హరనాథ్ మంచి మనసున్న వ్యక్తి

– సూపర్ స్టార్ కృష్ణ
‘‘నేను, హరనాథ్ కలిసి చాలా సినిమాల్లో నటించాం. అతను నిజమైన అందాల నటుడు.. అలాగే మంచి మనసున్న వ్యక్తి. నేను హీరోగా నటించిన ‘మా ఇంటి దేవత’ చిత్రాన్ని కూడా నిర్మించారు హరనాథ్’’ అని సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు. బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో అప్పటి అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్నారు హీరో బుద్ధరాజు హరనాథ్ రాజు. 1936లో సెప్టెంబర్ 2న జన్మించిన ఆయన తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో 167 సినిమాల్లో నటించారు.
1989, నవంబర్ 1న మరణించారాయన. కాగా హరనాథ్ జీవిత చరిత్రను ‘అందాల నటుడు’ పేరుతో డా.కంపల్లి రవిచంద్రన్ రచించారు. శుక్రవారం హరనాథ్ జయంతి సందర్భంగా ఈ పుస్తకాన్ని సూపర్ స్టార్ కృష్ణ విడుదల చేశారు. ఈ పుస్తకావిష్కరణలో హరనాథ్ కుమార్తె జి. పద్మజ, అల్లుడు జీవీజీ రాజు (‘తొలి ప్రేమ, గోదావరి’ చిత్రాల నిర్మాత), మనవళ్లు శ్రీనాథ్ రాజు, శ్రీరామ్ రాజు, పుస్తక రచయిత కంపల్లి రవిచంద్రన్ పాల్గొన్నారు.