సెకండ్ ఛాన్స్ కోసం భరణి, శ్రీజ బిగ్‌బాస్ హౌస్‌లో పోటీపడుతున్నారు. వీరిలో ఒక్కరికే స్థానం ఉంటుందన్న బిగ్‌బాస్.. రకరకాల టాస్కులిచ్చాడు. అందులో భరణి గాయాలపాలై ఆస్పత్రికి కూడా వెళ్లొచ్చాడు. అటు రేషన్ మేనేజర్‌గా ఉన్న తనూజకు గొడవలు తప్పడం లేదు. ఏకంగా రాజు (మాధురి)తో కూడా గొడవ జరిగింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో బుధవారం (అక్టోబర్ 29వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..
ఫెయిలైన సంచాలకులు
శ్రీజ- భరణి కోసం మొదటగా కట్టు- పడగొట్టు టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో భరణి, ఇమ్మాన్యుయేల్‌ను ఒక్కటే కట్టడి చేసి శెభాష్ అనిపించుకున్నాడు డిమాన్ పవన్. కానీ, అతడి కష్టాన్ని ప్రేక్షకులకు కనిపించకుండా ఎపిసోడ్‌లో సరిగా వేయనేలేదు. ఫస్ట్ రౌండ్‌లో శ్రీజ గెలిచిందని కల్యాణ్.. కాదు, భరణి గెలిచాడని సుమన్ వాదించారు. దీంతో బిగ్‌బాస్.. ఈ ఇద్దర్నీ సంచాలకులిగా తప్పించాడు. కొత్త సంచాలక్ మాధురి.. శ్రీజ గెలిచినట్లు ప్రకటించింది.
మాధురి వర్సెస్ తనూజ
రెండో రౌండ్‌లో భరణి (Bharani Shankar) గాయాలపాలవడంతో పాటు ఎవరూ గెలవలేదు. భరణిని ఆస్పత్రికి తీసుకెళ్లి మళ్లీ హౌస్‌లోకి పంపించారు. ఇక కిచెన్‌లో గొడవ మొదలైంది. చపాతీలు లావుగా వస్తున్నాయని తనూజ అంది. పక్కనే చపాతీ చేస్తున్న మాధురి.. మేమేమీ హోటల్ సర్వర్లము కాము.. మాకు రాదు అంటూ అక్కడ పడేసి వెళ్లిపోయింది. మేము కూడా హోటల్‌లో పని చేసి రాలేదు, అయినా పని చేస్తున్నాం. రాకపోతే చెప్పండి, వేరేవాళ్లు చేసుకుంటారని తనూజ కౌంటరిచ్చింది.

అన్నంపై అలిగిన సంజనా
తగ్గుతుంటే ఏదో అనుకుంటున్నావేమో.. ప్రేమకి తగ్గుతున్నా.. నువ్వు అరుస్తుంటే తగ్గట్లేదు. నేను మాటలు పడటానికి రాలేదు. మీకు సపోర్ట్‌గా ఉంటే బాగుంటుంది. న్యాయం వైపుంటే నచ్చదు అంటూ మాధురి (Divvala Madhuri) సెటైర్లు వేసింది. మీరు టాపిక్ ఎక్కడికో తీసుకెళ్లకండి.. నాన్నను సేవ్ చేయమని అడిగానా? అంటూ తనూజ వాదించగా కాసేపు గొడవ జరిగింది. అటు అన్నం కొద్దిగానే ఉండటంతో.. అన్నం పెట్టుకునేముందు చెప్పాలిగా అని తనూజ సంజనాను ప్రశ్నించింది. దీంతో ఆమె తినే ప్లేటు మీద నుంచి అలిగి వెళ్లిపోయింది.
అందుకే మాధురిపై కోపం లేదు
మరోవైపు రీతూ-పవన్‌ల గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్స్ రోజు మాధురి.. నీకోసం నన్ను అన్ని మాటలు అంటుంటే ఎందుకు స్పందించలేదు? ఎందుకు కోపం రాలేదు? అని గుచ్చిగుచ్చి అడుగుతూనే ఉండేసరికి డిమాన్ పవన్‌కు తిక్క రేగింది. ఆమెను అక్కా అని పిలుస్తున్నా, అందుకే కోపం రాలేదన్నాడు. దీంతో రీతూ మరింత అరిచింది. ఆవేశంలో పవన్ ఓ మాట జారాడు. ఇక చాలు, గుడ్‌బై అని రీతూ అక్కడినుంచి వెళ్లబోతుంటే పవన్ తనను తోసేశాడు.
మాధురికి రీతూ తల్లి ఫోన్
ఈ గొడవలతో పిచ్చెక్కిపోతున్న మాధురి.. పవన్‌తో ఒక్కమాట అడుగుతా.. మీది హెల్తీ రిలేషన్ అయితే వాళ్ల ఇంట్లో వాళ్లు నాకు ఫోన్ చేస్తారా? నీతో మాట్లాడుతుంటే ఆమె తల్లి ఏడుస్తుందని నాకు చెప్తారా? నేను మాట్లాడినదాంట్లో తప్పుంటే సారీ అనేసింది. ఆ తర్వాత కూడా వీళ్లు గొడవపడటం.. కాసేపటికి రీతూ ఎప్పటిలాగే డిమాన్‌కు తినిపించడం జరిగిపోయింది. ఇదంతా వాళ్లకెలా ఉందోకానీ, చూసేవారికి మాత్రం తల బొప్పికడుతోంది.


