
నవ్వు నాలుగు విధాల మంచిదని కొందరంటే.. నవ్వు నాలుగు విధాల చేటు.. అని మరికొందరంటారు. అయితే ఇప్పుడు బతుకు పోరాటం వల్ల పదిమందిలో కూర్చోని కబుర్లు చెప్పుకుంటూ నవ్వే వారు లేరు. అందుకే నాలుగు గోడల మధ్య సినిమా థియేటర్‌కు వెళ్లి నవ్వుకోవాల్సిన పరిస్థితి ఉంది. నేడు ‘ప్రపంచ నవ్వుల దినోత్సవం’ సందర్బంగా మనల్ని బాగా నవ్వించే నటుడు బ్రహ్మానందం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. దేశంలోనే బెస్ట్ కమెడియన్స్ లిస్ట్‌లో మన బ్రహ్మీ టాప్‌లో ఉంటారు. ఆపై అందరికంటే ఎక్కువ సినిమాలు చేసిన రికార్డ్ కూడా ఆయన పేరుతోనే ఉంది. ఒక్కో సినిమాకు బ్రహ్మానందం రెమ్యునరేషన్ ఎంత..? ఆయన ఆస్తుల వివరాలు ఎంత ఉండవచ్చు అనే విషయాలు తెలుసుకుందాం.
బ్రహ్మానందం ఒక్కో సినిమాకు రూ. 2 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటారు. సినిమాలో తన పాత్రను బట్టి రోజుకు రూ. 10 లక్షల వరకు తీసుకుంటారని సమాచారం. అంతేకాకుండా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు , టెలివిజన్ ప్రకటనల ద్వారా కూడా ఆయన గణనీయమైన ఆదాయం సంపాదిస్తారు. ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు సుమారు రూ1.5 కోట్లు సంపాదిస్తారని తెలుస్తోంది. సుమారు వెయ్యికి పైగా చిత్రాల్లో నటించిన బ్రహ్మానందం ఆస్తి రూ. 500 కోట్లకు పైగానే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా బ్రహ్మానందం పంచే కామెడీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. తెరపై ఆయన కనిపిస్తే చాలు ఆడియెన్స్ విజిల్స్ వేస్తారు. అలా హాస్య ప్రపంచానికి రాజు మన బ్రహ్మీనే అని చెప్పవచ్చు. కేవలం ఆయన పండించిన నవ్వుల వల్లనే కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి.
రెమ్యునరేషన్ విషయంలో ఇలాగే ఉంటా: బ్రహ్మానందం
రెమ్యునరేషన్ విషయంలో బ్రహ్మానందంపై చాలా రూమర్లు వచ్చాయి. పారితోషికం విషయంలో ఆయన చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని చాలా మంది ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. ఇదే అంశంపై ఆయన గతంలో ఇలా చెప్పారు. 'చిత్రపరిశ్రమలో చాలా మంది నుంచి ఏం నేర్చుకోవాలో నేను ఇప్పటికీ తెలుసుకోలేదు. కానీ, ఏం నేర్చుకోకూడదో అనేది మాత్రం పూర్తిగా తెలుసుకున్నాను. మన చుట్టూ డబ్బుని పెద్దగా పట్టించుకోని వాళ్లు చాలా మంది ఉన్నారు. నా వరకు అయితే.. డబ్బు విషయంలో గట్టిగానే ఉంటాను. అలా లేకపోతే మన కష్టానికి వంద రూపాయలు ఇచ్చేవాడు.. పది రూపాయలు ఇచ్చి సరిపెడుతాడు. అలాంటి సమయంలో మన జీవితం ఎలా ఉంటుంది..? అందుకే నేను డబ్బుకు గౌరవం ఇవ్వడం అలవాటు చేసుకున్నాను. అలా జీవించాను కాబట్టే మా కుటుంబంలోని 23 మంది ఆడపిల్లలకు వివాహాలు చేశాను. వారందరికీ పెళ్లిల్లు చేయకపోతే జీవితాలు ఏమయ్యేవి..? బాధ్యత తీసుకున్నప్పుడే డబ్బు విలువ తెలుస్తోంది. ఇలా బహిరంగంగా అలాంటి విషయాలు చెప్పుకోవాల్సిన పనిలేదు.' అని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు.