Chandrababu Arrest Tollywood Reacts: బాబు అరెస్ట్.. సినిమా డైలాగ్స్ కొడుతున్న ఆ సెలబ్రిటీస్

Chandrababu Arrest Tollywood Celebrities Comments Analysis - Sakshi

అవినీతిలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయి చంద్రబాబు జైలుకెళ్లినా.. ఆయన వల్ల ఏదో రూపంలో లబ్ధి పొందిన  కొందరు సినీ ప్రముఖులు బ్రహ్మాండం బద్దలైపోయినట్లు లోకమంతా అన్యాయమైపోయినట్లు గగ్గోలు పెట్టేస్తున్నారు. తాము అభిమానించే చంద్రబాబును విడుదల చేయాలని కోరితే ఓకే  అనుకోవచ్చు. కానీ  చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేసిన ఏపీ ప్రభుత్వాన్ని అర్జంట్‌గా రద్దు చేసేసి, రాష్ట్రపతి పాలన పెట్టేయాలంటూ  కొందరు ఉన్మాద డిమాండ్లు చేస్తున్నారు. తాను అవినీతికి పాల్పడలేదని చంద్రబాబే చెప్పలేకపోతున్నారు. ఆయన తరపు న్యాయవాదులూ ఈ మాట అనడం లేదు. కానీ కొందరు సినీ మనుషులు మాత్రం కణ్వమహర్షిని అరెస్ట్ చేసినట్లు తెగ బాధపడిపోతున్నారు. దీన్ని చూసి మేథావులు ఏవగించుకుంటున్నారు.

రూ.371 కోట్ల లూటీ అయిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి అవినీతిని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆధారాలతో పట్టించిన సంగతి తెలిసిందే. ఆ ఆధారాలు చూసిన తర్వాతనే గౌరవ న్యాయమూర్తి చంద్రబాబును జైలుకు పంపారు. ఈ కుంభకోణంలో తాను డబ్బులు తినలేదని కానీ, తన షెల్ కంపెనీలకు డబ్బులు రాలేదని కానీ చంద్రబాబు అనలేదు. ఆయన  కోర్టులో వాదించిందల్లా తనను అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల లోపు  కోర్టులో హాజరు పరచలేదని ఫిర్యాదు చేశారు. అయితే సీఐడీ పోలీసులు నిబంధనల ప్రకారమే నడుచుకున్నారని ఏసీబీ కోర్టు భావించింది. అందుకే చంద్రబాబు నాయుడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు.

చంద్రబాబు నాయుడు అక్రమాలకు పాల్పడ్డారని తెలిసినా కూడా కొంతమందికి మాత్రం ఆయన్ను అరెస్ట్ చేయడం  నచ్చడం లేదు. అందులోనూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రకరకాలుగా  ఆర్ధికంగా పదవుల పరంగా లబ్ధి పొందిన  కొందరు సినీ రంగ ప్రముఖులయితే చంద్రబాబును అరెస్ట్ చేయడం మహా అపరాధం అన్నట్లు విలవిల్లాడిపోతున్నారు. చంద్రబాబునే అరెస్ట్ చేస్తారా? అంటూ  పళ్లు పటపట కొరికేస్తున్నారు.

సినీ నిర్మాత, టిడిపి కార్యకర్త, చంద్రబాబు హయాంలో భూముల పరంగా లబ్ధిపొందిన కొద్ది మంది అస్మదీయుల్లో ఒకరు అయిన అశ్వనీదత్ అయితే చంద్రబాబును అరెస్ట్ చేసిన వారిలో ఏ ఒక్కరికీ పుట్టగతులుండవని శపించేశారు. అదేదో సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్లు అశ్వనీదత్‌కు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఆయన శాపాలు నిజం అయిపోయేవేమో!

