కల్కి సీక్వెల్లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే (Deepika Pdukone) భాగం కావడం లేదని ప్రకటన వచ్చిన సమయం నుంచి పెద్ద చర్చే జరుగుతుంది. ముఖ్యంగా పనిగంటల విషయంలోనే విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరిగింది. ప్రభాస్ స్పిరిట్ ఢీల్ విషయంలో కూడా తను రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తానని చెప్పడం వల్లే వదులుకుందని తెలిసింది. అయితే, ఈ విషయంలో కొందరు నెటిజన్లు వైజయంతీ మూవీస్‌కు సపోర్ట్గా నిలిస్తే.. మరికొందరు దీపికా పదుకొనేకు అండగా నిలిచారు.
ప్రభాస్ , నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). గతేడాది విడుదలైన ఈ చిత్రం రూ. 1000 కోట్ల మార్క్ దాటి భారతీయ సినిమాకు అంతర్జాతీయ రేంజ్లో గుర్తింపు పొందింది. ఓటీటీలో కూడా ట్రెండింగ్లో నిలిచింది. అయితే.. దీపికా పదుకొనే, వైజయంతీ మూవీస్ మధ్య ఏర్పడిన వివాదం వల్ల సినిమా ఎండ్ క్రెడిట్స్‌లో దీపికా పేరును తాజాగా తొలగించినట్లు తెలుస్తోంది. ఈమేరకు కొన్ని స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అయితే, దీపికా పదుకొనే పేరు తొలగింపులో వైజయంతీ మూవీస్ పాత్ర లేదని కొందరు చెప్పుకొస్తున్నారు. ఓటీటీ సంస్థ నుంచి వచ్చిన కొన్ని గ్లిచ్స్ వల్ల ఆమె పేరు కనపడకుండా పోయిందని వివరణ ఇస్తున్నారు. ఇది కూడా హిందీ వెర్షన్లో మాత్రమే అలా వస్తుందని క్లారిటీ ఇస్తున్నారు. కానీ, తెలుగులో దీపికా పేరు క్లియర్గా కనిపిస్తుందని కూడా పేర్కొంటున్నారు. అయితే, చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.


