భారత్ పెవిలియన్‌లో ప్రాంతీయ భాషా చిత్రాల సందడి
టీజర్, పోస్టర్లతో తెలుగు ‘ఆటాడిన పాట’ చిత్ర ప్రచారం
ఫ్రాన్స్‌లో ఏటా జరిగే ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కేన్స్ చలనచిత్రోత్సవం ఈసారి కూడా సందడిగా సాగుతోంది. మే నెల 12న మొదలైన ఈ ఏటి 79వ కాన్ చలనచిత్రోత్సవంలో పలువురు అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొంటున్నారు. ఫ్రెంచ్ పీరియడ్ – కామెడీ చిత్రం ‘ది ఎలక్ట్రిక్ కిస్’తో ఆరంభమైన ఈ వేడుకలో భారత ప్రభుత్వం సైతం మన దేశీయ సినీ పరిశ్రమను అంతర్జాతీయంగా మరింత మందికి చేరువ చేసేందుకు ‘భారత్ పెవిలియన్’ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సారథ్యంలోని ‘నేషనల్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్’, అలాగే వందేళ్ళ సుదీర్ఘ చరిత్ర గల ప్రతిష్ఠాత్మక భారతీయ వ్యాపార సంఘం ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ (ఫిక్కీ) సమష్టిగా వివిధ భారతీయ సినిమాల ప్రమోషన్‌కు ఈ ‘భారతీయ పెవిలియన్’ ద్వారా వేదికను కల్పిస్తున్నాయి.
తెలుగు నుంచి సోషియో - ఫ్యాంటసీగా...
వివిధ దేశాల సినీ రంగాలకు ఏర్పాటు చేసిన పెవిలియన్ల లానే భారతీయ సినీ పరిశ్రమ కోసం ప్రత్యేకంగా పెట్టిన ‘భారత్ పెవిలియన్’లో మే 15, శుక్రవారం ఓ తెలుగు సినిమా ప్రమోషన్ కూడా జరగడం విశేషం. ‘ది గేమ్ ఆఫ్ సాంగ్’ (ఆటాడిన పాట) అనే తెలుగు చిత్రం టీజర్, పోస్టర్ విడుదల అక్కడ జరిపారు. నక్షత్రం ప్రొడక్షన్స్ పతాకంపై అవంతిక నక్షత్రం ఈ చిత్రాన్ని నిర్మించగా, ప్రముఖ కథా, నవలా రచయిత వేణు నక్షత్రం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. కాన్ ఫిలిం ఫెస్టివల్‌లో ‘లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్’ (ఎల్ఐఎఫ్ఎఫ్) ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రోగ్రామింగ్ డైరెక్టర్ అయిన క్యారీ సాహ్ని చేతుల మీదుగా ఈ సినిమా టీజర్, పోస్టర్‌ను ఆవిష్కరించి, సభికులకు ప్రదర్శించారు. సోషియో- ఫ్యాంటసీ జానర్‌లో రూపొందిన ఈ ‘ఆటాడిన పాట’లో అభినవ్ గోమఠం, స్వాతీ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు.
“ఇదో వినూత్న ప్రయోగం. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి అయింది. తెలుగులో రూపొందించిన ఈ చిత్రాన్ని పలు భారతీయ భాషల్లోకి కూడా అనువాదం చేస్తున్నాం” అని రచయిత, దర్శకుడు వేణు నక్షత్రం తెలిపారు. ఈ చిత్రానికి రాహుల్ మాచినేని ఛాయాగ్రహణం, టి.ఆర్. సెల్వకుమార్ కూర్పు, కార్తీక్ కొడకండ్ల సంగీతం అందిస్తున్నారు. ‘భారత్ పెవిలియన్’లో జరిగిన ఈ చిత్ర కార్యక్రమానికి హాజరైన పలువురు సినీ ప్రముఖులు ప్రయోగాత్మకంగా నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను ఆసక్తిగా గమనించారు. టీజర్‌ను ఆవిష్కరించిన క్యారీ సాహ్ని సహా పలువురు చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వాహణకు సహకరించిన డైరెక్టర్ శర్వి, తదితర మిత్రులు, ఆహూతులకు వేణు నక్షత్రం ధన్యవాదాలు తెలిపారు.
గుజరాతీ చిత్ర పరిశ్రమ సైతం...
వివిధ భారతీయ భాషా చిత్రాలు అంతర్జాతీయంగా తమను తాము మార్కెట్ చేసుకొనేందుకు కాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారత్ పెవిలియన్ వేదికను కల్పిస్తోంది. ఇప్పటికే పలు భారతీయ భాషా చిత్ర పరిశ్రమలు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. హిందీ టీవీ నుంచి గుజరాతీ చిత్రసీమలో ప్రముఖ నటిగా ఎదిగి, గుజరాతీ చిత్రం ‘కచ్ ఎక్స్ ప్రెస్’ (2023) ద్వారా జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న మానసీ పారేఖ్ ఈసారి కాన్‌లో గుజరాతీ సినిమా పక్షాన జోరుగా ప్రచారం చేస్తూ, రకరకాల ఫ్యాషన్ దుస్తులతో ఫోటోలు దిగుతూ, అందరినీ ఆకర్షిస్తున్నారు.
నిరుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని ముఖ్య పాత్రగా చేసుకొని, అతి తక్కువ బడ్జెట్‌లో నిర్మాణమై, కనివిని ఎరుగని వసూళ్ళతో గుజరాతీ సినీ పరిశ్రమ వైపు దేశమంతా తిరిగి చూసేలా చేసిన సోషియో-ఫ్యాంటసీ ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ చిత్ర దర్శకుడు సహా పలువురు ఆ పరిశ్రమ నుంచి అక్కడ సందడి చేస్తున్నారు. ఈ మే 23 వరకు మరో వారం రోజుల పాటు ఈ కాన్ చలనచిత్రోత్సవం సాగనున్నందున తెలుగు చిత్రసీమతో పాటు ఇతర భారతీయ భాషల నుంచి మరెన్ని విశేషాలు చోటుచేసుకుంటాయో చూడాలి.


