
బిగ్‌బాస్ షోలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపిద్దామనుకుంటే అది కాస్తా ఎన్నో మలుపులు తిరుగుతోంది. నిన్నటి నామినేషన్ ప్రక్రియలో మోనాల్ కోసం అఖిల్, అభిజిత్ కొట్టుకునే పరిస్థితికి వెళ్లారు. దీంతో దయచేసి తన పేరును తీయొద్దంటూ మోనాల్ గద్గద స్వరంతో అరుస్తూ బోరుమని ఏడ్చింది. ఇది నేషనల్ మీడియా అని, తన క్యారెక్టర్‌ను బ్యాడ్ చేయొద్దంటూ చేతులెత్తి వేడుకుంది. అనవసరంగా మోనాల్ మనసును బాధపెట్టామే అని భావించిన అఖిల్, అభిజిత్ ఆమెను క్షమించమని కోరారు.
ఓ వైపు సారీ చెప్తూనే, నేను మాత్రం ఈ టాపిక్ తీయలేదు అని అభిజిత్ తన అభిప్రాయాన్ని చెప్తూ ఉంటే మోనాల్ మాత్రం పాతాళగంగలా మారి ఏడుస్తూ ఉండిపోయింది. దీంతో అతడు స్వయంగా కన్నీళ్లు తుడిచి ఓదార్చాడు. అటు అఖిల్.. వేరే అమ్మాయికి నీ గురించి చెప్పడం తప్పు, అందుకే నీ కోసం కొట్లాడాను, తప్ప నాకు ఒక టాపిక్ దొరకాలని కాదు అని మోనాల్‌కు అర్థమయ్యేలా వివరించాడు. దీంతో అతడికి హగ్ ఇచ్చి కూల్ అయిపోయింది. నిన్న నామినేషన్‌లో అనవసరంగా మోనాల్‌ను మధ్యలోకి లాగి ఏడిపించి ఇప్పుడు సారీ చెప్తున్నారా? అని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
కానీ ఈ గొడవ ఇక్కడివరకు రావడానికి మూల కారణమే మోనాల్. మొదటి నుంచి ఇద్దరితో కలిసి మాట్లాడకుండా ఒకరి తర్వాత ఒకరితో మాట్లాడేది. పైగా అభి ఏమంటున్నాడనేది అఖిల్‌తో, అఖిల్ ఏమంటున్నాడనేది అభితో చెప్పుకొచ్చేది. అక్కడి విషయాలు ఇక్కడ చెప్పకని అఖిల్ కోపగించుకోవడంతో ఆమె కాస్త వెనకడుగు వేసింది. ఇక స్టోర్ రూమ్‌లో అభికి ఐ లైక్ యూ అని చెప్పడం, దీంతో తెగ ఫీలైపోయిన అభి ఈ విషయాన్ని దివి, హారికలతో చెప్పడం, వారు సెటైర్లు వేయడం, దీన్ని నాగార్జున వీకెండ్‌లో అడగటం, మోనాల్ పరువు గంగలో కలిసిపోవడం జరిగింది. అప్పటి నుంచి చాలామంది ఇది బిగ్‌బాస్ షో కాదు మోనాల్ షో అని విమర్శిస్తున్నారు. కంటెస్టెంట్లు అందరికీ ఒక్కరే బిగ్‌బాస్ అయితే మోనాల్‌కు మాత్రం ఇద్దరు బిగ్‌బాస్‌లు ఉన్నారని సెటైర్లు వేస్తున్నారు.