స్టూడెంట్ నెం.1, సింహాద్రి, సై, విక్రమార్కుడు, ఛత్రపతి, మగధీర, ఆర్‌ఆర్‌ఆర్.. ఇలా తెలుగులో అనేక హిట్ సినిమాల్లో నటించాడు చంద్రశేఖర్. అయితే ఛత్రపతి శేఖర్‌గానే స్థిరపడిపోయాడు. వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఓ వెలుగు వెలిగిన ఇతడు బుల్లితెరపై సీరియల్స్ కూడా చేస్తున్నాడు. తాజాగా శేఖర్ ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ఓపింక నశించి..
ఛత్రపతి శేఖర్ (Actor Chatrapathi Sekhar) మాట్లాడుతూ.. నాకు చిన్నప్పటినుంచే సినిమాలంటే ఇష్టం. దేవదాసు కనకాల ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నాను. పెళ్లయ్యాకే ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. మంచి గుర్తింపు వచ్చింది. ఒకానొక సమయంలో మా మధ్య గొడవలు వచ్చాయి. మా మధ్య ఓపిక నశించిపోయింది. రోజూ కొట్లాడుకుని పరేషాన్ అయ్యేబదులు దూరంగా ఉంటే మంచిదనుకున్నాం.

నాదే తప్పు
ఒకరి మనసు మరొకరు నొప్పించకుండా విడిపోతే బెటర్ అని ఫీలయ్యాం. అయితే తప్పంతా నాదే! నేను బద్ధకస్తుడిని. ఏదైనా చెప్తే వినను. వాళ్లను, వీళ్లను కలువు.. పని దొరికితే డబ్బులొస్తాయని ఆమె అనేది. నేనేమో బద్ధకస్తుడిలా ప్రవర్తించేవాడిని. ఇలా మేము విడిపోవడానికి చాలా కారణాలున్నాయి. చేయిచాచి సాయం అడిగినవారికి కాదనుకుండా డబ్బులిచ్చేవాడిని. వాళ్లు తిరిగిచ్చేవాళ్లు కాదు, నేను కూడా ఫోన్ చేసి అడిగేవాడ్ని కాను.
ఫోన్ చేసింది, కానీ డబ్బయితే ఇవ్వలేదు
బిగ్‌బాస్ ఫేమ్, సీరియల్ నటి కీర్తి భట్‌ను నా కూతురిలాగే చూసుకున్నాను. తనకు డబ్బు సాయం చేస్తే ఇంతవరకు తిరిగివ్వలేదని ఓ ఇంటర్వ్యూలో అన్నాను. అది చూసి కీర్తి నాకు ఫోన్ చేసింది. నా గురించి ఎందుకలా నెగెటివ్‌గా మాట్లాడారంది. చూస్తే అందులో నేనేమీ తప్పు మాట్లాడలేదు. ఆ తర్వాత కూడా ఒకటీరెండుసార్లు ఫోన్ చేసింది. కానీ, నాకివ్వాల్సిన డబ్బు మాత్రం తిరిగివ్వలేదు. నేను కూడా అడగలేదు. మనసిచ్చి చూడు సీరియల్‌లో నేను సంపాదించినదానికన్నా పోగొట్టుకుందే ఎక్కువ. అడిగినవారికల్లా పంచేశాను.
పెళ్లి - విడాకులు
బిగ్‌బాస్ షోలో ఛాన్స్ వస్తే అస్సలు వెళ్లను. ఒకవేళ వెళ్తే రెండు రోజుల్లో తిరిగొచ్చేస్తాను అని శేఖర్ చెప్పుకొచ్చాడు. చంద్రశేఖర్.. నీల్యా భవానీని పెళ్లి చేసుకున్నాడు. ఈమె కూడా సినిమాల్లో చిన్న పాత్రలు పోషించేది. ఈ దంపతులకు ఓ కుమారుడు, కూతురు సంతానం. మనస్పర్థల వల్ల శేఖర్-భవానీ విడాకులు తీసుకుని వేర్వేరుగా జీవిస్తున్నారు. ప్రస్తుతం అతడి భార్యాపిల్లలు అమెరికాలో ఉంటున్నారు. మనసిచ్చి చూడు సీరియల్‌లో కీర్తి భట్ తండ్రిగా నటించాడు శేఖర్. యాక్సిడెంట్‌లో అమ్మానాన్నని కోల్పోయిన కీర్తి.. ఈ సీరియల్ తర్వాత శేఖర్‌ను నాన్న అని పిలవడం మొదలుపెట్టింది.
చదవండి: మాజీ కోడలిపై ఎంత ప్రేమో? బర్త్‌డే మనవరాలిదైతే బహుమతులు..!