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వంలో పదవి అనుభవించిన దర్శకుడు  కె.రాఘవేంద్రరావు సహజంగానే  రుణం తీర్చుకోవాలి. కాబట్టి చంద్రబాబు నాయుడి అరెస్ట్ అన్యాయం అన్నారు. అది రాజకీయ కక్ష సాధింపే అని కూడా అన్నారు. ఆయన్ను విడుదల చేయాలని కోరారు. అందులో ఎలాంటి తప్పూ లేదు కానీ చంద్రబాబు నాయుడు అవినీతి చేస్తూ దొరికిపోయినట్లు లోకంలో ప్రతీ ఒక్కరికీ తెలిసినా బాబు అభిమానులు ఇలాంటి డిమాండ్లతో కాలక్షేపం చేయాలనుకోవడమే ఆశ్చర్యంగా ఉందంటున్నారు మేధావులు.

ఇక మరో నిర్మాత కె.ఎస్.రామారావు అయితే చాలా క్రియేటివిటీ చూపించారు. కమర్షియల్‌గా చంద్రబాబు వల్ల ఆయన ఏం లబ్ధి పొందారో తెలీదు కానీ చంద్రబాబుపై ఉన్న కేసులో ఆధారాలు లేవని రామారావు అనేశారు. ఆధారాలు లేకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు దర్యాప్తు చేస్తున్నాయి?.. రాష్ట్ర దర్యాప్తు సంస్థ  బాబును ఎందుకు అరెస్ట్ చేసింది? ఆధారాలు లేకపోతే ఎందుకు న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు? ఆధారాలు లేకపోతే చంద్రబాబు నాయుడు ఎందుకు న్యాయస్థానంలో దాన్ని సవాల్ చేయలేదు? 

చంద్రబాబు అరెస్ట్ మీకు తెలీకుండానే జరిగిందా? అంటూ కె.ఎస్.రామారావు  ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. అంత వరకు ఫర్వాలేదు. చంద్రబాబు నాయుడు చాలా నిజాయితీ పరుడు అని అభిప్రాయపడ్డారు. పోనీలే అది ఆయన అభిప్రాయం అనుకోవచ్చు. కానీ ఓ పిచ్చి డిమాండ్ కూడా చేశారు రామారావు. ఉన్నట్లుండి జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రద్దు చేసేయాలట. జగన్‌మోహన్ రెడ్డిని దింపేసి రాష్ట్రపతి పాలన విధించేయాలట? రాజ్యాంగం ప్రకారం ప్రజలు  ఎన్నుకున్న ప్రభుత్వాలపైనా, ప్రజాస్వామ్యంపైనా  కేఎస్ రామారావుకు ఎంత గౌరవం ఉందో ఈ వ్యాఖ్యలే చెబుతున్నాయి.

సినిమా డైలాగులు సినిమాల్లో బాగుంటాయి. బయటకు వచ్చినపుడు పైన చెప్పినోళ్లంతా మనుషుల్లా మాట్లాడాలి అంటున్నారు రాజకీయ పండితులు. చంద్రబాబు అవినీతి చేశాడా? లేదా అన్నది కోర్టులు తేలుస్తాయి. ఒకవేళ ఆయన తప్పు చేయలేదని కోర్టు నమ్మితే ఆయన్ను విడుదల చేస్తాయి. ఆయన తప్పునకు దర్యాప్తు సంస్థలు సమర్పించిన ఆధారాలు సరైనవే అని భావిస్తే చంద్రబాబు నాయుడికి చట్టం ప్రకారం శిక్ష విధిస్తారు. ఈ లోగా చంద్రబాబు నాయుడి దగ్గరో ఆయన పార్టీ నేతల దగ్గరో లేదంటే చంద్రబాబు కొమ్ము కాసే పత్రికల దృష్టిలో పడాలనో.. ఇలాంటి సినీ ప్రముఖులు నోటికెంతొస్తే అంతా మాట్లాడ్డం మాత్రం క్షమించరాని నేరమే అంటున్నారు విశ్లేషకులు.

:::CNS యాజులు, సీనియర్‌ జర్నలిస్టు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top