
సినీ రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ విండో ద్వారా ఒక సినిమాకు కావాల్సిన అనుమతులన్నీ ఇచ్చేలా ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ పేరుతో ఒక వెబ్‌సైట్ రూపొందించనున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సినిమా షూటింగ్ అనుమతులకు, థియేటర్స్ నిర్వహణలకు పొందాల్సిన అనుమతల్ని ఈ వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు. ఈమేరకు హైదరబాద్‌లో ప్రత్యేక వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజుతో పటాఉ ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ సి.హెచ్.ప్రియాంక, టూరిజం కార్పొరేషన్ ఎండీ క్రాంతి పాల్గొన్నారు.
తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో సానుకూలంగా ఉన్నారని దిల్ రాజు చెప్పారు. సినీ నిర్మాతలు కేవలం స్క్రిప్ట్‌తో వచ్చినా సరే వారి సినిమాకు కావాల్సిన షూటింగ్ లొకేషన్లతో పాటు అందుకు కావాల్సిన అనుమతులు సింగిల్ విండో ద్వారా లభిస్తాయన్నారు. సినిమా థియేటర్ల నిర్వహణకు కావాల్సిన బీ-ఫామ్‌ను చాలా సులువుగా ఆన్‌లైన్ ద్వారా పొందేలా కొత్త విధానాన్ని ప్రవేశ పెడుతున్నట్లు ఆయన అన్నారు.
థియేటర్ల నిర్వహణ కోసం ఇప్పటి వరకు ఉన్న పద్ధతుల్లో మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. ఈ వెబ్‌సైట్‌ను రూపొందించేందుకు చిత్ర పరిశ్రమ ప్రతినిధుల నుంచి పలు సలహాలతో పాటు సూచనలు తీసుకుంటామన్నారు. వెబ్‌సైట్‌ను పూర్తి స్థాయిలో రూపొందించాక సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో ప్రారంభిస్తామని దిల్ రాజు అన్నారు.