్ కుమార్ వద్ద ప్రియదర్శన్ అసిస్టెంట్‌గా పని చేశాడు. పలు కారణాల వల్ల దశాబ్దాల తరబడి వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ 2005లో రిలీజైంది. ప్రియదర్శన్ ఏ హీరో (Mohanlal)తో అయితే తన ప్రస్థానం మొదలుపెట్టాడో అదే హీరోతో చివరి సినిమా చేసి రిటైర్ అవ్వాలనుకుంటున్నాడు.